పచ్చని కెరీర్‌: మట్టిలో మాణిక్యాలు | Green and Grains: madhya pradesh Couple started a Farm-to-Fork Business | Sakshi
Sakshi News home page

పచ్చని కెరీర్‌: మట్టిలో మాణిక్యాలు

Published Sun, Mar 6 2022 12:56 AM | Last Updated on Sun, Mar 6 2022 12:56 AM

Green and Grains: madhya pradesh Couple started a Farm-to-Fork Business - Sakshi

రైతులు తమ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులుగా తయారు చేయడానికి ఇష్టపడని రోజులివి. అలాంటి సమయంలో ఓ ఎనిమిదేళ్ల పాపాయి మిహిక ‘నేను పెద్దయిన తర్వాత మా అమ్మానాన్నల్లాగ రైతునవుతాను’ అని చెబుతోంది. ఆ అమ్మానాన్నలు కూడా రైతు కుటుంబంలో పుట్టిన వాళ్లు కాదు. అమ్మ ప్రతీక్ష ఒక ఐఏఎస్‌ అధికారి కూతురు. తండ్రి ప్రతీక్‌ శర్మ. ఇద్దరూ బ్యాంకు ఆఫీసర్‌లుగా కెరీర్‌ ప్రారంభించారు. పట్టణాలు, నగరాల్లో నివసించే చాలామందిలో ఉన్నట్లే మరి ఏ ఇతర నైపుణ్యం లేని వాళ్లే వ్యవసాయం చేస్తారని, అది చదువుకున్న వాళ్లు చేసే పని కాదనే అభిప్రాయమే ప్రతీక్షలో కూడా ఉండేది.

అలాంటి ప్రతీక్ష తాను తల్లయ్యే సమయంలో ‘మనం ఏం తినాలి? ఏం తింటున్నాం’ అని ఆలోచనలో పడింది. పాశ్చాత్యదేశాల సూచనలతో వాళ్లు తయారు చేసిన క్రిమిసంహారక మందులకు మన వ్యవసాయ క్షేత్రాలు బలవుతున్నాయని గ్రహించి తీవ్రమైన మానసిక వేదనకు గురైంది. అయితే అన్నింటినీ తెలుసుకుని నిస్సహాయంగా ఊరుకోలేదామె. ‘పాశ్చాత్యదేశాల సూచనలు కాదు మనం అనుసరించాల్సింది, ఆ దేశాలు వ్యవసాయంలో పాటిస్తున్న పద్ధతులను అనుసరించాలి’ అనే అవగాహనకు వచ్చారు భార్యాభర్తలిద్దరూ. ఆ ప్రయోగం ఇప్పుడు ‘గ్రీన్‌ అండ్‌ గ్రైన్స్‌’ పేరుతో ప్రయోగాత్మక వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు.

ప్రతీక్‌ తండ్రి ప్రవీణ్‌ శర్మది మధ్యప్రదేశ్, హోషంగా జిల్లా, దోలారియా గ్రామం. ఆయన ఇంగ్లిష్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. విదేశీ సాహిత్యాన్ని ఇష్టపడేవారు. ఆ కలెక్షన్‌లో భాగంగా ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించిన పుస్తకాలు కూడా వచ్చి చేరాయి. అలాగే వ్యవసాయరంగంలో ఉపయోగించే అధునాతన యంత్రపరికరాలను రైతులకు పరిచయం చేసే బాధ్యతను కూడా చేపట్టారాయన. 2003లో తండ్రి పోయే నాటికి ప్రతీక్‌ బ్యాంకు ఉద్యోగంలో ఉన్నాడు. ‘‘నాన్నతోపాటే ఆయన ఆశయాన్ని పూడ్చిపెట్టడం నాకిష్టం లేకపోయింది. అందుకే అప్పటి వరకు నాన్న ఏం చేశాడనే వివరాల్లోకి వెళ్లాను’ అంటాడతడు. ప్రతీక్ష గర్భం దాల్చినప్పటి నుంచి వాళ్ల ఆలోచన ‘మనం ఏం తినాలి? ఏం తింటున్నాం? పుట్టబోయే పాపాయికి ఏం తినిపిస్తాం’ అని కొత్త మార్గంలో సాగింది. దాంతో ఉద్యోగాన్ని సొంత గ్రామానికి దగ్గరలోని భోపాల్‌కు బదిలీ చేయించుకున్నారు. వారాంతంలో వ్యవసాయం మొదలుపెట్టాడు ప్రతీక్‌.

పొరపాట్లన్నీ పాఠాలే!
ప్రతీక్‌ సేద్యం తొలి ఏడాది కుప్పకూలిందనే చెప్పాలి. తాను అవలంబించాలనుకున్న కొత్త పద్ధతిని పొలంలో పని చేసే వాళ్లకు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి. తనకు చేతకానిది కూడా అదే. దాంతో మొదట స్థానిక భాష మీద పట్టు తెచ్చుకున్నాడు. సాగులో దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకున్నాడు. పంట నేల, మట్టి, రైతు వేటికవే భిన్నమైనవి. ఆ మూడింటి సమష్టి కృషి ఏ రెండు చోట్ల ఒకలా ఉండవని గ్రహించాడు. తనదైన ప్రత్యేకమైశైలిని అలవరుచుకున్నాడు. అలాగే విత్తనాలు, ఎరువుల, పురుగుమందుల ఖర్చు మితిమీరి పోకుండా జాగ్రత్తపడాలని కూడా తెలిసివచ్చింది. అలాగే తన ఉత్పత్తిని మార్కెట్‌ చేయడం తన చేతుల్లో లేదనే మరో వాస్తవం కూడా.  2016లో ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయిలో రైతుగా మారిపోయాడు. అప్పుడు ‘ఫార్మ్‌ టూ ఫోర్క్‌’ పేరుతో కొత్త మార్కెటింగ్‌ విధానాన్ని మొదలుపెట్టాడు. మధ్యవర్తుల అవసరం లేకుండా రైతుల నుంచి నేరుగా వినియోగదారులను అనుసంధానం చేశాడు.

నగరాల్లోని అవుట్‌లెట్‌లకు నేరుగా రైతులే తమ ఉత్పత్తులను చేరవేసేటట్లు నెట్‌వర్క్‌ ఏర్పాటు చేశాడు. పంటకు అవసరమైన డబ్బు కోసం దళారీలు, వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదిప్పుడు. అలాగే పంటను దళారులు కొని పంట కోసం తీసుకున్న డబ్బు, దాని వడ్డీని జమ చేసుకుని మిగిలిన డబ్బు రైతు చేతిలో పెట్టే దుస్థితి లేదు. ప్రతీక్ష, ప్రతీక్‌ దంపతుల ప్రయోగంతో ఇప్పుడు ఫార్మ్‌ టూ ఫోర్క్‌ గొడుగు కింద రెండు వేల మంది రైతులున్నారు. అయితే ఇది అంత సులువుగా ఏమీ జరగలేదు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు ఇప్పించడంలో వీళ్లే ముందు నిలిచారు. మట్టిసారాన్ని పరిరక్షించుకోవడమెలాగో రైతులకు  నేర్పించారు. ఇలా ఏడేళ్లుగా అకుంఠిత దీక్షతో శ్రమించి ఈ విజయాన్ని సాధించారు ఈ దంపతులు. బ్యాంకు సేవలు సరైన విధంగా అందుబాటులో లేకపోవడం వల్లనే రైతు దళారుల మీద ఆధారపడాల్సి వస్తోంది. బ్యాంకు సేవలను సకాలంలో అందేటట్లు చేయగలగడంతో దళారీ వ్యవస్థ కబంద హస్తాల నుంచి రైతులను, పంటలను కాపాడడం సాధ్యమైందంటారు ఈ దంపతులు.           

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement