Neem oil
-
చలికాలంలో పిండినల్లి, చీడపీడలు : ఇవి చల్లుకుంటే చాలు
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసు కోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.ఘా చ్ఛాదన: కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులుటమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నేమసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండి΄ోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామరపురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలురసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి.వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బు పొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ΄్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు.రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే?రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి. – డా. గడ్డం రాజశేఖర్ సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ -
Sagubadi: వేపతో స్వయం ఉపాధి..
వారంతా వ్యవసాయం చేసుకునే సాధారణ మహిళలు.. కానీ సేంద్రియ ఉత్పత్తులు తయారుచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వృథాగా భూమిలో కలిసి పోయే వేప గింజల నుంచి విలువైన వేప నూనె, వేప పిండిని తయారు చేసి విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి విజయ గాథలోకి వెళదాం...సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గ్ల్ గ్రామంలో సుమారు 15 మంది మహిళలు మూడు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డారు. ఐదుగురికి ఒక్కో యూనిట్ చొప్పున మూడు యూనిట్లు స్థాపించుకున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలోని వివిధప్రాంతాలకు వెళ్లి వేప గింజలను కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటారు. ఇటు వ్యవసాయం చేసుకుంటూనే సమయం దొరికినప్పుడు వేప నూనె, వేప పిండిని తయారు చేస్తున్నారు.ఏటా వేప చెట్లకు కాసే వేప కాయలు పండి రాలిపోతుంటాయి. ఇలా రాలిపోయిన గింజలను ఆయాప్రాంతాల్లోని మహిళలు, గిరిజనులు సేకరిస్తుంటారు. ఇలా సేకరించి తెచ్చిన గింజలకు అంటుకున్న మట్టిని తొలగించి, ఎండబెట్టి ్రపాసెస్ చేస్తుంటారు. క్వింటాలు గింజలకు ఐదు లీటర్ల వరకు వేప నూనె, 70 నుంచి 90 కిలోల వరకు నూనె తీసిన వేప పిండి (కేకు) తయారవుతుంది. గింజల నాణ్యత బాగుంటే నూనె కాస్త ఎక్కువ వస్తుంది. వేప నూనెను వ్యవసాయంలో పంటలపై చీడపీడల నివారణకు పిచికారీ చేస్తుంటారు. ఔషధాల తయారీకి, చర్మవ్యాధుల నివారణకూ వాడుతుంటారు. వేప పిండిని పంటల సాగులో సేంద్రియ ఎరువుగా వినియోగిస్తుంటారు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నారు.దారి చూపిన డీడీఎస్..చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు సాగు చేసే సేంద్రియ రైతులను ప్రోత్సహించే స్వచ్చంద సంస్థ డక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) వీరికి వేప కాయలతో సేంద్రియ ఉత్పత్తుల తయారీ పద్ధతిని నేర్పించింది. సుమారు రెండు దశాబ్దాల క్రితమే వేప గింజల నుంచి నూనె, వేప పిండి తీసే యంత్రాల కొనుగోలు చేసేందుకు రుణ సహాయం అందించింది. ఇప్పుడు ఆ యంత్రాలు పనిచేయడం లేదు. అప్పటి మహిళలకు వయస్సు మీద పడటంతో వారి కోడళ్లు, కూతుళ్లు ఈ యూనిట్లను నడుపుతున్నారు. పాతయంత్రాలు పనిచేయకపోవడంతో కొత్త యంత్రాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం బ్యాంకుల ద్వారా కొంత మొత్తాన్ని రుణంగా పొందారు. ఈ రుణంపై వడ్డీలు పెరిగిపోతుండటం తమకు భారంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ రుణాలను మాఫీ చేసిప్రోత్సహించాలని, లేదంటే కనీసం రుణంపై వడ్డీనైనా మాఫీ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షి, మెదక్ జిల్లా ఫొటోలు: మాతంశెట్టి మల్లన్న, జహీరాబాద్ టౌన్అప్పు భారమైంది..ఇటు వ్యవసాయం పని చేసుకుంటూనే ఏడాదిలో 6నెలల పాటు వేప నూనె, వేప చెక్క (కేక్) తయారు చేస్తున్నాం. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలి. ఎక్కువ ధర వచ్చేలా చూడాలి. ప్రస్తుతం సరైన మార్కెట్ లేకపోవడంతో చేసిన కష్టమంతా వృథా అవుతోంది. బ్యాంకు రుణాలను వడ్డీతో కలిపి చెల్లిస్తే మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకు రుణం రద్దు చేయాలి. కనీసం వడ్డీ అయినా రద్దు చేయాలి. – దవలమ్మ, స్వయం సహాయక బృందం సభ్యురాలుఆర్టీసీ కార్గో ద్వారా పంపుతాం..జడ్చర్ల, కోస్గి వంటిప్రాంతాలకు వెళ్లి వేపగింజలను కొనుగోలు చేసి తెచ్చుకొని వేప నూనె, వేప చెక్క తయారు చేస్తున్నాం. ఇప్పుడు గింజలు దొరకడం కష్టమవుతోంది. ఏడాదిలో ఆరు నెలలు ఈ పనే చేస్తున్నాం. వేప గింజల రేట్లు పెరిగినా వేప నూనె (కిలో రూ.400), వేప చెక్క/కేక్ (కిలో రూ. 35) రేటు పెంచలేదు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు ఇక్కడి వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నాం. – సువర్ణమ్మ (88979 04571), స్వయం సహాయక బృందం సభ్యురాలు -
ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా వేపాకులతో చెక్ పెట్టొచ్చు
వేప చెట్టు ఇంటి దగ్గర్లో ఉంటే వేరే సౌందర్యసాధనాలతో పనే ఉండదు. వేపాకులు, బెరడు, వేపనూనె ఔషధాలుగానే కాదు, సౌందర్య సాధనాలుగానూ ఉపయోగపడతాయి. ఎలాంటి చర్మ సమస్యలకైనా వేపతో ఇట్టే చెక్ పెట్టేయవచ్చు. ► ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడుతుంటే వేపాకులతో చక్కని విరుగుడు ఉంది. గుప్పెడు వేపాకులను అరలీటరు నీటిలో వేయాలి. వేపాకులు పూర్తిగా మెత్తగా మారిపోయేంత వరకు ఆ నీటిని మరిగించాలి. కాసేపటికి నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు వడగట్టి ఆ కషాయాన్ని సీసాలో భద్రపరచుకోవాలి. ►ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ నీటితో కాస్త దూదిని తడిపి ముఖాన్ని రుద్దుకుంటే చాలు. మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి. ∙చర్మం పొడిబారి, తరచు దురదలు పెడుతున్నట్లయితే, పైన చెప్పుకున్నట్లే వేపాకులతో కషాయం చేసి, బకెట్ నీటిలో ఒకకప్పు కషాయాన్ని పోసి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే చాలు, కొద్దిరోజుల్లోనే చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది. ► ముఖం తరచు జిడ్డుగా మారుతుంటే, వేపాకుల పొడి, గంధం పొడి, గులాబి రేకుల పొడి సమభాగాలుగా తీసుకుని కలుపుకోవాలి. చెంచాడు పొడిలో మూడు నాలుగు చుక్కల వేపనూనె, కొద్దిగా తేనె, నిమ్మరసం పిండుకుని ముద్దలా కలుపుకోవాలి. దానిని ముఖానికి పట్టించి, అరగంటసేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది. -
World Mosquito Day: ప్రాణి చిన్నది.. ప్రమాదం పెద్దది..!
సీతంపేట: మలేరియా, డెంగీ, చికున్ గున్యా పేర్లు వినని వారు ఉండరు. దోమవల్ల వ్యాపించే ప్రాణాంతకమైన జ్వరాలివి. చిన్నదోమ ఎంత పెద ప్రమాదాన్ని తీసుకువస్తుందో చెప్పడానికి ఈ జ్వరాలే ఉదాహరణ. మనుషుల రక్తాన్ని పీల్చి వ్యాధుల బారిన పడవేసే దోమల బెడద పట్టణాలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. దోమల బారిన పడకుండా వాటిని తరిమి కొట్టే జాగ్రత్తలు తీసుకుంటేనే అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలమని వైద్యులు సూచిస్తున్నారు. దోమల దినం ఎందుకంటే.. ప్రపంచానికి కామన్ శత్రువుగా మారిన దోమల ఆట కట్టించడానికి సర్ రోనాల్డ్ రాస్ శతాబ్దం క్రితమే రంగంలోకి దిగారు. 1897లో ఆయన దోమల ద్వారానే మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని నిర్ధారించారు. ఈ పరిశోధనకు గానూ ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లండన్ స్కూల్ ఆఫ్ హైజెనిక్ అండ్ ట్రాపికల్ మెడిసన్ ఆగస్టు 20వ తేదీని అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించింది. అరికట్టేదెలా.. దోమ ఎగురుతున్నపుడు పట్టుకోవడం, చంపడం చాలా కష్టం. ఒక్క దోమను పట్టుకోవాలంటే ఎంతో శ్రమించాలి. కాని దోమలు నీటిలో లార్వా, ప్యూపా దశలో పెరుగుతున్నపుడు నాశనం చేయడం సులువు. అవి ఇంటిలో నీటిని నిల్వ చేసే కుండీల్లో చిన్నచిన్న పురుగుల్లా కనిపిస్తుంటాయి. దోమ పిల్లలు (లార్వా) నిల్వ నీటిలో ఉన్నట్లయితే ఆ నీటిని మట్టి లేదా ఇసుకలో పారబోయాలి. ఇలా చేయడం వల్ల లార్వా, ప్యూపా దశల్లో ఉన్న వాటిని వందల సంఖ్యలో నాశనం చేయవచ్చు. నిలువ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. ఒక దోమ వంద నుంచి 200 వరకు గుడ్లను పెడుతుంది. ఇవన్నీ కేవలం 8 నుంచి 10 రోజుల్లో దోమలుగా మారిపోతాయి. గుడ్డు నుంచి లార్వా, ప్యూపా, అడల్ట్ మస్కిటోగా రూపాంతరం చెందుతాయి. దోమలదాడికి లక్షల్లో ఖర్చు.. దోమలు ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమల దాడిని తట్టుకునేందుకు ప్రతి నెల నిత్యావసర సామగ్రి మాదిరిగానే లిక్విడ్స్, మస్కిటో రీఫిల్స్, కాయిల్స్, మస్కిటో ధూప్‌స్టిక్స్ వంటి వాటికి నెలకు రూ.100 నుంచి రూ.500 వరకు ఒక్కో కుటుంబం ఖర్చు చేస్తోంది. ఇవి కాకుండా దోమల బ్యాట్స్, దోమతెరలు, యాంటీ మస్కిటోమెస్ వంటి వాటికోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించక తప్పడం లేదు. ఆడదోమలే ప్రమాదకరం.. మగ దోమలు చెట్ల రసాలను పీల్చి బతుకుతాయి. ఆడ దోమలు మాత్రం సంతానాభివృద్ధిలో భాగంగా గుడ్లు పెట్టడానికి మనిషి రక్తాన్ని పీల్చుతుంటాయి. ఈ క్రమంలో వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కుట్టిన దోమ ఆ వ్యక్తి రక్తాన్ని పీల్చినపుడు రక్తంతో పాటు వ్యాధి కారకమైన పారాసైట్ దోమ లాలాజల గ్రంధుల్లోకి చేరుతుంది. అక్కడ పారాసైట్‌లో కొన్ని మార్పులు జరుగుతాయి. మరో ఆరోగ్యవంతమైన వ్యక్తిని అదే దోమ కుట్టినపుడు దాని లాలాజలంతో పాటు పారసైట్ ఆ వ్యక్తి రక్తంలో చేరి వ్యాధులకు కారణమవుతుంది. అనార్థాలివే.. ► ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మలేరియా,డెంగీ, చికెన్‌గున్యా జ్వరాలు, ఈడిస్, క్యూలెక్స్ దోమలవల్ల బోదకాలు వస్తాయి. ► జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాల కారణంగా రోడ్లపైన కొబ్బరిబొండాలు, పాతటైర్లు, రుబ్బురోళ్లలో నిల్వ ఉన్న నీరు వీటి ఆవాస కేంద్రాలు. ► అవసరాల కోసం నీటిని కుండీలు, ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో నీటిని నిల్వ చేయడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. నివారణ ఇలా .. ► వేపనూనె దోమలను తరిమికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వాసన దోమలు భరించలేవు. వేప,కొబ్బరినూనెలను సమాన భాగాలుగా చేసుకుని బయటకు కనిపించే శరీర భాగాలపై రాసుకుంటే దోమలు దరిచేరవు. ► ఇళ్లలోకి దోమలు ప్రవేశించే కిటికీల వంటి ద్వారాల వద్ద తులసి మొక్కలను పెంచాలి. ఇవి దోమలను దూరం చేస్తాయి. దోమల వృద్ధి లేకుండా చూస్తాయి. ► లెమన్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ మిశ్రమం దోమలను తరిమికొడుతుంది. దోమలను తరిమికొట్టడంలో కర్పూరం మెరుగ్గా పనిచేస్తుంది. ఖాళీ ప్రదేశాలను మూసిన తర్వాత కర్పూరాన్ని వెలిగిస్తే దానినుంచి వచ్చే పొగకు దోమలు మాయమవుతాయి. తగ్గిన హైరిస్క్ గ్రామాలు దోమల నివారణకు మూడేళ్లుగా ప్రభుత్వ చేపట్టిన చర్యల వల్ల మలేరియా,డెంగీ, చికున్‌గున్యాలు దశలవారీగా తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో ఒకప్పుడు మలేరియా పాజిటివ్‌గా 100కు పైగా ఉన్న హైరిస్క్ మలేరియా గ్రామాలు ఇప్పుడు 45కు తగ్గుముఖం పట్టాయి. ఈనెల 16నుంచి 31 వరకు మొదటి రౌండ్ సింథటిక్ ఫైరాత్రిన్ జిల్లా వ్యాప్తంగా పిచికారీ చేశారు. 2 లక్షలకు పైగా దోమతెరలు పంపిణీ చేశారు. అలాగే 4లక్షలు పైగా గంబూషియా చేపలను నీటి కుంటల్లో వేశారు. దోమల నివారణకు విస్తృత చర్యలు దోమల నివారణకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నాం. దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నాం. గ్రామాల్లో దోమతెరల విని యోగంపై గిరిజనులకు చైత న్యం కలిగిస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడైనా మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలితే వెంటనే మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. ర్యాపిడ్ ఫీవర్, మలేరియా సర్వేలు చేస్తున్నాం. ఒకసారి ఏ గ్రామంలోనైనా జ్వరాలకు సంబంధించి పాజిటివ్ వస్తే మళ్లీ అక్కడ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. -కె.పైడిరాజు, జిల్లా మలేరియానివారణాధికారి -
చుండ్రు వల్ల ఇబ్బందా.. ‘వేప’తో ఇలా చెక్ పెట్టొచ్చు!
Home Remedies For Dandruff: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? వేపతో చుండ్రు సమస్యను అరికట్టవచ్చని మీకు తెలుసా!! నిజానికి చుండ్రు నివారణకు వేపకంటే కంటే శ్రేష్ఠమైన, సౌకర్యవంతమైన రెమిడీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో! ట్రైకాలజిస్టులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. చుండ్రు నివారించి, అందమైన సిల్కీ హెయిర్ పొందడంలో వేప ఆకుల పాత్ర ఏమిటో, అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం.. చుండ్రుతో తంటాలెన్నో.. తలపై చర్మం పొడి (డ్రై స్కిన్)గా ఉండే వారిలో సాధారణంగా కనిపించే సమస్య చుండ్రు. భుజాలపై పొలుసులుగా రాలి చూపరులకే కాకుండా మనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చుండ్రు కేవలం తలపై చర్మాన్ని మాత్రమే కాకుండా, ముఖం, శరీరం అంతటిపై కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. చుండ్రుకు కారంణం పొడి చర్మం అని మీరనుకోవచ్చు. కానీ నిజానికి ఇది మలస్సేజియా అనే శిలింధ్రాల జాతికి చెందిన ఫంగస్ కారణంగా చర్మంపై పుడుతుంది. దీని జీవితకాల పరిమితి అతిస్వల్పమైనప్పటికీ వేగంగా పెరగడం, విస్తృతంగా వ్యాపించడం దీని ప్రధాన లక్షణాలు. సాధారణంగా ఈ శిలింధ్రం చలికాలంలో వేగంగా వ్యాపిస్తుంది. అయితే మీరు సరైన సమయంలో, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎన్నిసార్లు తొలగించినా చుండ్రు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. కాబట్టి సమస్యను సకాలంలో గుర్తించి సరైన చికిత్స అనుసరించడం ఉత్తమం. సుగుణాల వేప వేప మన ఇంటి చుట్టుపక్కల సులభంగా దొరికే దివ్యౌషధం. ఏ ఋతువులోనైనా అందుబాటులో ఉంటుంది. అనేక చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను నివారించడంలో వేపకు సాటి మరొకటి లేదు. రక్తశుద్ధీకరణతో పాటు యాంటీ మైక్రోబయల్ కారకాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఫంగల్ (శిలీంధ్ర సంహారిణి), యాంటీ వైరల్ (వైరస్ నిరోధకత), యాంటీ ఇన్ఫ్లమేటరీ (తాపనివారణ)కు సమర్ధవంతంగా పనిచేస్తుంది. ప్రతి ఉదయం వేప ఆకులను తినాలి బ్యూటీ ఎక్స్పర్ట్స్, ఆరోగ్య నిపుణులు చెప్పేదేంటంటే.. చుండ్రు నుంచి సులువుగా ఉపశమనం పొందాలంటే రోజూ ఉదయం గుప్పెడు వేప ఆకులు తినాలి. చేదును తప్పించుకోవడానికి కొంచె తేనె జోడించి తింటే సరి. వేపాకులను మరిగించి కషాయం రూపంలో కూడా తాగవచ్చు. దీనివల్ల కలిగే లాభాలను మీరొకసారి గమనించారంటే, ఈ ప్రక్రియ మరీ అంత కష్టమనిపించదు. వేప నూనె వేప నూనెను ఇంటిలో సులభంగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కొన్ని వేపాకులు వేసి మరిగించిన తర్వాత కొన్ని చుక్కల నిమ్మ రసం చేర్చితే వేప నూనె రెడీ! ఈ నూనెను తలకు పట్టించిన తర్వాత ఎండలోకి వెళ్లకపోవడం బెటర్. నూనెలోని నిమ్మరసం సూర్యరశ్మి వల్ల జుట్టుకు హాని కలగచేయవచ్చు. ఈ నూనెతో మాడుకు మర్ధనాచేసి, రాత్రంతా ఉంచి ఉదయానే తలస్నానం చేస్తే సరిపోతుంది. వేప - పెరుగు మిశ్రమం పెరుగుకలిపిన వేపాకును తలకు పట్టించటం ద్వారా చుండ్రు సమస్యకు కళ్లెం వేయవచ్చు. ముందుగా వేపాకును పేస్టులా చేసుకుని, ఒక గిన్నె పెరుగులో కలుపుకుని మాడు మొత్తానికి పట్టించి, 15-20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. వేపలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు, పెరుగులోని చల్లదనం చుండ్రును నివారించడమే కాకుండా కుదుళ్లను బలపరచి, మెత్తని సిల్కీ హెయిర్‌ను మీ సొంతం చేస్తుంది. వేప హెయిర్ మాస్క్ డాండ్రఫ్ నివారణ పద్ధతుల్లో వేప హెయిర్ మాస్క్ మరొక సులువైన మార్గం. కొన్ని వేపాకులను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ తేనెను దానికి కలపాలి. దీనిని హెయిర్ మాస్క్‌లా మాడు భాగం మొత్తానికి పట్టించి 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. జుట్టు ఆరిపోయాక ఫలితం మీకే తెలుస్తుంది. హెయిర్ కండీషనర్‌లా వేప వేప ప్రత్యేకత ఏమిటంటే దానిని తలస్నానానికి ముందు లేదా తర్వాత వాడినా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఎలాచేయాలంటే.. కొన్ని వేపాకులను తీసుకుని బాగా మరిగించాలి. తర్వాత చల్లారనివ్వండి. షాంఫుతో తలస్నానం చేశాక, ఈ వేప మిశ్రమంతో తలను కడిగిచూడండి. తేడా మీకే తెలుస్తుంది. వేప షాంపు అన్ని రకాల చుండ్రు సమస్యలకు సులభమైన పరిష్కారం వేపషాంపు. వేపతో తయారు చేసిన షాంపుతో వారానికి రెండూ లేదా మూడు సార్లు తలస్నానం చెస్తే సరిపోతుంది. సాధారణంగా డాండ్రఫ్ నివారణకు వేపతో తయారుచేసిన షాంపులను వాడాల్సిందిగా నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే చుండ్రు నివారణకు అవసరమైన అన్ని సుగుణాలు వీటిల్లో సరిపడినంతగా ఉంటాయి. హెయిర్ ఎక్స్పర్ట్స్ చెప్పేదేమిటంటే.. వేపలోని ఔషధ గుణాలు అన్నిరకాల జుట్టు సంబంధిత సమస్యలను నివారిస్తాయి. మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి. ఈ 6 రకాల సింపుల్ రెమెడీస్ తరచుగా వినియోగించడం ద్వారా ఆరోగ్యమైన, అందమైన జుట్టు మీ సొంతమవుతుందనేది నిపుణుల మాట. చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
జనవరి నెలలో పశువుల యాజమాన్యం
చలికాలం ముసుగుపోయి జనవరి మధ్యలో ఎండలు వెల్లిగా మొదలవుతాయి. పశువుల యాజమాన్యం గురించి జనవరి నెలలో కొన్ని మెలకువలను పాటించవలసి ఉంది. ► వేసవి మొదలు కావడంతో ముందుగా మనకు కానవచ్చేది పచ్చిమేత కొరత వర్షాకాలంలో, శీతాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే పచ్చిమేతను సైలేజీ గడ్డిగాను, ‘హే’గాను తయారు చేసుకునే సమయమిది. పాతర గడ్డిని తయారు చేసుకొని వేసవి సమయంలో పశువులకు మేపుకోవచ్చు. ► పశువులను పొగమంచు నుంచి రక్షించుకోవాలి. లేకపోతే న్యూమోనియా వస్తుంది. ► పశువు శరీరంలో తగినంత వేడిని పుట్టించడానికి ప్రొటీన్ కేకులు, బెల్లం కలిపి పశువుకు మేపాలి. ► ఖనిజాల లోపం రాకుండా పశువుల కొట్టాల్లో ఖనిజలవణ మిశ్రమ ఇటుకలను వేలాడదీయాలి. ► జనవరి నెలలో తప్పనిసరిగా నట్టల మందు తాపించాలి. ► బాహ్య పరాన్న జీవుల బెడద నుంచి కాపాడుకోవడానికి కొట్టాల్లో తులసి, లెమన్‌గ్రాస్ లాంటి మొక్కలను వేలాడదీయాలి. ఆ వాసనకు కొన్ని పరాన్న జీవుల నియంత్రణ జరుగుతుంది. ► ఈగలు వాలకుండా వేపనూనె సంబంధిత ద్రావకాలను షెడ్లలో పిచికారీ చేయాలి. ∙జీవాల వలస సమయలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిందటి వారం ‘సాగుబడి’ శీర్షికలో ప్రచురితమైంది. ► పశువుల్లో గాలికుంటు, పి.పి.ఆర్., చిటుక వ్యాధికి టీకా వేయించాలి. ► పండ్ల తోటలున్న వారు, వారి తోటల్లో స్టైలో హెమాటా లాంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
వేప నూనెతో ఎన్నో ప్రయోజనాలు
వేపనూనె... వేప పిండి... ఇవి రెండూ రైతులకు సుపరిచితమే. వీటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపైనా అవగాహన ఉంది. అయితే వినియోగంలో మాత్రం అంతగా చొరవ చూపడంలేదు. వేపనూనె వినియోగిస్తే పైరును చీడపీడలు ఆశించవు. రసాయన మందుల వాడకం తగ్గుతుంది. సాగు ఖర్చులు కలిసొస్తాయి. వేపనూనె వినియోగం, దాని వల్ల కలిగే ప్రయోజనాలు కంకిపాడు ఏవో లంక శ్రీనివాస్ మాటల్లో.. వేపనూనెలో అజాడిరిక్టన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చేదుగా ఉంటుంది. దీనిని వాడితే మొక్కలు కూడా చేదెక్కుతాయి. దీని వల్ల మొక్కలను తినేందుకు పురుగులు ఆశించవు. వేప నూనె, వేపపిండి వినియోగిస్తే పైరులను ఆశించే చీడపీడలను నివారించొచ్చు. దీంతో పురుగు మందుల వినియోగం ఖర్చు తగ్గుతుంది. వేపనూనె ద్వారా పంటకు అవసరమైన చేవ సమృద్ధిగా అందుతుంది. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గడంతో రైతుకు పెట్టుబడులపై వ్యయం ఆదా అవుతుంది. గతంలో వేపనూనె వినియోగం తక్కువగా ఉండేది. ప్రస్తుతం రైతుల్లో అవగాహన పెరగటంతో వినియోగం కొద్దిగా పెరిగింది. వేపనూనె వినియోగం, దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. - కంకిపాడు ఇలా వాడుకోవాలి.. వేప నూనెను పంట పొలంలో నేరుగా కానీ, యూరియా, పురుగు మందుల్లో కానీ కలిపి వినియోగించాలి. పంట ఏదైనా సరే, ఏ సమయంలో నైనా వేప నూనె వాడితే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, పురుగు మందు, సూక్ష్మధాతు మిశ్రమాల్లో వేపనూనె కలిపి వాడుకోవచ్చు. యూరియా 50 కిలోల బస్తాకు అర లీటరు నుంచి లీటరు వరకూ వేప నూనె, వేప పిండి అయితే 50 కిలోల బస్తాకు 10 కిలోల వరకూ కలిపి వాడుకోవాలి. యూరియా భూమిలో త్వరగా కరిగిపోకుండా చూస్తుంది. నత్రజని మొక్కకు ఎక్కువ సమయం అందే విధంగా చూడటం వేప నూనె ద్వారానే సాధ్యం. నత్రజని వృథా కాకుండా నిరోధిస్తుంది. పంటలకు కీడుచేసే పురుగు సంతతిని నివారిస్తుంది. పురుగుకు చెందిన గుడ్లు పొదగకుండా వాటిని నిర్వీర్యం చేయటంలో దోహదపడుతుంది. దీని వల్ల అధికంగా పురుగు మందులు వినియోగించాల్సిన అవసరం ఉండదు. వేప నూనె వాడకంతో నత్రజని ఎరువులు వినియోగం తగ్గుతుంది. వ్యవసాయ పెట్టుబడుల్లో ఖర్చులో 20 శాతం, పురుగు మందుల వినియోగం ఖర్చులో 40 శాతం తగ్గుతుంది. నత్రజని వృథా కాకుండా ఉండటమే కాకుండా, మొక్క చేదు ఎక్కటం వల్ల పురుగు వ్యాప్తి నిరోధించటానికి దోహదపడుతుంది. పండ్ల తోటల్లో వినియోగం ఇలా.. పండ్ల తోటల్లో అయితే వేప నూనెను చిన్న ప్లాస్టిక్ సంచుల్లో నింపి మొక్క వేరుకు తగిలించాలి. వేరు ద్వారా నూనె మొక్కకు నేరుగా చేరుతుంది. దీని వల్ల పురుగును నివారించుకోవచ్చు. గానుగ నుంచి తెచ్చిన వేప పిండి పండ్ల తోటలకు పనికిరాదు. వేపనూనెనే వినియోగించాలి. అరటి, పసుపు, కంద, మిర్చి తోటల్లో ఆముదపు పిండి, గానుగ పిండి, పొగాకు పిండితో పాటుగా వేప పిండి కలిపి చల్లుకుంటే పంటకు ఉపయుక్తంగా ఉంటుంది. మొక్క ఎదుగుదలకు, పురుగు నియంత్రణకు పిండి దోహదపడుతుంది. వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై వేపనూనె అందిస్తుంది. లీటరు రూ.100 చొప్పున విక్రయిస్తోంది. వేప పిండి మాత్రం వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా లేదు. బయటి మార్కెట్లో 40 కిలోల వేప పిండి బస్తా రూ.600 నుంచి రూ.800 వరకూ ధర పలుకుతోంది. లంక శ్రీనివాస్ 88866 13370