వేప..రైతుకు చేయూత
అనంతపురం అగ్రికల్చర్ : వృక్ష సంబంధితమైన వాటిలో ప్రధానంగా ‘వేప’ఉత్పత్తుల్లో పంటలకు మేలు చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నందున రైతులు వాటిని విరివిగా వాడాలని వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ ఏడీ సి.రామేశ్వరరెడ్డి తెలిపారు. వేపలో రోగనిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఎన్నో ఉన్నాయనీ, కీటక నాశినిగా కూడా పనిచేస్తుందన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు, ధాన్యం నిల్వలు, శత్రు పురుగులను నివారించి మిత్ర పురుగుల సంరక్షణకు వీటిని వాడుకోవచ్చని తెలిపారు. వేపాకు, వేపపిండి, వేపచెక్క, వేపకషాయం, వేపకాయలు... ఇలా ఎన్నో రూపాల్లో వీటిని పంటలకు వాడుకోవచ్చని తెలిపారు.
వేప ఉత్పత్తుల ప్రయోజనాలు
+ ధాన్యం నిల్వలో ఎండిన వేపాకులు లేదా పొడిని కలిపితే పురుగులు నశిస్తాయి. వేపాకులు కషాయంలో ముంచి ఆరబెట్టి పెట్టినా గోనేసంచులకు పురుగులు పట్టవు. పచ్చిఆకులను ఎరువుగా వాడితే సేంద్రియ పదార్థం పెరుగుతుంది. పంట కాలంలో పురుగుల నివారణకు దోహదం చేస్తుంది.
+ వేపగింజల్లో చేదు రుచి, వాసన కలిగిన ‘అజాడివిక్టిన్’అనే మూలపదార్థం ఉంటుంది. దీంతో తయారు చేసిన మందులు వాడితే పురుగులు నశిస్తాయి. అలాగే క్రిమికీటకాల్లో గుడ్లు పెట్టే శక్తి తగ్గిపోతుంది. గుడ్లు పెట్టినా లార్వా దశలో రావాల్సిన మార్పులు రాకుండా సంతతి తగ్గిపోతుంది. క్రమేణా పురుగులు నశిస్తాయి. పంటలకు మేలు చేసే సహజ శత్రువులకు ఇబ్బంది ఉండదు.
+ 10 కిలోల వేపగింజల పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక రోజంతా నానబెట్టాలి. ఈ ద్రావణానికి 2 కిలోలో సబ్బుపొడి వేసి బాగా కలియబెట్టిన తర్వాత వడగట్టాలి. వచ్చిన కషాయాన్ని పంట పొలాల్లో పిచికారి చేస్తే తెల్లదోమ, ఆకుముడుత పురుగులను అదుపులో పెట్టవచ్చు. తొలిదశలో చిన్న గొంగలి పురుగు, కాయతొలచు పురుగును అరికట్టే అవకాశం ఉంది. నూనె తీయగా మిగిలిన పిండిని నీటిలో కలిపి ద్రావణం చేసుకోవచ్చు. 10 కిలోల పిండిని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక వారం రోజులు పాటు నానబెట్టి తరువాత తేటను వేరుచేసి మొక్కలపై పిచికారి చేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.
+ వేపచెక్కను సేంద్రియ ఎరువుగా వాడవచ్చు. గింజ నుంచి తీసివేసిన వేపపిండిలో 5.2 శాతం నత్రజని, 1.1 శాతం భాస్వరం, 1.5 శాతం పొటాష్ ఉంటుంది. ఇది ఎరువుగానే కాకుండా సస్యరక్షణకు ఉపయోగపడుతుంది. వేపపిండి ఎకరాకు 150–200 కిలోలు వాడాలి. కొన్ని బ్యాక్టీరియ తెగుళ్లను నివారిస్తుంది. నులిపురుగులను అదుపులో పెడుతుంది.
+ వేపనూనే పంటలలో పిచికారీ చేయడం వల్ల కాయతొలచు పురుగు, రసంపీల్చు పురుగు, ఆకుతినే పురుగులను అదుపు చేయవచ్చు. ఒక లీటర్ వేపనూనెకు 200 లీటర్ల నీరు, 200 గ్రాములు సబ్బుపొడి (సర్ఫ్) కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి.