![The World of Organic Agriculture 2025 Annual Survey Report](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/crop.jpg.webp?itok=It5aqwK7)
9.9 కోట్ల హెక్టార్లకు చేరిన సేంద్రియ సాగు విస్తీర్ణం
ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ రైతులు 43 లక్షలు
అత్యధికంగా (24 లక్షల మంది) భారత్‌లోనే..
రసాయన అవశేషాల్లేని సేంద్రియ ఆహారోత్పత్తుల సాగు, వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ఏటేటా విస్తరిస్తోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 188 దేశాల్లో 9.89 కోట్ల హెక్టార్లకు సేంద్రియ సాగు విస్తరించింది. 2022తో పోల్చితే 2023లో సేంద్రియ / ప్రకృతి సాగు విస్తీర్ణం 2.6 శాతం (25 లక్షల హెక్టార్లు) పెరిగింది.
జర్మనీలోని నరెంబర్గ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సేంద్రియ ఆహారోత్పత్తుల వాణిజ్య ప్రదర్శనలో మంగళవారం విడుదలైన ‘ద వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2025’ వార్షిక సర్వే నివేదిక ఈ తాజా గణాంకాలను వెలువరించింది. స్విట్జర్లాండ్ సేంద్రియ పరిశోధనా సంస్థ (ఎఫ్‌ఐబీఎల్), ఐఫోమ్–ఆర్గానిక్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ సర్వే నివేదికను వెలువరించాయి. – సాక్షి సాగుబడి, హైదరాబాద్
అత్యధిక రైతులు మన వాళ్లే..
ప్రపంచవ్యాప్తంగా 43 లక్షల మంది రైతులు సేంద్రియ సాగు చేస్తుండగా, 24 లక్షల మంది సర్టిఫైడ్ సేంద్రియ రైతులు మన దేశంలోనే ఉన్నారు. ఉగాండా (4.04 లక్షలు), ఇథియోపియా (1.21 లక్షలు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
కాగా, విస్తీర్ణం పరంగా చూస్తే 5.3 కోట్ల హెక్టార్లలో సర్టిఫైడ్ సేంద్రియ సేద్యంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. 4.5 లక్షల హెక్టార్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం సాగు భూమిలోని 2.1 శాతంలో సర్టిఫైడ్ సేంద్రియ సేద్యం జరుగుతోంది.
వినియోగంలో ఫస్ట్ అమెరికా
2023లో ప్రపంచ సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారం 136 బిలియన్ యూరోల (రూ.12,17,920 కోట్ల)కు పెరిగింది. 59 బిలియన్ యూరోల వాటాతో అమెరికా అతిపెద్ద సేంద్రియ మార్కెట్‌గా నిలిచింది. జర్మనీ, చైనా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
సేంద్రియ ఆహారం కొనుగోలుపై స్విట్జర్లాండ్ వాసులు అత్యధికంగా డబ్బు వెచ్చిస్తున్నారని ఈ సర్వే తెలిపింది. అనేక ఏళ్లుగా ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ స్థిరంగా పెరుగుతుండటం విశేషం. మున్ముందు కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment