![International spiritual convention concluded at Kanha - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/18/Jagdeep%20Dhankhad%2C.jpg.webp?itok=5RVuyf0t)
దాజీకి అవార్డు అందజేస్తున్న కామన్‌వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్
ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్
కన్హాలో ముగిసిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం
దాజీకి ‘గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్’అవార్డు
నందిగామ/శంషాబాద్ (హైదరాబాద్): ప్రపంచ శాంతికి ధ్యానం ఒక్కటే మార్గమని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ అభిప్రాయపడ్డారు. మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ గురూజీ కమ్లేష్ పటేల్ (దాజీ)కు కామన్‌వెల్త్ ఆధ్వర్యంలో గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్ అవార్డు రావడం ఆనందకరమన్నారు.
కామన్‌వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ మాట్లాడుతూ.. దాజీ 160 దేశాల్లో 16 వేల మంది వలంటీర్లు, 5 వేల కేంద్రాల్లో 5 మిలియన్లకు పైగా అభ్యాసీలను కలిగి ఉండటం ప్రపంచ స్థాయిలోనే గొప్ప విషయమని ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తించి ‘గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్’ అవార్డు అందజేస్తున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. కమ్లేష్ పటేల్ (దాజీ) మాట్లాడుతూ.. తనకు కామన్‌వెల్త్ ఆధ్వర్యంలో అవార్డు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు అధ్యాత్మికవేత్తలు ధ్యానం చేశారు. కార్యక్రమంలో ప్రపంచ మత పెద్దల మండలి సెక్రటరీ జనరల్ భావాజైన్, సైంటిస్ట్ డాక్టర్ రోలీన్ మెక్‌క్రాటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్సియె ఎస్ బీయింగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ జోసెఫ్ బెంటన్ హోవెల్ పాల్గొన్నారు.
ఉప రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు
ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి దంపతులు జగదీప్ ధన్‌ఖడ్, సుధేష్ ధన్‌ఖడ్‌లు తమ పర్యటన ముగించుకుని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరికీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ తమిళి సై, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఘనంగా వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment