legume
-
Sagubadi: పొద చిక్కుడు పంటతో.. ఏనుగులకు చెక్!
లఏనుగులు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి రాకుండా తిప్పికొట్టేందుకు కేరళవాసులు రెండు పద్ధతులను అవలంభిస్తున్నారు. మొదటిది: తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెలు నిర్మించటం. రెండోది: ప్రత్యేక వాసనను వెదజల్లే దేశవాళీ పొద చిక్కుడు పంటను సరిహద్దు పంటగా సాగు చేయటం. మొదటి పద్ధతి కన్నా రెండో పద్ధతి ఎక్కువ ప్రభావశీలంగా పని చేస్తోందని రైతులు చెబుతున్నారు.గ్రామ సరిహద్దుల్లో తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెల (బీహైవ్ ఫెన్సెస్)ను ఏర్పాటు చేశారు. ఏనుగులు అడవి నుంచి గ్రామాల వైపు వచ్చే దారిలో ఈ కంచె తీగలను తాకగానే తేనెటీగలు పెద్దపెట్టున శబ్ధం చేస్తూ వాటిని చుట్టుముడతాయి. అవి చేసే శబ్ధం ఏనుగులకు గిట్టదు. అందువల్ల అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకురాలు లూసీ కింగ్ 15 ఏళ్ల క్రితం ఈ పద్ధతిని కనుగొన్నారు. కెన్యా, టాంజానియాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి, తేనెటీగల కంచెలు ఏనుగులను సమర్థవంతంగా బెదరగొట్టగలవని నిర్థారించారు. ఆ తర్వాత కేరళలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న అట్ట΄్పాడి తాలూకాలో అనేక గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులకు ఏనుగుల నుంచి కొంతమేరకు ఉపశమనం దొరికింది.కేరళలో గిరిజనులు మరో సంప్రదాయ పద్ధతిలో కూడా ఏనుగుల సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆట్టుకొంబ అమర (అట్టాప్పడీ డొలిఖోస్ బీన్ లేదా లాబ్లాబ్ బీన్) అనే స్థానిక రకం పొద చిక్కుడు పంటను ఏనుగులు గ్రామాల్లోకి వచ్చే మార్గాల్లో సాగు చేయటం ద్వారా వాటì రాకను సహజ పద్ధతిలో నిరోధించవచ్చని గిరిజన రైతులు గుర్తించారు.అట్టాప్పడీ తాలూకాలోని మూలకొంబు అనే గ్రామవాసి అయిన చింది అనే 65 ఏళ్ల మహిళా రైతు ఏనుగులను నిరోధించేందుకు చెట్టు చిక్కుడును సాగు చేస్తున్నారు. అడవి ఏనుగుల గుంపును తేనెటీగల కంచెలు పూర్తిగా ఆపలేకపోతున్నాయన్నారు. ఆట్టుకోంబ అమర వంటి దేశవాళీ పొద చిక్కుడు పంట ప్రభావం చాలా బాగుందన్నారు. ‘ఈ చిక్కుడు పంటను కంచె పంటగా వేసినప్పటి నుంచి నా పొలం మీద ఏనుగులు దాడి చెయ్యలేదు. అమర చిక్కుళ్లు మంచి ధరకు అమ్ముడు కావటంతో మంచి ఆదాయం కూడా వస్తోంద’ని చింది సంతోషిస్తున్నారు.ఈ చిక్కుడు రకం పంట వెదజల్లే ఒక రకమైన ఘాటు వాసన ఏనుగులు, తదితర వన్య్రపాణులకు గిట్టకపోవటం వల్లనే అవి వెనుదిరిగి వెళ్లి పోతున్నాయని చెబుతున్నారు. ఈ సంగతి శాస్త్రీయంగా ఇంకా రుజువు కానప్పటికీ, ప్రజలకు ఏనుగుల బెడద మాత్రం తీరింది. కేరళలో అనాదిగా సాగవుతున్న ఆట్టుకొంబ అమర చిక్కుళ్లు విలక్షణమైన రకం కావటంతో మూడేళ్ల క్రితం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపు వచ్చింది. దీంతో ‘బయోసర్టిఫికేషన్’ ఉన్న ఈ చిక్కుళ్లకు ఏకంగా కిలోకు రూ. వెయ్యి వరకు ధర పలుకుతుండటం మరో విశేషం. మళయాళంలో ‘ఆట్టు’ అంటే మేక. ‘కొంబు’ అంటే కొమ్ము. కేరళ గిరిజన రైతులు సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ‘మేక కొమ్ము’లతో ఏనుగులను జయిస్తున్నారన్న మాట! -
బరువును సులువుగా తగ్గించే చనాచాట్
కాలంతో పాటు మనిషి కూడా పరిగెత్తడంతో జీవన శైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో చాలామంది సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో పాటు, కంటి నిండ నిద్రకు దూరం అవుతున్నారు. దీని ప్రభావం ఆరోగ్యంపైన పడుతోంది. ఒత్తిడి కారణంగా అతిగా తినడం వల్ల కూడా అధిక బరువుకు దారి తీస్తోంది. ఈ రోజుల్లో చాలా మందిని కలవరపరుస్తున్న వాటిలో అధిక బరువు. అయితే అదనపు బరువు అనేది మనం రోజు తీసుకునే ఆహారం మీదే ముడిపడి ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. పాశ్చాత్య ధోరణికి అలవాటు పడిన నేటి సమాజం అధిక కొవ్వు పదార్థాలు ఉండే ఫాస్ట్ ఫుడ్‌లైన పిజ్జా, బర్గర్లకు బాగా అలవాటైపోయారు. ఆ తర్వాత సరైన వ్యాయమం లేకపోవడం, ఎక్కువ గంటలు కూర్చోనే పని చేయడం కూడా బరువుకు కారణం అవుతోంది. తీరా పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. జిమ్‌ల్లో చెమటలు పట్టేలా వ్యాయామాలు చేసినా ఫలితం మాత్రం అనుకున్నంతగా కనిపించడం లేదని వాపోవడం చూస్తూనే ఉన్నాం. అయితే మన దేశంలో ప్రాచీన కాలం నుంచే అందుబాటులో ఉన్న పప్పు ధాన్యాలు, చిక్కుళ్లలో ప్రొటీన్ పాళ్లు పుష్కలంగా ఉండి బరువు సమస్యను తగ్గించేందుకు దోహదపడుతాయన్నవిషయం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా చిక్కుళ్లలో చిక్పీస్(శనగలు), బఠానీ, సోయాబీన్స్ వంటివి బరువును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని సంవృద్ధిగా తీసుకుని వంటిపై ఉన్న బరువును తేలిగ్గా వదిలించుకోవచ్చు. ప్రొటీన్ల రారాజు చిక్పీస్ చిక్కుళ్లలో ఒక రకమైన శనగల్లో(చిక్పీస్) ప్రొటీన్, ఫైబర్లు మెండుగా ఉండి బరువు తగ్గేందుకు దోహదపడుతుందని ఇటీవలే అమెరికాకు చెందిన ఓ ఆహార,న్యూట్రిషన్ సంస్థ తన సర్వేలో వెల్లడించింది. ఉదాహరణకు ఉడకబెట్టిన 100గ్రాముల చిక్‌పీస్‌లో 9గ్రా ప్రొటీన్స్,8గ్రా ఫైబర్, 2.6గ్రా ఫ్యాట్, ఐరన్లు ఉంటాయని నివేదికలో తెలిపింది. రోజు ఆహారంలో చనాచాట్ను తీసుకుంటే వీటిలో ఉండే ప్రొటీన్, ఫైబర్ కొద్ది రోజుల్లోనే బరువును తగ్గించడంతో పాటు, బ్లడ్ లెవల్, షుగర్ పాళ్లను కంట్రోల్లో ఉంచేందుకు దోహదపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మార్కెట్‌కు వెళ్లి చిక్‌పీస్‌ను కొనుగోలు చేయండి, అధిక బరువును తగ్గించుకోండి. -
పంటమార్పిడితో ప్రయోజనం
నంద్యాలరూరల్: ఏటా ఒకే రకం పంటలు వేయకుండా పంటమార్పిడి చేస్తే ప్రయోజనం ఉంటుందని ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ప్రొఫెసర్, శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ అన్నారు. శనివారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సమావేశ మందిరంలో అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరాన్ని పురస్కరించుకుని పప్పు దినుసుల సాగులో ఆధునిక మెలకువలు అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. అతిథిగా హాజరైన ఆలపాటి సత్యనారాయణ మాట్లాడుతూ నేలలో కార్బన్ శాతం పెంచే మార్గాలను రైతులకు వివరించారు. శనగ, పెసర, మినుము, కంది, వరి, కొర్ర, తదితర నూతన వంగడాలను రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. అపరాలను అంతర్ పంటగా సాగు చేస్తే మేలని చెప్పారు. ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నంద్యాల శనగ, నంద్యాల శనగ 49, యంత్రాల కోతకు అనువైన శనగ ధీర, నంద్యాల గ్రామం 119 రకాల గురించి రైతులకు వివరించారు. సదస్సులో ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలక మండలి మాజీ సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ జయలక్ష్మి, డాక్టర్ సరళమ్మ, డాక్టర్ కయ్యుం అహమ్మద్, డాక్టర్, త్రివిక్రంరెడ్డి, డాక్టర్ కామక్షి, తదితర సీనియర్, జూనియర్ శాస్త్రవేత్తలు, నంది రైతు సమాఖ్య ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులు పాల్గొన్నారు. -
అపరాల పంటలను ప్రోత్సహించాలి : యడవల్లి
హాలియా : నాగార్జునసాగర్ ఆయకట్టుతో పాటు నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో అపరాల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులను లాభాల బాటలో నడిపించవచ్చని మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మండలంలోని ఆయకట్టు ప్రాంతంలో సుమారు 600 ఎకరాల్లో పీయూ31 రకం మినుము పంటను సాగు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం వ్యవసాయాధికారులతో కలిసి పంటలను పరిశీలించారు. గత ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా మండలంలో 20ఎకరాలు సాగు చేయగా ప్రస్తుతం 600 ఎకరాలు సాగు చేయడం గర్వనీయమన్నారు. పీయూ31 రకం చీడపీడలను తట్టుకోవడమే కాకుండా దిగుబడి కూడా అదనంగా పొందవచ్చని వ్యవసాశాఖ అధికారులు తెలిపారు. ఎల్లోమెజాయిక్ వైరస్‌ను తట్టుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. దీని పంటకాలం 70రోజులేన న్నారు. కందిలో అంతర్పంటగా వేసుకోవచ్చన్నారు. ఆయనతో పాటు మండల వ్యవసాయాధికారి తిప్పన విజయేందర్‌రెడ్డి, చింతల చంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి, మిట్టపల్లి వాసులు ఉన్నారు.