World Mosquito Day: ప్రాణి చిన్నది.. ప్రమాదం పెద్దది..! | World Mosquito Day 2022: History, Home Remedies That Work As Mosquito Repellents | Sakshi
Sakshi News home page

World Mosquito Day: ప్రాణి చిన్నది.. ప్రమాదం పెద్దది..!

Published Sat, Aug 20 2022 7:16 PM | Last Updated on Mon, Aug 22 2022 1:45 PM

World Mosquito Day 2022: History, Home Remedies That Work As Mosquito Repellents - Sakshi

సీతంపేట: మలేరియా, డెంగీ, చికున్‌ గున్యా పేర్లు వినని వారు ఉండరు. దోమవల్ల వ్యాపించే ప్రాణాంతకమైన జ్వరాలివి. చిన్నదోమ ఎంత పెద ప్రమాదాన్ని తీసుకువస్తుందో చెప్పడానికి ఈ జ్వరాలే ఉదాహరణ. మనుషుల రక్తాన్ని పీల్చి వ్యాధుల బారిన పడవేసే దోమల బెడద పట్టణాలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. దోమల బారిన పడకుండా  వాటిని తరిమి కొట్టే జాగ్రత్తలు తీసుకుంటేనే అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలమని వైద్యులు సూచిస్తున్నారు.  

దోమల దినం ఎందుకంటే.. 
ప్రపంచానికి కామన్‌ శత్రువుగా మారిన దోమల ఆట కట్టించడానికి సర్‌ రోనాల్డ్‌ రాస్‌ శతాబ్దం క్రితమే రంగంలోకి దిగారు. 1897లో ఆయన దోమల ద్వారానే మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని నిర్ధారించారు. ఈ పరిశోధనకు గానూ ఆయనకు నోబెల్‌ బహుమతి వచ్చింది.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజెనిక్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసన్‌ ఆగస్టు 20వ తేదీని అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించింది.  

అరికట్టేదెలా.. 
దోమ ఎగురుతున్నపుడు పట్టుకోవడం, చంపడం చాలా కష్టం. ఒక్క దోమను పట్టుకోవాలంటే ఎంతో శ్రమించాలి. కాని దోమలు నీటిలో లార్వా, ప్యూపా దశలో పెరుగుతున్నపుడు నాశనం చేయడం సులువు. అవి ఇంటిలో నీటిని నిల్వ చేసే కుండీల్లో చిన్నచిన్న పురుగుల్లా కనిపిస్తుంటాయి. దోమ పిల్లలు (లార్వా) నిల్వ నీటిలో ఉన్నట్లయితే ఆ  నీటిని మట్టి లేదా ఇసుకలో పారబోయాలి. ఇలా చేయడం వల్ల లార్వా, ప్యూపా దశల్లో ఉన్న వాటిని వందల సంఖ్యలో నాశనం చేయవచ్చు. నిలువ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. ఒక దోమ వంద నుంచి 200 వరకు గుడ్లను పెడుతుంది. ఇవన్నీ కేవలం 8 నుంచి 10 రోజుల్లో దోమలుగా మారిపోతాయి. గుడ్డు నుంచి లార్వా, ప్యూపా, అడల్ట్‌ మస్కిటోగా రూపాంతరం చెందుతాయి.  


దోమలదాడికి లక్షల్లో ఖర్చు.. 

దోమలు ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమల దాడిని తట్టుకునేందుకు ప్రతి నెల నిత్యావసర  సామగ్రి మాదిరిగానే లిక్విడ్స్, మస్కిటో రీఫిల్స్, కాయిల్స్, మస్కిటో ధూప్‌స్టిక్స్‌ వంటి వాటికి నెలకు రూ.100 నుంచి రూ.500 వరకు ఒక్కో కుటుంబం ఖర్చు చేస్తోంది. ఇవి కాకుండా దోమల బ్యాట్స్, దోమతెరలు, యాంటీ మస్కిటోమెస్‌ వంటి వాటికోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించక తప్పడం లేదు.   

ఆడదోమలే ప్రమాదకరం.. 
మగ దోమలు చెట్ల రసాలను పీల్చి బతుకుతాయి. ఆడ దోమలు మాత్రం సంతానాభివృద్ధిలో భాగంగా గుడ్లు పెట్టడానికి మనిషి రక్తాన్ని పీల్చుతుంటాయి. ఈ క్రమంలో వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కుట్టిన దోమ ఆ వ్యక్తి రక్తాన్ని పీల్చినపుడు రక్తంతో పాటు వ్యాధి కారకమైన పారాసైట్‌ దోమ లాలాజల గ్రంధుల్లోకి చేరుతుంది. అక్కడ పారాసైట్‌లో కొన్ని మార్పులు జరుగుతాయి. మరో ఆరోగ్యవంతమైన వ్యక్తిని అదే దోమ కుట్టినపుడు దాని లాలాజలంతో పాటు పారసైట్‌ ఆ వ్యక్తి రక్తంలో చేరి వ్యాధులకు కారణమవుతుంది.  


అనార్థాలివే.. 

► ఆడ ఎనాఫిలస్‌ దోమ కుట్టడం వల్ల మలేరియా,డెంగీ, చికెన్‌గున్యా జ్వరాలు, ఈడిస్, క్యూలెక్స్‌ దోమలవల్ల బోదకాలు వస్తాయి.  
► జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కురిసే వర్షాల కారణంగా రోడ్లపైన కొబ్బరిబొండాలు, పాతటైర్లు, రుబ్బురోళ్లలో నిల్వ ఉన్న నీరు వీటి ఆవాస కేంద్రాలు. 
► అవసరాల కోసం నీటిని కుండీలు, ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లో నీటిని నిల్వ చేయడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి.  

నివారణ ఇలా .. 
► వేపనూనె దోమలను తరిమికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వాసన దోమలు భరించలేవు. వేప,కొబ్బరినూనెలను సమాన భాగాలుగా చేసుకుని బయటకు కనిపించే శరీర భాగాలపై రాసుకుంటే దోమలు దరిచేరవు.  

► ఇళ్లలోకి దోమలు ప్రవేశించే కిటికీల వంటి ద్వారాల వద్ద తులసి మొక్కలను పెంచాలి. ఇవి దోమలను దూరం చేస్తాయి. దోమల వృద్ధి లేకుండా చూస్తాయి.  

► లెమన్‌ ఆయిల్, యూకలిప్టస్‌ ఆయిల్‌ మిశ్రమం దోమలను తరిమికొడుతుంది. దోమలను తరిమికొట్టడంలో కర్పూరం మెరుగ్గా పనిచేస్తుంది. ఖాళీ ప్రదేశాలను మూసిన తర్వాత కర్పూరాన్ని వెలిగిస్తే దానినుంచి వచ్చే పొగకు దోమలు మాయమవుతాయి.   

తగ్గిన హైరిస్క్‌ గ్రామాలు 
దోమల నివారణకు మూడేళ్లుగా ప్రభుత్వ చేపట్టిన చర్యల వల్ల మలేరియా,డెంగీ, చికున్‌గున్యాలు దశలవారీగా తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో ఒకప్పుడు మలేరియా పాజిటివ్‌గా 100కు పైగా ఉన్న హైరిస్క్‌ మలేరియా గ్రామాలు ఇప్పుడు 45కు తగ్గుముఖం పట్టాయి. ఈనెల  16నుంచి 31 వరకు మొదటి రౌండ్‌ సింథటిక్‌ ఫైరాత్రిన్‌ జిల్లా వ్యాప్తంగా  పిచికారీ చేశారు. 2 లక్షలకు పైగా దోమతెరలు పంపిణీ చేశారు. అలాగే 4లక్షలు పైగా గంబూషియా చేపలను నీటి కుంటల్లో వేశారు.   


దోమల నివారణకు విస్తృత చర్యలు  

దోమల నివారణకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నాం. దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నాం. గ్రామాల్లో దోమతెరల విని యోగంపై గిరిజనులకు చైత న్యం కలిగిస్తున్నాం.  గ్రామాల్లో ఎక్కడైనా మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలితే వెంటనే మెడికల్‌ క్యాంపులు పెడుతున్నాం. ర్యాపిడ్‌ ఫీవర్, మలేరియా సర్వేలు చేస్తున్నాం. ఒకసారి ఏ గ్రామంలోనైనా జ్వరాలకు సంబంధించి పాజిటివ్‌ వస్తే మళ్లీ అక్కడ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.  
-కె.పైడిరాజు, జిల్లా మలేరియానివారణాధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement