Amazing Terrace Gardening By Govt Employee Couple In Prakasam | చూపు తిప్పుకోనివ్వని పూల మిద్దె - Sakshi
Sakshi News home page

చూపు తిప్పుకోనివ్వని పూల మిద్దె

Published Fri, Jan 1 2021 8:29 AM | Last Updated on Fri, Jan 1 2021 10:05 AM

These Couple Made Terrace Garden In Prakasam - Sakshi

మిద్దెపై సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు, వివిధ రకాల క్రోటాను మొక్కలు

పేదలు, మధ్య తరగతి వారంతా ‘ఏం తినేటట్లు లేదు.. ఏం కొనేటట్లు లేదు’ అని పాట పాడుకుంటారు’ ఇల్లు ఎలా గడవాలో తెలియక సతమతం అవుతుంటారు. పెరటిలో ఏవైనా మొక్కలు వేసకుందామనుకుంటే.. ఆ రోజులు పోయాయి. అతి తక్కువ స్థలంలోనే ఇళ్లు కట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీనికి పరిష్కార మార్గమే మిద్దె పంట. ఇంటిపై ఎంచక్కా కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు పెంచుకుంటే వాటిని కొనే బాధ తప్పుతుంది. పర్యావరణంతో పాటు ఆరోగ్యమూ సిద్ధిస్తుంది. 

సాక్షి, మార్కాపురం: ప్రస్తుతం ఎక్కడ చూసినా హాట్‌ టాపిక్‌ ఒక్కటే అదే ఆరోగ్యం. తెలుగు రాష్ట్రాల్లోని వారు అది ఎలా దొరుకుతుందో రీసెర్చిలు మొదలు పెట్టారంటే అతిశయోక్తి కాదు. ఈ కోవకు చెందిన వారే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగ దంపతులు. తమ ఇంటి మేడనే నందన వనంగా మార్చుకున్నారు. ప్రకృతిని కేవలం ఇష్టపడటమే కాదు.. ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తూ ఆ పంటనే తినాలని ప్రచారం చేస్తున్న ఈ దంపతులు అందరి అభినందనలు అందుకుంటున్నారు.

ఒక్క ఆలోచన 
మార్కాపురం పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉండే కేఐ సుదర్శన్‌రాజు యర్రగొండపాలెం వ్యవసాయ సబ్‌ డివిజన్‌ సహాయ సంచాలకులుగా, ఆయన భార్య నాగలక్ష్మి తిప్పాయపాలెం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం అంటే ఇద్దరికీ ప్రాణం. ఈయన తన వృత్తిలో భాగంగా సహజంగానే ప్రతి రోజూ పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈనేపథ్యంలో రెండేళ్ల క్రితం మంచి ఆలోచన వచ్చింది. అదే మిద్దె పంట సాగు. ఇలా ఇద్దరూ కలిసి తాము ఉంటున్న ఇంటి పైనే వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయల మొక్కలను సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా బెండ, దొండ, చిక్కుడు, కాకర, టమోటా, సొరకాయతో పాటు ఆకుకూరలైన పాలకూర, చుక్కకూరతో పాటు చిన్న చిన్న పండ్ల మొక్కలను పెంచుతున్నారు.

తాము పండించిన మిద్దె పంటతో సుదర్శన్‌రాజు దంపతులు

పూలమొక్కలైన మందార, గులాబి, నందివర్దనం, లిల్లీ, తదితర మొక్కలు కూడా సాగు చేస్తున్నారు. దాదాపు ఏదాదిన్నర నుంచి ఆ గృహమంతా కళకళలాడుతుండటంతో రకరకాల పక్షులు కూడా అక్కడకు వచ్చి చేరుతున్నాయి. దీంతో వాటి కోసం గూళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు చుట్టు పక్కల వారు కూడా మిద్దె పంట సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ‘ప్రస్తుతం కూరగాయల దిగుబడులు వస్తున్నాయి. సాయంత్రం సమయాల్లో గార్డెనింగ్‌లో కూర్చుంటే చల్లటి స్వచ్ఛమైన గాలి వస్తోంది. అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఆరోగ్యం వచ్చి తీరుతుంది’ అని చెప్పారు సుదర్శన్‌రాజు, నాగలక్ష్మి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement