రసాయన ఎరువులతో పండించిన పంట దిగుబడుల నుంచి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండటం, ఖర్చులు కూడా అంతకంతకూ పెరుగుతుండటంతో చెరుకూరి రామారావు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. గత ఎనిమిదేళ్లుగా ప్రకృతి/సేంద్రియ సేద్య పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు, చెరకు, వరి తదితర పంటలు పండిస్తూ.. తాము పండించిన పంట దిగుబడులను వీలైనంత వరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి నికరాదాయం పొందుతున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామంలో 25 ఎకరాల్లో అనేక రకాల కూరగాయలు, అనేక రకాల పండ్లను సాగు చేస్తున్నారు.
పొలంలోనే ఏర్పాటు చేసిన నీటి గుంత (బయో డైజెస్టర్)లోనే సేంద్రియ ద్రావణాన్ని తయారు చేసుకొని, నీటితో పాటు, ప్రతి రోజూ డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ప్రస్తుతం 3 ఎకరాల్లో దొండ, 3 ఎకరాల్లో బోడకాకర (ఆగాకర), రెండెకరాల్లో జామ, బొప్పాయి, 7 ఎకరాల్లో చెరకు పంట, ఎకరంన్నరలో అరటి సాగులో ఉన్నాయి. బీర, కాకర, సొర, పొట్ల, వరి పంటల సాగు కోసం పొలాన్ని సిద్ధం చేస్తున్నారు.
రసాయన అవశేషాల్లేని కూరగాయలు, పండ్లతోపాటు నాలుగు గానుగల ద్వారా వెలికితీసిన ఆరోగ్యదాయకమైన గానుగ నూనెలను ఉత్పత్తి చేస్తున్నారు. గానుగల నుంచి వెలువడే చెక్క (ఆయిల్ కేక్)ను బయో డైజెస్టర్‌లో నానబెట్టి పంటలకు వాడుతున్నారు. ఆర్.ఆర్. ఆర్గానిక్స్ పేరుతో ఖమ్మంలో, రైతుబజార్‌లో దుకాణాలు ఏర్పాటు చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు.
వివిధ సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ అనుభవాలను రంగరించి రామారావు విస్తారమైన తన క్షేత్రానికి అనుగుణంగా, తక్కువ ఖర్చుతో పోషక ద్రావణాన్ని తయారు చేసుకొని పంటలకు అందిస్తున్నారు. సుభాష్ పాలేకర్, చౌహాన్ క్యు, పొన్నుస్వామి, చింతల వెంకటరెడ్డి వంటి నిపుణులు సూచించిన రసాయన రహిత సేద్య పద్ధతులను అవసరం మేరకు అనుసరిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఎకరానికి 5 ట్రాక్టర్ల పశువుల ఎరువు తోలి దుక్కి చేసిన తర్వాత ఎత్తుమడులపై కూరగాయ పంటలను సాగు చేయటం రామారావుకు అలవాటు. పంటలకు ప్రతి రోజూ డ్రిప్ ద్వారా నీటితో పాటు సేంద్రియ పోషక ద్రావణాన్ని కూడా అందిస్తేనే మంచి దిగుబడులు సాధించటం సాధ్యమవుతుందని ఆయన అనుభవం ద్వారా గ్రహించారు.
బయో డైజెస్టర్‌తో మేలు
పొలంలో ఏర్పాటు చేసిన ఫాం పాండ్‌నే రామారావు బయో డైజెస్టర్‌గా వినియోగించుకుంటున్నారు. 20 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు, 12 అడుగల లోతులో 2 లక్షల నీటి సామర్ధ్యం కలిగిన గుంత (ఫాం పాండ్) తవ్వారు. ఈ గుంతలో 500 మైక్రాన్‌ల ప్లాస్టిక్ (టార్పాలిన్) షీట్‌ను పరచారు. నీటితో నింపిన తర్వాత, ఒక ట్రాక్టర్ ట్రక్కు కోళ్ల ఎరువు వేస్తారు. 4 ప్లాస్టిక్ (ఉల్లి గడ్డలు వేసే) సంచులలో ఒక్కో దాంట్లో 25 కిలోల చొప్పున నూనె తీసిన గానుక చెక్కను నింపి, వాటిని నీటి గుంతలో వేలాడ గడతారు. అదే నీటిలో కూరగాయ వ్యర్థాలు, పండ్ల వ్యర్థాలు వేస్తారు. 20 కిలోల చొప్పున బియ్యం నింపిన సంచులు నాలుగింటిని కూడా గుంత నీటిలో వేలాడ దీస్తారు. గానుగ చెక్కలతో కూడిన ప్లాస్టిక్ సంచులను, బియ్యం సంచులను పోషకాలు సరిగ్గా నీటిలో కలిసేందుకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రపు వేళల్లో కొద్ది సేపు అటూ ఇటూ ఊపుతూ కదిలిస్తుంటారు. ఇవన్నీ కుళ్లి పంట మొక్కల పెరుగుదలకు తోడ్పడే సేంద్రియ పోషక ద్రావణం తయారవుతుంది.
మూడంచెల ఫిల్టర్ వ్యవస్థ
గుంతలో తయారైన సేంద్రియ ద్రావణాన్ని మూడంచెలలో వడకట్టి, సూక్ష్మ సేద్య పద్ధతిలో పైర్లకు అందిస్తున్నారు. నీటి గుంతలో ఓ వైపున ఇనుప పైపుల ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి, దాని చుట్టూ 50 శాతం షేడ్‌నెట్‌ను చుట్టారు. 200 లీటర్ల సామర్ధ్యం కలిగిన ప్లాస్టిక్ డ్రమ్ముకు చుట్టూ రంధ్రాలు పెట్టి, ఆ డ్రమ్ము చుట్టూ 30 శాతం షేడ్‌నెట్ కట్టారు. 10 ఇంచుల పీవీసీ పైపునకు రంధ్రాలు చేసి, 120 స్టీల్ మెష్‌ను చుట్టి డ్రమ్ములోకి దించారు. ఒకటిన్నర హెచ్‌పీ విద్యుత్ మోటర్ ఫుట్ బాల్‌కు జాలీ కట్టి పీవీసీ పైపులో అమర్చారు.
నీటి గుంతలో తయారైన సేంద్రియ పోషక ద్రావణాన్ని మూడంచెల్లో ఫిల్టర్ అయ్యేలా ఏర్పాటు చేసి, ప్రధాన నీటి పంపునకు అనుసంధానం చేశారు. సకల పోషకాలనూ అందించే ఈ ద్రావణం మనుషుల ప్రమేయం లేకుండా ప్రతి రోజూ డ్రిప్ ద్వారా మొక్కలకు అందుతుంది. రామారావు రూపొందించిన విధంగా నీటి గుంత (బయో డైజెస్టర్)ను నిర్మించడానికి సుమారుగా రూ. 60 వేలు ఖర్చవుతుంది. ఒకసారి దీన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా ఏళ్ల పాటు ప్రతి సీజన్‌కూ ఉపయోగపడుతుంది.
– గుండా జవహర్ రెడ్డి, సాక్షి, ఖమ్మం వ్యవసాయం
రైతుబజార్ రిటైల్ ధరకు అమ్మినా చాలు!
పదేళ్ల క్రితం తిరుపతిలో జరిగిన సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొన్న స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం చేపట్టాను. తొలి దశలో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాను. పలు రసాయన రహిత సేద్య పద్ధతుల్లో ఉపయోగకరమైన అంశాలను అనుసరిస్తూ.. సేంద్రియ పద్ధతుల్లో కూడా రసాయనిక రైతులకు దీటుగా దిగుబడులు తీయటం సాధ్యమేనని మా అనుభవాలు చెబుతున్నాయి. రైతులు పొలంలోనే పామ్ పాండ్ తవ్వుకొని, షీట్ పరచి, ఆ నీటి కుంటలో పోషక ద్రావణాన్ని సునాయాసంగా తయారు చేసుకోవచ్చు. ప్రతి రోజూ నీటితోపాటు డ్రిప్ ద్వారా పోషక ద్రావణాన్ని అందించి మంచి దిగుబడులు సాధించవచ్చు.
కూరగాయలు సాగు చేసే రైతులు సాధారణ మార్కెట్‌లో రసాయనిక వ్యవసాయదారులతో పాటు తమ కూరగాయలను టోకు ధరకు అమ్మితే గిట్టుబాటు కాదు. నేరుగా వినియోగదారులకు రిటైల్‌గా అమ్ముకుంటేనే గిట్టుబాటవుతుంది. అధిక ధరకు అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ప్రకృతి / సేంద్రియ కూరగాయలను రైతుబజారు రిటైల్ ధరలకు నేరుగా వినియోగదారులకు అమ్ముకున్నా రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ప్రతి పట్టణం, నగరం మధ్యలో రైతుబజార్లు ఏర్పాటు చేయాలి. ఖమ్మం నగరంలో నుంచి రైతుబజార్‌ను ఊరి బయటకు తరలించిన తర్వాత మా కూరగాయలు, పండ్లను అమ్ముకోవటం కనాకష్టంగా మారింది. ఆదాయమూ తగ్గిపోయింది.
– చెరుకూరి రామారావు (79954 30697), సేంద్రియ కూరగాయల రైతు, కోయచెలక, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment