
నీతి ఆయోగ్ సదస్సులో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పడంతోపాటు ఆర్బీకేల ద్వారా చైతన్యం చేస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి సేద్యంపై ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న రైతులను కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లుగా ఆర్బీకేల్లో నియమించి శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడంలో ఈ చర్యలు ఎంతో దోహదం చేస్తున్నాయని తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, ప్రతి 2 వేల జనాభాకు ఒక ఆర్బీకేను ఏర్పాటు చేసి రైతన్నలు కోరిన ఏ సేవలనైనా గ్రామంలోనే అందచేస్తున్నట్లు వివరించారు. సహజ, ప్రకృతి వ్యవసాయ విధానాలపై నీతి ఆయోగ్ సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఇంకా ఆయనేమన్నారంటే..
వన్‌స్టాప్ సెంటర్లుగా ఆర్బీకేలు
గ్రామీణ ప్రాంతాల్లో 10,778 ఆర్బీకేలను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ఇన్‌పుట్స్ కూడా అందిస్తోంది. రైతులకు సాగు విధానాలపై మెరుగైన పరిజ్ఞానాన్ని అందించడంతోపాటు పంట కొనుగోలు కేంద్రాలుగా కూడా వ్యవహరిస్తున్నాయి. వ్యవసాయ కార్యకలాపాలకు వన్‌స్టాప్ సెంటర్లుగా ఆర్బీకేలు నిలుస్తున్నాయి.
ఈ–క్రాప్.. పొలంబడులు.. సలహా మండళ్లు
ఆర్బీకేలు సాగు చేస్తున్న రైతుల సమాచారాన్ని ఈ–క్రాప్ ద్వారా నమోదు చేసి ప్రభుత్వ పథకాలు, సేవలను అనుసంధానం చేస్తున్నాయి. వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటలబీమా, సాగుచేస్తున్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటలకు ఎంఎస్‌పీ ధరలు... ఇవన్నీ సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ–క్రాప్ డేటా ఉపయోగపడుతుంది. ఈ–క్రాప్ చేయించుకున్న రైతులకు భౌతికంగా రశీదు ఇవ్వడంతోపాటు డిజిటల్ రశీదులు కూడా ఇస్తున్నాం. సామాజిక తనిఖీ కోసం పేర్లను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నాం.
ల్యాబ్‌లతోనూ ఆర్బీకేలు అనుసంధానమయ్యాయి. నిపుణుడైన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ) ప్రతి ఆర్బీకేలో ఉంటారు. వ్యవసాయ క్షేత్రాల్లో వీరు పొలంబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాగు ఖర్చులను తగ్గించడమే కాకుండా పర్యావరణ అనుకూల విధానాలతో మంచి దిగుబడులను సాధించేలా రైతులకు ఈ కార్యక్రమాలు తోడుగా నిలుస్తున్నాయి. బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను కూడా నియమించాం. పంటల ప్రణాళికను సూచించడం, ఆర్బీకేల కార్యక్రమాల పర్యవేక్షణ, సమర్థంగా అమలుకు వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశాం. వ్యవసాయంలో మంచి అనుభవం ఉన్న 80,359 మంది ప్రగతిశీల రైతులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. రైతులు పండించిన పంటలకు ఎంఎస్‌పీ కన్నా ధర తగ్గితే నేరుగా మార్కెట్లో జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు చెల్లించేలా ఈ నిధిని వినియోగిస్తున్నాం. ఎంఎస్‌పీ ధర నిర్ణయించని పంటలను సాగు చేస్తున్న రైతులను కూడా ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకుంటున్నాం. హెక్టారులో సగం కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు రాష్ట్రంలో 50 శాతం మంది ఉన్నారు. ఒక హెక్టారు అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయంగా వీరికి అందిస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 80 శాతం పంటలకు 50 నుంచి 80 శాతం వరకూ పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా ద్వారా అందచేస్తున్నాం. వ్యవసాయానికి ఉచితంగా పగటి పూటే 9 గంటల విద్యుత్తు అందిస్తూ రైతులకు మద్దతుగా నిలిచే కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment