ఢిల్లీలోని నా ఇంటికి సాదర స్వాగతం
మెదక్ జిల్లా తునికి గ్రామ రైతులు నా ఆతిథ్యం స్వీకరించాలి
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆహ్వానం
ఘనంగా కేవీకే సేంద్రియ రైతు సమ్మేళనం
సాక్షి, సిద్దిపేట/రంగారెడ్డి జిల్లా/నందిగామ: భారతదేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగానిది కీలకపాత్ర అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. రైతుల ఆర్థిక ప్రగతే దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా పనిచేస్తుందని చెప్పారు. మెదక్ జిల్లాలోని తునికి గ్రామంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో బుధవారం నిర్వహించిన సేంద్రియ రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
మెదక్ జిల్లాలో 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలో చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. తునికి గ్రామం తనకు మార్గదర్శకమని చెప్పారు. తునికి సేంద్రియ సాగు రైతులంతా మూడు రోజులపాటు ఢిల్లీలోని తన గృహానికి అతిథులుగా రావాలని ఆహ్వానించారు.
స్థానిక మార్కెటింగ్ పెంచాలి
2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి కిసాన్ దివస్‌ను ప్రారంభించగా.. త్వరలో అత్యంత వైభవంగా రజతోత్సవం నిర్వహించుకోబోతున్నామని ఉపరాష్ట్రపతి చెప్పారు.
ఇందులో దేశంలోని 730పైచిలుకు కేవీకేలు, 150 ఐకార్ సంస్థలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పండించిన పండ్లు, కూరగాయలను అక్కడే విక్రయిస్తే.. ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతీ భారతీయుడు జాతీయవాదంపై విశ్వాసంతో ఉండాలని పిలుపునిచ్చారు.
సేంద్రియ సాగు పెరగటం శుభ పరిణామం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సేంద్రియ వ్యవసాయ సమ్మేళనంలో 500 కుటుంబాలు పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రైతులు సేంద్రియ సాగు దిశగా అడుగులు వేస్తూ.. రసాయనిక సాగును క్రమంగా తగ్గిస్తుండటం శుభ పరిణామం అని సంతోషం వ్యక్తంచేశారు. కేవీకేలో 43,337 మంది పురుషులు, 16,937 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉండటం గొప్ప విజయమన్నారు.
ఈ కార్యక్రమంలో సేంద్రియ రైతులు నరేందర్ రెడ్డి, ధనలక్ష్మిని ఉపరాష్ట్రపతి ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సతీమణి సుదేష్ ధన్‌ఖడ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యదర్శి భాగయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి దంపతులకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్, వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి, డీజీపీ జితేందర్, తదితరులు ఘన స్వాగతం పలికారు.
కన్హా శాంతివనంలో ధ్యానం..
రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనం దేశంలో అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుందని జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. బుధవారం ఉపరాష్ట్రపతి దంపతులు కన్హా శాంతివనాన్ని సందర్శించారు. హార్ట్‌ఫుల్‌నెస్, శ్రీరామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ పటేల్ (దా జీ)తో కలిసి వారు ధ్యానం చేశారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. కమ్లేష్ పటేల్ వలన ప్రతి ఒక్క రూ ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ధన్‌ఖడ్ దంపతులు రాత్రి కాన్హాలోనే బసచేశారు. గురువారం ఉదయం ధ్యానం చేసిన అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment