వేప చెట్టు ఇంటి దగ్గర్లో ఉంటే వేరే సౌందర్యసాధనాలతో పనే ఉండదు. వేపాకులు, బెరడు, వేపనూనె ఔషధాలుగానే కాదు, సౌందర్య సాధనాలుగానూ ఉపయోగపడతాయి. ఎలాంటి చర్మ సమస్యలకైనా వేపతో ఇట్టే చెక్ పెట్టేయవచ్చు.
► ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడుతుంటే వేపాకులతో చక్కని విరుగుడు ఉంది. గుప్పెడు వేపాకులను అరలీటరు నీటిలో వేయాలి. వేపాకులు పూర్తిగా మెత్తగా మారిపోయేంత వరకు ఆ నీటిని మరిగించాలి. కాసేపటికి నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు వడగట్టి ఆ కషాయాన్ని సీసాలో భద్రపరచుకోవాలి.
►ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ నీటితో కాస్త దూదిని తడిపి ముఖాన్ని రుద్దుకుంటే చాలు. మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి. ∙చర్మం పొడిబారి, తరచు దురదలు పెడుతున్నట్లయితే, పైన చెప్పుకున్నట్లే వేపాకులతో కషాయం చేసి, బకెట్ నీటిలో ఒకకప్పు కషాయాన్ని పోసి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే చాలు, కొద్దిరోజుల్లోనే చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది.
► ముఖం తరచు జిడ్డుగా మారుతుంటే, వేపాకుల పొడి, గంధం పొడి, గులాబి రేకుల పొడి సమభాగాలుగా తీసుకుని కలుపుకోవాలి. చెంచాడు పొడిలో మూడు నాలుగు చుక్కల వేపనూనె, కొద్దిగా తేనె, నిమ్మరసం పిండుకుని ముద్దలా కలుపుకోవాలి. దానిని ముఖానికి పట్టించి, అరగంటసేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment