neem
-
ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా వేపాకులతో చెక్ పెట్టొచ్చు
వేప చెట్టు ఇంటి దగ్గర్లో ఉంటే వేరే సౌందర్యసాధనాలతో పనే ఉండదు. వేపాకులు, బెరడు, వేపనూనె ఔషధాలుగానే కాదు, సౌందర్య సాధనాలుగానూ ఉపయోగపడతాయి. ఎలాంటి చర్మ సమస్యలకైనా వేపతో ఇట్టే చెక్ పెట్టేయవచ్చు. ► ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడుతుంటే వేపాకులతో చక్కని విరుగుడు ఉంది. గుప్పెడు వేపాకులను అరలీటరు నీటిలో వేయాలి. వేపాకులు పూర్తిగా మెత్తగా మారిపోయేంత వరకు ఆ నీటిని మరిగించాలి. కాసేపటికి నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు వడగట్టి ఆ కషాయాన్ని సీసాలో భద్రపరచుకోవాలి. ►ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ నీటితో కాస్త దూదిని తడిపి ముఖాన్ని రుద్దుకుంటే చాలు. మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి. ∙చర్మం పొడిబారి, తరచు దురదలు పెడుతున్నట్లయితే, పైన చెప్పుకున్నట్లే వేపాకులతో కషాయం చేసి, బకెట్ నీటిలో ఒకకప్పు కషాయాన్ని పోసి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే చాలు, కొద్దిరోజుల్లోనే చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది. ► ముఖం తరచు జిడ్డుగా మారుతుంటే, వేపాకుల పొడి, గంధం పొడి, గులాబి రేకుల పొడి సమభాగాలుగా తీసుకుని కలుపుకోవాలి. చెంచాడు పొడిలో మూడు నాలుగు చుక్కల వేపనూనె, కొద్దిగా తేనె, నిమ్మరసం పిండుకుని ముద్దలా కలుపుకోవాలి. దానిని ముఖానికి పట్టించి, అరగంటసేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది. -
ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా...
పిల్లలు కొన్నిసార్లు ఎంత రుచిగా చేసి పెట్టినా సరే, ఆకలి కావడం లేదంటారు. తరచూ విరేచనాలు చేసుకుంటారు. బరువు తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తుంటారు. ఎందుకు ఇలా అవుతోందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. నిజానికి ఇవి ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలేమీ కాదు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం... తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి రోగాల బారిన పడుతారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాల మీదికి కూడా వస్తుంది. కడుపులో నులి పురుగులు పోవడానికి... ►వేప నూనె పది చుక్కలు చక్కెరలోవేసి లోపలకు తీసుకుంటే క్రిములు నశిస్తాయి. ►గుప్పెడు లేత వేప చిగురు, అర చెంచా ఉప్పు, అర చెంచా పసుపు కలిపి మాత్రల్లా చేసుకొని రాత్రి నిద్రించే ముందు ఒక మాత్ర వేసుకుంటే నులిపురుగులు నశిస్తాయి. ►పచ్చి బొప్పాయి కాయకు గాట్లు పెట్టగా వచ్చిన పాలు చెంచా, ఆముదం చెంచా కలిపి తాగితే.. పురుగులు పడి పోతాయి. ►ఎండించిన వేప పువ్వు 50 గ్రాములు. మిరియాల పొడి చెంచా, ఉప్పు చెంచా కలిపి ప్రతిరోజు భోజనంలో మొదటి ముద్దగా కలుపుకుని తినాలి, లేదా గ్లాసు నీటిలో ఒక చెంచా వేసి సగం అయ్యే వరకు మరిగించి కషాయం లాగా తాగినా కూడా నులిపురుగులు నశిస్తాయి. ►వీటన్నింటినీ చేయడం కష్టం అనుకుంటే ఆల్బెండిజాల్ ట్యాబ్లెట్‌ను పదిహేను రోజులకొకసారి చొప్పున నెలరోజులు వాడాలి. ఒక నెల గ్యాప్ ఇచ్చి అదే రిపీట్ చేయాలి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: మేడం.. నాకు 25 ఏళ్లు... మూడుసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్లాను... పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి? -
Beauty Tips: వేప, తేనె, పాలు.. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే!
వర్షాకాలంలో సైతం కొంతమంది చర్మం తేమలేక పొడిబారడమే గాక, మొటిమలతో విసిగిస్తుంటుంది. ఇటువంటి చర్మానికి తేనె, వేప, పాలతో తయారైన ఫేస్‌ప్యాక్ మంచి పరిష్కారం చూపుతుంది. వేప.. మొటిమలను తగ్గిస్తే... తేనె చర్మానికి తేమనిస్తుంది. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే! రెండు టేబుల్ స్పూన్ల వేపాకు పేస్టులో టేబుల్ స్పూను తేనె, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పచ్చి పాలు పోసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు పోయి ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కాంతివంతమైన ముఖం కోసం.. ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను పెరుగు, అర స్పూను తేనె కలిపి... ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. రోజూ ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది. దీనిని అన్ని రకాల చర్మతత్వాల వాళ్లూ పాటించవచ్చు. అయితే డ్రైస్కిన్కి మీగడ పెరుగు, ఆయిలీ స్కిన్ వాళ్లు మీగడ లేని పెరుగు వాడాలి. చదవండి: Yami Gautam: నా బ్యూటీ సీక్రెట్ అదే! ఇలా చేస్తే చర్మం నిగనిగలాడుతుంది -
అయోమయంలో రైతులు.. దిగజారుతున్న నిమ్మధరలు
సాక్షి,పొదలకూరు(నెల్లూరు): నిమ్మధరలు రోజురోజుకూ దిగుజారుతున్నాయి. నిమ్మతోటల్లో కాయల దిగుబడి పెరుగుతున్నా ధరలు పతనం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిమ్మకాయలు అధికంగా యార్డుకు వస్తున్నాయని, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది రైతులు ఆశించిన స్థాయి కన్నా ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం నిమ్మమార్కెట్ యార్డులో లూజు(బస్తా) ఒక్కటింటికి రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు ధర పలుకుతోంది. పొదలకూరు మండలంలో సుమారు 5 వేల హెక్టార్లలో రైతులు నిమ్మసాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి నిమ్మధరలు పెరుగుతుంటాయి. ఈ ఏడాది ఊహించని రీతిలో ధరలు బస్తా రూ.16 వేల వరకు పలికి రికార్డు స్థాయిలో ధరలు నమోదయ్యాయి. ధరలు పెరిగినా దిగుబడి లేదు ఈ ఏడాది నిమ్మ ధరలు రూ.16 వేలకు పైబడి లూజు(బస్తా) పలికి నెల రోజులపాటు ధరలు నిలకడగా ఉండడం వల్ల వ్యాపారులు, కొందరు రైతులు ఆశించిన స్థాయిలో లబ్ధిపొందారు. అయితే ఎక్కువ మంది రైతుల తోటల్లో సీజన్లో కాయల దిగుబడి లేక పోవడం వల్ల ఆదాయం పొందలేకపోయారు. తమ పక్కతోట రైతుకు కాయలు విరగ్గాస్తే తన తోటలో కాయలు లేని విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నామని రైతులు తెలిపారు. ఇపుడు చాలామంది రైతుల తోటల్లో కాయల దిగుబడి పెరిగినా ధరలు రోజురోజుకూ దిగజారుతుండడంతో అయోమయంలో ఉన్నారు. తోటల నుంచి కాయలు యార్డుకు అధిక సంఖ్యలో వస్తుండడంతో వ్యాపారులు ఎగుమతి చేయడం కష్టంగా మారిందంటున్నారు. చదవండి: ప్లీజ్... మమ్మల్ని వదిలేయండి, మాకు బతకాలని ఉంది -
ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వాటి గురించి పిల్లలకు తెలుసా!
ఉగాది సమయం ఆ వేప పూత ఆ మావి వగరు ఆ చింత చిగురు ‘పదిగ్రాముల వేపపూత 200 రూపాయలు’... ఆన్లైన్లో చూసి కొనేంతగా ఎదిగాం. ప్రకృతితో కలిసి చేసేదే పండగ... ఉగాది వేళలో మావిచిగురు కోకిల పాట... గాలికి ఊగే వేపపూత... ఈకాలపు పిల్లలకు తెలియని దూరానికి చేరాం. గతంలో వేప చెట్టు, మావిడి చెట్టు... ప్రతి వీధిలో ఉండేవి. ఇప్పుడు? పండగ హడావిడికి సిద్ధమవుతున్నాం. ప్రకృతి స్తబ్దతను గమనిస్తున్నామా? ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వేపచెట్టు. వేపపువ్వు చేదుకి. మామిడి చెట్టు. మామిడి పిందె వగరుకి. చింతచెట్టు. పులుపు రుచికి. కొన్నిచోట్ల కొబ్బరి కోరు వేస్తారు. అంటే కొబ్బరి చెట్టు. మరికొన్ని చోట్ల బాగా మగ్గిన అరటిపండు ముక్కలు కలుపుతారు. అంటే అరటి చెట్టు. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని ఇళ్లల్లో ఉన్నాయి. పిల్లలు ఎంతమంది వీటిని తాకి చూస్తున్నారు. ఎందరు వీటి నీడలో ఆడుతున్నారు. ఎందరు వీటిని చూశాం అని చెబుతున్నారు. నగరం అయినా.. పట్టణం అయినా.. పల్లె అయినా. ఆ వేప కొమ్మలు... చెట్టు పెంచడం మన ఆచారం. చెట్టుతో పాటు ఇల్లు ఉండాలనుకోవడం మన సంస్కృతి. ప్రతి వీధికి వేప చెట్టు అరుగు ఉండేది. వీధిలోని ఒకటి రెండు ఇళ్ల వాళ్లయినా ముంగిలిలో వేప చెట్టు వేసుకునేవారు. కొన్ని చెట్లు పెరిగి పెద్దవై ప్రహరీగోడను కప్పేసేవి. చెట్ల కొమ్మలు ఇంటి వైపుకు వాలి నీడను పెంచేసేవి. పిల్లలు రాలిన వేప ఆకులు తొక్కుకుంటూ ఆడుకునేవారు. పసుపుపచ్చటి వేపపండ్లు తుంచి వగరు తీపితో ఉండే వాటి రుచిని చూసేవారు. వాటి గింజలను గుజ్జును పారేసి ఖాళీ డిప్పలలో పుల్లను గుచ్చి ఆడుకునేవారు. వేణ్ణీళ్లలో వేపాకులను కలిపి తల్లులు స్నానం చేయిస్తుండేవారు. నెలకు ఒకటి రెండుసార్లు లేత వేపాకులను నూరి చిన్ని ముద్దలను చేసి చక్కెర అద్ది మింగించేవారు. దడుపు చేస్తే, జ్వరం వస్తే వేప మండలు దిష్టి తీసి నెమ్మది కలిగించేవారు. వేపపుల్లతో పళ్లుతోమడం అలవాటు చేసేవారు. వేపబద్దతో నాలిక గీసుకోవడం ఆరోగ్యం. ఉగాది పండగ రోజు వేపపూత పిల్లల చేతే కోయించేవారు. వేప బెరడుకు బంక కారితే పిల్లలు దానిని గిల్లి సీసాల్లో దాచుకునేవారు. వేప కాండంపై పాకే గండు చీమలు, గెంతుతూ వెళ్లే ఉడతలు, కొమ్మల్లో గూడు పెట్టే కాకులు, ఇంట్లో కోళ్లు పెంచుతుంటే గనక అవి ఎరిగి రాత్రిళ్లు ఆ కొమ్మలపైనే తీసే నిద్ర... పండగలో చెట్టును పెట్టింది చెట్టును కాపాడుకోమని. ప్రకృతిని తెలుసుకోమని. ఇవాళ పెద్ద చెట్లు వేస్తున్న ఇళ్లు ఎన్ని? పెద్ద చెట్లకు వీలైన స్థలం ఎక్కడ దొరుకుతోంది? పూల కుండీలు, మిద్దెతోట... సర్దుబాటు జీవనం... రెక్కలు సాచిన విశాలమైన వృక్షాలు గత చరిత్రగా మారాయి. ఆ మామిడి పిందెలు... మామిడి చెట్టు ఉన్న ఇంటికి మర్యాద జాస్తి. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా వచ్చి మామిడి ఆకులు అడుగుతారు. ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే ‘ఆ మామిడి చెట్టున్న ఇల్లు’ అని చెబుతారు. మామిడి చెట్లు చాలామటుకు శుభ్రంగా ఉంటుంది. వాటి గుబురు ఆకులను చూస్తే ఆనందం కలుగుతుంది. వచ్చిన బంధువులంతా ‘ఏ మామిడి’ అని ఆరా తీస్తారు. బంగినిపల్లో, బెంగుళూరో, నీలమో, నాటు మామిడో... ఏదో ఒక జవాబు చెప్పాలి. పిల్లలు మామిడి కొమ్మలకు తాళ్లు కట్టి ఊయల ఊగుతారు. చిన్న కొమ్మలపై ఎక్కి కూచుంటారు. వేసవి వస్తే ఒళ్లంతా విరగబూసే మామిడి పూత మీద అందరి కళ్లు పడతాయి. పిందెల వేస్తున్నప్పటి నుంచి దిష్టి తగలకుండా యజమానులు నానా పాట్లు పడతారు. ఉండుండి పాడిగాలి వీచి పిందె రాలితే అదో బాధ. కోతుల దండు ఊడి పడితే వాటిని తరిమికొట్టే వరకూ గాబరా. కాయ గుప్పిటంత పెరిగాక కోసి పచ్చడి చేస్తే ఆ రుచి అద్భుతం. ఉగాది పచ్చడి మన ఇంటి కాయ తెచ్చే రుచి అద్భుతం. చిటారున గుబురులో పండిన కాయ పిల్లలు నిద్ర లేచి చెట్టు కిందకు వెళితే రాలి కనపడుతుంది. కోయిలలు వచ్చి పాట పాడి పిల్లలను బదులివ్వమంటుంది. చిలుకలు పండిన కాయలను సుష్టుగా భోం చేసి ఎర్ర ముక్కులు చూపించి పోతాయి. మామిడి చెట్టు ఉంటే ఇంట్లో ఇంకో మనిషి ఉన్నట్టే. కాని కారు పార్కింగ్ కోసం ఆ చెట్టును వదిలేసిన ఇళ్లే ఇప్పుడు. పిల్లలూ... మామిడిపండ్లను మీరు మోర్ మార్కెట్స్‌లోనే చూడక తప్పదు. చింతచెట్టు కథలు జాస్తి... చింతచెట్టు ఇంట్లో పెంచరు. ఆ చెట్టు ఊరిది. ప్రతి ఊళ్లో చింతచెట్టు అరుగు ఉంటుంది. అది మనుషులు కూడా తమ చింతలు మాట్లాడుకునేంత గాఢమైన నీడను కలిగి ఉంటుంది. వేసవి మధ్యాహ్నాలు చింత చెట్టు కింద పట్టే నిద్ర సామాన్యంగా ఉండదు. చింతకాయలు కాస్తే పిల్లలు వాటిని రాళ్లతో రాల్చి నోట పెట్టుకుంటారు. ఆడవాళ్లు దోటీలు పట్టుకుని వచ్చి చింత చిగురు కోసి వండుతారు. ఊరికి కొత్తగా ఎవరైనా వస్తే చింత చెట్టు ఆరా తీస్తుంది. గూడు లేని వాళ్లకు రాత్రిళ్లు అది ఇల్లు అవుతుంది. కాని చింత చెట్టు అంటే భయం కూడా ఉంటుంది. దెయ్యాలు దానిలో టూ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుని ఉంటాయని పుకార్లు ఉంటాయి. చింతచెట్టు కింద పడుకున్నవారి గుండెల మీద రాత్రుళ్లు దెయ్యం కూచుంటుంది. చింతచెట్టుకు రాత్రిళ్లు కార్బన్ డై ఆక్సైడ్ విడిచే సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్లే తగిన ఆక్సిజన్ అందక ఈ భ్రాంతులు. చింతచెట్టు లేని బాల్యం చాలా బోసి. కొంగలు వాలడానికి ఇష్టపడే చెట్టు అది. ఇవాళ ఊళ్లలో ఫ్లెక్సీలు ఉన్నాయి. విగ్రహాలు ఉన్నాయి. చింత చెట్టు మాత్రం లేదు. ఆలోచించాలి అందరం... గతంలో ఎన్నో ఇళ్ల పెరళ్లలో అరటి చెట్లు ఉండేవి. చాలా ఇళ్లల్లో కొబ్బరి చెట్లు వేసేవారు. బాదం చెట్లు పెంచే ఇళ్లకు లెక్క ఉండేది కాదు. చెట్టుకు వదిలాకే కట్టుబడికి స్థలం వదిలేవారు. కట్టేది ఒక ఇల్లయితే చెట్టు నీడ ఒక ఇల్లు అని ఆ కాలంలో తెలుసు. కాని ఇవాళ కాంక్రీట్ ఇళ్లు మాత్రమే కట్టి వేడి పెంచుతున్నాం. ఎండ మండుతోందని అవస్థలు పడుతున్నాం. ఉగాది అంటే చెట్లకు ప్రాభవ సమయాలు ఉన్నట్టు బతుకుకు కూడా ప్రాభవ సమయాలు ఉంటాయని తెలుసుకోవడం. తీపిని ఆస్వాదించడంతో పాటు చేదును మింగాలని తెలుసుకోవడం. తుఫానొచ్చి కొమ్మలు విరిగి పడినా మళ్లీ చిగురించవచ్చని తెలుసుకోవడం. చెట్టుకు పిల్లల్ని దూరం చేయవద్దు. బాల్యాన్ని అరుచితో నింపొద్దు. ఆలోచించండి. కొత్త ఉగాదికి ఆహ్వానం పలకండి. -
పళ్లు తోముకుంటూ వేపపుల్ల మింగేశాడు.. ఆ తర్వాత..
సాక్షి,ఖమ్మం వైద్యవిభాగం: ఉదయం లేవగానే వేపపుల్లతో పళ్లు తోముకోవడం అలవాటు ఉన్న ఓ వ్యక్తి శనివారం అలాగే చేస్తుండగా పుల్ల ఒక్కసారిగా ఆయన గొంతులో నుంచి కడుపులోకి వెళ్లింది. దీంతో వైద్యులు ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే... ముదిగొండ మండలం కమలాపురానికి చెందిన గీత కార్మికుడు పర్సగాని ఆదినారాయణ శనివారం ఉదయం పళ్లు శుభ్రం చేసుకుంటుండగా వేపపుల్ల గొంతులోకి వెళ్లి మెల్ల గా కడుపులోకి చేరింది. వెంటనే కుటుంబ సభ్యులు నగరంలోని ఎపెక్స్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకురాగా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ టి.అరుణ్‌సింగ్ పరీక్షలు నిర్వహించి చిన్నగాటు కూడా పెట్టకుండా ఎండోస్కోపీ మిషన్ ద్వారా కడుపులోని వేపపుల్లను బయటకు తీశారు. ఈ సందర్భంగా చికిత్స వివరాలను ఆస్పత్రి డైరెక్టర్, యూరాలజిస్ట్ కె.కిశోర్‌కుమార్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్‌సింగ్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కే.వీ.ఎస్ చౌహాన్, కేన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు వి.ప్రదీప్ వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ కొరిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆ చెట్లకి డై బ్యాక్ వ్యాధి.. ఆందోళనలో అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేప చెట్లు డై బ్యాక్ వ్యాధితో ‘ఫోమోప్సిస్ అజాడిరిక్టే’అనే శీలీంధ్రం సోకి ఎండిపోయి, చనిపోతున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ ఆందోళన వ్యక్తంచేసింది. దేశ కల్పతరువు, సహజ సంజీవిని, ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య మంజరి అయిన వేప నేడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నందున దీన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో కోరింది. ఈమేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు తమ సామాజిక బాధ్యతగా ఉద్యమించి వేప చెట్టుకు జీవం పోసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది. కార్బెండిజమ్ (50 శాతం డబ్ల్యూపీ) మందును లీటర్ నీటిలో 2 గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిచేలా పోస్తే వేర్లు, కాండం మొదలులో ఉన్న శీలీంధ్రాన్ని.. ఈ మందు సమర్థవంతంగా అరికడుతుందని పేర్కొంది. ఏడు రోజుల తర్వాత థయోఫనేట్ మిథైల్ (70 శాతండబ్ల్యూపీ) మందును లీటర్ నీటిలో 2 గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిసేలా పోస్తే చెట్టు మొత్తానికి ఈ మందు చేరుకుని శీలీంధ్రాన్ని నాశనం చేస్తుందని తెలిపింది. ఇది మార్కెట్లో రోకో, థెరపీ తదితర పేర్లతో దొరుకుతుందని పేర్కొంది. 20 రోజుల తర్వాత మూడోచర్యలో భాగంగా ప్రోఫినోపాస్ మందును లీటర్ నీటిలో 3 మి.లీ. కలిపి చెట్టు మొదలు తడిచేలా పోయాలని తెలిపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించింది. చదవండి: Hyderabad: మాకొద్దు సారూ ఈ తిండి..! చారు నీళ్లలాగా.. కూరలు చారులాగా, గుడ్ల సంగతి సరేసరి.. -
చుండ్రు వల్ల ఇబ్బందా.. ‘వేప’తో ఇలా చెక్ పెట్టొచ్చు!
Home Remedies For Dandruff: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? వేపతో చుండ్రు సమస్యను అరికట్టవచ్చని మీకు తెలుసా!! నిజానికి చుండ్రు నివారణకు వేపకంటే కంటే శ్రేష్ఠమైన, సౌకర్యవంతమైన రెమిడీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో! ట్రైకాలజిస్టులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. చుండ్రు నివారించి, అందమైన సిల్కీ హెయిర్ పొందడంలో వేప ఆకుల పాత్ర ఏమిటో, అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం.. చుండ్రుతో తంటాలెన్నో.. తలపై చర్మం పొడి (డ్రై స్కిన్)గా ఉండే వారిలో సాధారణంగా కనిపించే సమస్య చుండ్రు. భుజాలపై పొలుసులుగా రాలి చూపరులకే కాకుండా మనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చుండ్రు కేవలం తలపై చర్మాన్ని మాత్రమే కాకుండా, ముఖం, శరీరం అంతటిపై కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. చుండ్రుకు కారంణం పొడి చర్మం అని మీరనుకోవచ్చు. కానీ నిజానికి ఇది మలస్సేజియా అనే శిలింధ్రాల జాతికి చెందిన ఫంగస్ కారణంగా చర్మంపై పుడుతుంది. దీని జీవితకాల పరిమితి అతిస్వల్పమైనప్పటికీ వేగంగా పెరగడం, విస్తృతంగా వ్యాపించడం దీని ప్రధాన లక్షణాలు. సాధారణంగా ఈ శిలింధ్రం చలికాలంలో వేగంగా వ్యాపిస్తుంది. అయితే మీరు సరైన సమయంలో, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎన్నిసార్లు తొలగించినా చుండ్రు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. కాబట్టి సమస్యను సకాలంలో గుర్తించి సరైన చికిత్స అనుసరించడం ఉత్తమం. సుగుణాల వేప వేప మన ఇంటి చుట్టుపక్కల సులభంగా దొరికే దివ్యౌషధం. ఏ ఋతువులోనైనా అందుబాటులో ఉంటుంది. అనేక చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను నివారించడంలో వేపకు సాటి మరొకటి లేదు. రక్తశుద్ధీకరణతో పాటు యాంటీ మైక్రోబయల్ కారకాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఫంగల్ (శిలీంధ్ర సంహారిణి), యాంటీ వైరల్ (వైరస్ నిరోధకత), యాంటీ ఇన్ఫ్లమేటరీ (తాపనివారణ)కు సమర్ధవంతంగా పనిచేస్తుంది. ప్రతి ఉదయం వేప ఆకులను తినాలి బ్యూటీ ఎక్స్పర్ట్స్, ఆరోగ్య నిపుణులు చెప్పేదేంటంటే.. చుండ్రు నుంచి సులువుగా ఉపశమనం పొందాలంటే రోజూ ఉదయం గుప్పెడు వేప ఆకులు తినాలి. చేదును తప్పించుకోవడానికి కొంచె తేనె జోడించి తింటే సరి. వేపాకులను మరిగించి కషాయం రూపంలో కూడా తాగవచ్చు. దీనివల్ల కలిగే లాభాలను మీరొకసారి గమనించారంటే, ఈ ప్రక్రియ మరీ అంత కష్టమనిపించదు. వేప నూనె వేప నూనెను ఇంటిలో సులభంగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కొన్ని వేపాకులు వేసి మరిగించిన తర్వాత కొన్ని చుక్కల నిమ్మ రసం చేర్చితే వేప నూనె రెడీ! ఈ నూనెను తలకు పట్టించిన తర్వాత ఎండలోకి వెళ్లకపోవడం బెటర్. నూనెలోని నిమ్మరసం సూర్యరశ్మి వల్ల జుట్టుకు హాని కలగచేయవచ్చు. ఈ నూనెతో మాడుకు మర్ధనాచేసి, రాత్రంతా ఉంచి ఉదయానే తలస్నానం చేస్తే సరిపోతుంది. వేప - పెరుగు మిశ్రమం పెరుగుకలిపిన వేపాకును తలకు పట్టించటం ద్వారా చుండ్రు సమస్యకు కళ్లెం వేయవచ్చు. ముందుగా వేపాకును పేస్టులా చేసుకుని, ఒక గిన్నె పెరుగులో కలుపుకుని మాడు మొత్తానికి పట్టించి, 15-20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. వేపలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు, పెరుగులోని చల్లదనం చుండ్రును నివారించడమే కాకుండా కుదుళ్లను బలపరచి, మెత్తని సిల్కీ హెయిర్‌ను మీ సొంతం చేస్తుంది. వేప హెయిర్ మాస్క్ డాండ్రఫ్ నివారణ పద్ధతుల్లో వేప హెయిర్ మాస్క్ మరొక సులువైన మార్గం. కొన్ని వేపాకులను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ తేనెను దానికి కలపాలి. దీనిని హెయిర్ మాస్క్‌లా మాడు భాగం మొత్తానికి పట్టించి 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. జుట్టు ఆరిపోయాక ఫలితం మీకే తెలుస్తుంది. హెయిర్ కండీషనర్‌లా వేప వేప ప్రత్యేకత ఏమిటంటే దానిని తలస్నానానికి ముందు లేదా తర్వాత వాడినా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఎలాచేయాలంటే.. కొన్ని వేపాకులను తీసుకుని బాగా మరిగించాలి. తర్వాత చల్లారనివ్వండి. షాంఫుతో తలస్నానం చేశాక, ఈ వేప మిశ్రమంతో తలను కడిగిచూడండి. తేడా మీకే తెలుస్తుంది. వేప షాంపు అన్ని రకాల చుండ్రు సమస్యలకు సులభమైన పరిష్కారం వేపషాంపు. వేపతో తయారు చేసిన షాంపుతో వారానికి రెండూ లేదా మూడు సార్లు తలస్నానం చెస్తే సరిపోతుంది. సాధారణంగా డాండ్రఫ్ నివారణకు వేపతో తయారుచేసిన షాంపులను వాడాల్సిందిగా నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే చుండ్రు నివారణకు అవసరమైన అన్ని సుగుణాలు వీటిల్లో సరిపడినంతగా ఉంటాయి. హెయిర్ ఎక్స్పర్ట్స్ చెప్పేదేమిటంటే.. వేపలోని ఔషధ గుణాలు అన్నిరకాల జుట్టు సంబంధిత సమస్యలను నివారిస్తాయి. మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి. ఈ 6 రకాల సింపుల్ రెమెడీస్ తరచుగా వినియోగించడం ద్వారా ఆరోగ్యమైన, అందమైన జుట్టు మీ సొంతమవుతుందనేది నిపుణుల మాట. చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
గుప్పెడు వేపాకులు
►గుప్పెడు వేపాకులు శుభ్రంగా కడిగి, రెండు లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి వడకట్టి ఒక బాటిల్లో పోసి ఉంచాలి. స్నానం చేసే బకెట్ నీటిలో కప్పు వేపాకుల నీళ్లు కలపాలి. ఈ నీటితో రోజూ స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లు, యాక్నె వంటివి మెల్ల మెల్లగా తగ్గిపోతుంటాయి. ►గుప్పెడు వేపాకులను మెత్తగా నూరి రెండు కప్పుల నీటిలో కలిపి మరిగించాలి. ఒక కప్పు అయ్యేవరకు మరగనిచ్చి, చల్లారనివ్వాలి. ఈ నీళ్లలో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీన్ని వారానికి మూడుసార్లు ముఖానికి పట్టించి, చల్లటి నీళ్లతో కడిగేయాలి. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, యాక్నె నుంచి విముక్తి లభిస్తుంది. పోర్స్‌లో మలినాలు శుభ్రపడతాయి. జిడ్డు చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్. -
హెల్త్ – బ్యూటిప్స్
►మందారపూలను బాగా ఎండబెట్టి వాటిని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. ఆ నూనెను ప్రతిరోజు తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు మందార పువ్వుల్ని నానబెట్టి, మెత్తగా పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించి తల స్నానం చేస్తే జుట్టు పట్టులా మెరిసిపోతుంది. ►మందార ఆకుతో చేసిన టీని తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మందార ఆకు టీ సేవించటం వలన రోగనిరోధక శక్తి పెరిగి తద్వారా జలుబు, దగ్గు తగ్గటానికి సహాయపడుతుంది. మందార ఆకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ►జామ పువ్వులను మెత్తగా నూరి కళ్లపై ఉంచితే కళ్లు తేటగా తయారవుతాయి. కళ్ల కలక, కళ్లు నీరు కారడం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలకు అద్భుత ఫలితం కనిపిస్తుంది. ►ఆయాసం ఉన్నవారు రెండు చిటికెల పసుపు, ఒక చిటికెడు మెత్తటి ఉప్పు రోజూ తీసుకోవడం మంచిది. వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి వేడివేడిగా తాగడం చాలా మంచిది. ►గోధువు పిండిలో తాజా మీగడను కలుపుకుని ఆ మిశ్రవూన్ని వుుఖం, మెడ, చేతులకు పట్టించుకోవాలి. నలుగు పెట్టుకున్నట్టుగా చేతితో మిశ్రవూన్ని తొలగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. దీనిలో గంధం పొడి ఉపయోగిస్తే ఇంకా వుంచి ఫలితం ఉంటుంది. ►వెడల్పాటి పాత్రలో అర లీటరు శుభ్రమైన నీటిని తీసుకుని దానిలో ఒక స్పూను రాళ్ళ ఉప్పును కలుపుకోవాలి. ఆ నీటిలోకి వుుఖంపెట్టి కళ్ళు వుూస్తూ, తెరుస్తూ చేయాలి. దీనివల్ల మీ అలసిన కళ్ళు ఫ్రెష్ అవతాయి. ►వేప ఆకులు నీటిలో వురిగించుకుని ఆ నీటితో వుుఖాన్ని, చేతులను కడుగుతుండటం వల్ల చికెన్‌పాక్స్ వల్ల ఏర్పడ్డ వుచ్చలు తొలగిపోతాయి. బియ్యంపిండిలో మీగడ కలిపి ఆ పేస్ట్‌ని వుుఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువు అయ్యి కాంతులీనుతుంది. -
వేప..రైతుకు చేయూత
అనంతపురం అగ్రికల్చర్ : వృక్ష సంబంధితమైన వాటిలో ప్రధానంగా ‘వేప’ఉత్పత్తుల్లో పంటలకు మేలు చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నందున రైతులు వాటిని విరివిగా వాడాలని వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ ఏడీ సి.రామేశ్వరరెడ్డి తెలిపారు. వేపలో రోగనిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఎన్నో ఉన్నాయనీ, కీటక నాశినిగా కూడా పనిచేస్తుందన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు, ధాన్యం నిల్వలు, శత్రు పురుగులను నివారించి మిత్ర పురుగుల సంరక్షణకు వీటిని వాడుకోవచ్చని తెలిపారు. వేపాకు, వేపపిండి, వేపచెక్క, వేపకషాయం, వేపకాయలు... ఇలా ఎన్నో రూపాల్లో వీటిని పంటలకు వాడుకోవచ్చని తెలిపారు. వేప ఉత్పత్తుల ప్రయోజనాలు + ధాన్యం నిల్వలో ఎండిన వేపాకులు లేదా పొడిని కలిపితే పురుగులు నశిస్తాయి. వేపాకులు కషాయంలో ముంచి ఆరబెట్టి పెట్టినా గోనేసంచులకు పురుగులు పట్టవు. పచ్చిఆకులను ఎరువుగా వాడితే సేంద్రియ పదార్థం పెరుగుతుంది. పంట కాలంలో పురుగుల నివారణకు దోహదం చేస్తుంది. + వేపగింజల్లో చేదు రుచి, వాసన కలిగిన ‘అజాడివిక్టిన్’అనే మూలపదార్థం ఉంటుంది. దీంతో తయారు చేసిన మందులు వాడితే పురుగులు నశిస్తాయి. అలాగే క్రిమికీటకాల్లో గుడ్లు పెట్టే శక్తి తగ్గిపోతుంది. గుడ్లు పెట్టినా లార్వా దశలో రావాల్సిన మార్పులు రాకుండా సంతతి తగ్గిపోతుంది. క్రమేణా పురుగులు నశిస్తాయి. పంటలకు మేలు చేసే సహజ శత్రువులకు ఇబ్బంది ఉండదు. + 10 కిలోల వేపగింజల పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక రోజంతా నానబెట్టాలి. ఈ ద్రావణానికి 2 కిలోలో సబ్బుపొడి వేసి బాగా కలియబెట్టిన తర్వాత వడగట్టాలి. వచ్చిన కషాయాన్ని పంట పొలాల్లో పిచికారి చేస్తే తెల్లదోమ, ఆకుముడుత పురుగులను అదుపులో పెట్టవచ్చు. తొలిదశలో చిన్న గొంగలి పురుగు, కాయతొలచు పురుగును అరికట్టే అవకాశం ఉంది. నూనె తీయగా మిగిలిన పిండిని నీటిలో కలిపి ద్రావణం చేసుకోవచ్చు. 10 కిలోల పిండిని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక వారం రోజులు పాటు నానబెట్టి తరువాత తేటను వేరుచేసి మొక్కలపై పిచికారి చేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. + వేపచెక్కను సేంద్రియ ఎరువుగా వాడవచ్చు. గింజ నుంచి తీసివేసిన వేపపిండిలో 5.2 శాతం నత్రజని, 1.1 శాతం భాస్వరం, 1.5 శాతం పొటాష్ ఉంటుంది. ఇది ఎరువుగానే కాకుండా సస్యరక్షణకు ఉపయోగపడుతుంది. వేపపిండి ఎకరాకు 150–200 కిలోలు వాడాలి. కొన్ని బ్యాక్టీరియ తెగుళ్లను నివారిస్తుంది. నులిపురుగులను అదుపులో పెడుతుంది. + వేపనూనే పంటలలో పిచికారీ చేయడం వల్ల కాయతొలచు పురుగు, రసంపీల్చు పురుగు, ఆకుతినే పురుగులను అదుపు చేయవచ్చు. ఒక లీటర్ వేపనూనెకు 200 లీటర్ల నీరు, 200 గ్రాములు సబ్బుపొడి (సర్ఫ్) కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. -
‘పసుపు’ను కాపాడుకుందాం ఇలా
పసుపులో దుంపలు ఊరే ప్రస్తుత సమయంలో దుంప తొలుచు ఈగ, దుంప కుళ్లు తెగులు ఆశించే అవకాశాలుంటాయి. ఇవి ఆశిస్తే దుంపల్లో నాణ్యతతో పాటు దిగుబడి తగ్గిపోతుంది. ఇవి ఆశించిన తర్వాత నివారణ చర్యలు చేపట్టేదానికన్నా ముందుగానే వేప పిండిని వాడితే ప్రయోజనం ఉంటుంది. ముందస్తు చర్యలు పసుపు మొక్క 40 రోజుల వయసున్నప్పుడు ఒకసారి, 120 రోజులప్పుడు మరొకసారి ఎకరాకు 250-300 క్వింటాళ్ల వేప పిండిని తడిగా ఉన్న నేలపై మొదళ్ల చుట్టూ చల్లాలి. వేప పిండి నేలను అంటుకుంటుంది. తదుపరి ప్రతి నీటి తడిలోనూ వేప ఊట భూమిలోకి దిగుతుంది. ఇది పసుపు పంటకు దుంపకుళ్లు, దుంప పుచ్చు కలుగజేసే క్రిమికీటకాలు మొక్కల దరి చేరకుండా కాపాడుతుంది. ‘ఈగ’ను గమనిస్తే.. దుంపతొలుచు ఈగను పంటలో గమనించినట్లయితే ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను 10 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. దుంపకుళ్లు తెగులు ఆశించినట్లయితే మడిలోని మురుగు నీటిని తీసేయాలి. తెగులు ఆశించిన మొక్కలు దాని చుట్టు పక్కల ఉండే మొక్కల మొదళ్లు బాగా తడిచేట్లుగా లీటర్ నీటికి 3 గ్రా ముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని పోయాలి. వచ్చే సీజన్‌కోసం.. వచ్చే ఏడాది పసుపు పంట వేసుకోవాలనుకునే రైతాం గం దుంపకుళ్లు తెగులు ఆశించకుండా కొన్ని చర్యలు చేపట్టాలి. వేసిన పొలంలోనే పసుపు వేయకుండా వేరుశనగ, మొక్కజొన్న, జొన్న పంటలతో పంట మార్పిడి చేయడం ఉత్తమం. లీటర్ నీటికి 3 గ్రాముల రిడోమిల్ ఎంజెడ్ లేదా మాంకోజెబ్, 2 మిల్లీ లీటర్ల మోనోక్రొటోఫాస్ లీటర్ కలిపిన ద్రా వణంలో తెగులు సోకని విత్తనాన్ని 30 -40 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీరు మార్చి లీటరు నీటికి 5 గ్రా ముల ట్రైకోడర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి, నీడలో ఆరబెట్టాలి. తర్వాత నాటుకోవాలి. కిలో ట్రైకోడర్మాను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండిలో కలిపి వారం పాటు అనువైన పరిస్థితిలో వద్ధి చేసి, నెలరోజులకు మొదటి తవ్వకం చేశాక నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి. దుంపలు విత్తిన తర్వాత జీలుగ, జనుము, వెంపలి, కానుగ మొదలగు పచ్చి ఆకులు లేదా ఎండు వరి గడ్డి, చెరకు ఆకులను పొలంపై దుంపలు మొలకలు వచ్చేంతవరకు కప్పడం వల్ల తెగుళ్ల ఉధతిని కొంతవరకు తగ్గించవచ్చు.