ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. సేంద్రియ విధానంలో సాగు చేసిన (ఆర్గానిక్) పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా స్వామివారి ప్రసాదాలు, అన్న ప్రసాదాల్లో కూడా సేంద్రియ బియ్యం వినియోగించాలని ఆలోచనతో ఈ రకం ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఎంఎస్‌పీ కంటే పది శాతం ధర అధికంగా ఇచ్చి కొనుగోలు చేయడానికి రైతులను ఎంపిక చేసి ఒప్పందాలు చేసుకుంటోంది. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యేక సర్టిఫికెట్ అందజేస్తోంది. వారు పండించిన పంటను మాత్రమే టీటీడీ కొనుగోలు చేయనుంది.
కందుకూరు(పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా): ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రసాయనిక ఎరువుల రహిత పంటలు పండించేలా రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల్లో పండించిన పంటలకు ప్రభుత్వమే నేరుగా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. అందులో భాగంగా కొన్ని ఎంపిక చేసిన పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసేలా ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గతేడాది నాలుగు జిల్లాల్లో శనగ పంటను ఎంపిక చేయగా, ఈ ఏడాది వరి పంటను ఎంపిక చేశారు.
పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లా ఎంపిక
ఈ ఏడాది ప్రకృతి సాగు పద్ధతుల్లో వరి ధాన్యాన్ని పెద్ద ఎత్తున పండించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రాష్ట్రంలో వరి అధికంగా సాగయ్యే పలు జిల్లాలను ఎంపిక చేశారు. అందులో భాగంగా మేలు రకం వరి సాగుకు పెట్టిన పేరైన నెల్లూరు జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. జిల్లాలో ఈ రబీ సీజన్ నుంచి వరి పంటను సేంద్రియ విధానంలో సాగు పద్ధతులను పాటించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఎంపిక చేసిన రైతులకు ఈ తరహా సాగు విధానంలో అవగాహన కల్పించేందుకు ఒప్పిస్తున్నారు. గుడ్లూరు మండలంలోని చేవూరులో 25 మంది రైతులతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. దీని ప్రకారం రైతులు కచ్చితంగా అధికారులు సూచించిన సేంద్రియ సాగు పద్ధతుల్లోనే పంటలు పండించాలి. ఎటువంటి రసాయనిక ఎరువులను వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే ఉపయోగించాలి. రైతులకు సేంద్రియ ఎరువులను సరఫరా చేయడంతో పాటు సాగులో వారికి ఆ శాఖ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తారు. ఇలా పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే ప్రత్యేకంగా మార్కెటింగ్ చేయిస్తుంది.
2,640 టన్నుల ధాన్యం సరఫరాకు టీటీడీతో ఒప్పందం
ప్రకృతి సాగు పద్ధతుల్లో పండించిన వరి ధాన్యాన్ని మార్కెటింగ్ కోసం ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డుతో ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. జిల్లా నుంచి 2,640 టన్నుల మేలు రకం (సన్నబియ్యం) ధాన్యం సరఫరా చేసేందుకు అంగీకరించారు. ఇందుకు 1,300 ఎకరాల్లో వరిని సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఎకరాకు 2 టన్నుల చొప్పున దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 870 ఎకరాల్లో సాగు చేసేలా రైతులతో ఒప్పందం చేసుకున్నారు. మిగతా విస్తీర్ణానికి రైతులను ఒప్పించి పనిలో అధికారులున్నారు.
సన్న రకాలే సాగు
రైతుల ద్వారా ప్రధానంగా మూడు రకాలైన సన్న బియ్యం రకాల వరిని పండించనున్నారు. వీటిలో నెల్లూరు సన్నాలు (ఎన్‌ఎల్‌ఆర్34449), సాంబమసూరి (బీపీటీ 5204), రాజేంద్రనగర్ సన్నాలు (ఆర్‌ఎన్‌ఆర్15048) రకాలను పండించాలి. సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతుల్లోనే వరి పంటను ఈ రబీ సీజన్‌లో సాగు చేయించనున్నారు. ఈ విధంగా పండించిన పంటను ప్రభుత్వం సాధారణంగా ధాన్యానికి క్వింటాకు ఇచ్చే మద్దతు ధర కంటే 10 శాతం అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయనున్నారు. ఈ సేకరించిన ధాన్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద ట్రస్ట్‌కు సరఫరా చేయనున్నారు. పండించిన శనగ పంటను గతేడాది టీటీడీకి సరఫరా చేశారు.
సేంద్రియ వ్యవసాయ రైతులకు సర్టిఫికెట్
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగు చేసే రైతుల ఉత్పత్తులకు గుర్తింపు ఇచ్చేలా ఈ ఏడాది నుంచి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించిన పంటలను ప్రత్యేకంగా మార్కెటింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ ధర కంటే అధిక ధర రైతులకు లభిస్తుందని చెబుతున్నారు. అన్ని రకాల పంటలు సాగు చేసే రైతులకు ప్రకృతి వ్యవసాయశాఖ నుంచి సర్టిఫికెట్లు జారీ చేస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు.
రసాయన రహితంగా ధాన్యం
ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల్లో రబీ సీజన్‌లో ధాన్యం పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రసాయన రహిత ధాన్యాన్ని టీడీటీకి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ఇందు కోసం పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాను ఎంపిక చేశారు. 2640 టన్నుల ధాన్యం ఉత్పత్తి కోసం కొంత మంది రైతులతో ఒప్పందం చేసుకుని మేలు రకం ధాన్యాన్ని జెడ్‌బీఎన్‌ఎఫ్ సిబ్బంది పర్యవేక్షణలో పండించేలా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా సేంద్రియ ఎరువులను వినియోగించి పండించిన ధాన్యా న్ని మాత్రమే తీసుకుంటాం. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యేకంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.
– డీ మాలకొండయ్య, జెడ్‌బీఎన్‌ఎఫ్, డీపీఎం
Comments
Please login to add a commentAdd a comment