World Mosquito Day
-
World Mosquito Day: ప్రాణి చిన్నది.. ప్రమాదం పెద్దది..!
సీతంపేట: మలేరియా, డెంగీ, చికున్ గున్యా పేర్లు వినని వారు ఉండరు. దోమవల్ల వ్యాపించే ప్రాణాంతకమైన జ్వరాలివి. చిన్నదోమ ఎంత పెద ప్రమాదాన్ని తీసుకువస్తుందో చెప్పడానికి ఈ జ్వరాలే ఉదాహరణ. మనుషుల రక్తాన్ని పీల్చి వ్యాధుల బారిన పడవేసే దోమల బెడద పట్టణాలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. దోమల బారిన పడకుండా వాటిని తరిమి కొట్టే జాగ్రత్తలు తీసుకుంటేనే అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలమని వైద్యులు సూచిస్తున్నారు. దోమల దినం ఎందుకంటే.. ప్రపంచానికి కామన్ శత్రువుగా మారిన దోమల ఆట కట్టించడానికి సర్ రోనాల్డ్ రాస్ శతాబ్దం క్రితమే రంగంలోకి దిగారు. 1897లో ఆయన దోమల ద్వారానే మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని నిర్ధారించారు. ఈ పరిశోధనకు గానూ ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లండన్ స్కూల్ ఆఫ్ హైజెనిక్ అండ్ ట్రాపికల్ మెడిసన్ ఆగస్టు 20వ తేదీని అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించింది. అరికట్టేదెలా.. దోమ ఎగురుతున్నపుడు పట్టుకోవడం, చంపడం చాలా కష్టం. ఒక్క దోమను పట్టుకోవాలంటే ఎంతో శ్రమించాలి. కాని దోమలు నీటిలో లార్వా, ప్యూపా దశలో పెరుగుతున్నపుడు నాశనం చేయడం సులువు. అవి ఇంటిలో నీటిని నిల్వ చేసే కుండీల్లో చిన్నచిన్న పురుగుల్లా కనిపిస్తుంటాయి. దోమ పిల్లలు (లార్వా) నిల్వ నీటిలో ఉన్నట్లయితే ఆ నీటిని మట్టి లేదా ఇసుకలో పారబోయాలి. ఇలా చేయడం వల్ల లార్వా, ప్యూపా దశల్లో ఉన్న వాటిని వందల సంఖ్యలో నాశనం చేయవచ్చు. నిలువ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. ఒక దోమ వంద నుంచి 200 వరకు గుడ్లను పెడుతుంది. ఇవన్నీ కేవలం 8 నుంచి 10 రోజుల్లో దోమలుగా మారిపోతాయి. గుడ్డు నుంచి లార్వా, ప్యూపా, అడల్ట్ మస్కిటోగా రూపాంతరం చెందుతాయి. దోమలదాడికి లక్షల్లో ఖర్చు.. దోమలు ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమల దాడిని తట్టుకునేందుకు ప్రతి నెల నిత్యావసర సామగ్రి మాదిరిగానే లిక్విడ్స్, మస్కిటో రీఫిల్స్, కాయిల్స్, మస్కిటో ధూప్‌స్టిక్స్ వంటి వాటికి నెలకు రూ.100 నుంచి రూ.500 వరకు ఒక్కో కుటుంబం ఖర్చు చేస్తోంది. ఇవి కాకుండా దోమల బ్యాట్స్, దోమతెరలు, యాంటీ మస్కిటోమెస్ వంటి వాటికోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించక తప్పడం లేదు. ఆడదోమలే ప్రమాదకరం.. మగ దోమలు చెట్ల రసాలను పీల్చి బతుకుతాయి. ఆడ దోమలు మాత్రం సంతానాభివృద్ధిలో భాగంగా గుడ్లు పెట్టడానికి మనిషి రక్తాన్ని పీల్చుతుంటాయి. ఈ క్రమంలో వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కుట్టిన దోమ ఆ వ్యక్తి రక్తాన్ని పీల్చినపుడు రక్తంతో పాటు వ్యాధి కారకమైన పారాసైట్ దోమ లాలాజల గ్రంధుల్లోకి చేరుతుంది. అక్కడ పారాసైట్‌లో కొన్ని మార్పులు జరుగుతాయి. మరో ఆరోగ్యవంతమైన వ్యక్తిని అదే దోమ కుట్టినపుడు దాని లాలాజలంతో పాటు పారసైట్ ఆ వ్యక్తి రక్తంలో చేరి వ్యాధులకు కారణమవుతుంది. అనార్థాలివే.. ► ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మలేరియా,డెంగీ, చికెన్‌గున్యా జ్వరాలు, ఈడిస్, క్యూలెక్స్ దోమలవల్ల బోదకాలు వస్తాయి. ► జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాల కారణంగా రోడ్లపైన కొబ్బరిబొండాలు, పాతటైర్లు, రుబ్బురోళ్లలో నిల్వ ఉన్న నీరు వీటి ఆవాస కేంద్రాలు. ► అవసరాల కోసం నీటిని కుండీలు, ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో నీటిని నిల్వ చేయడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. నివారణ ఇలా .. ► వేపనూనె దోమలను తరిమికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వాసన దోమలు భరించలేవు. వేప,కొబ్బరినూనెలను సమాన భాగాలుగా చేసుకుని బయటకు కనిపించే శరీర భాగాలపై రాసుకుంటే దోమలు దరిచేరవు. ► ఇళ్లలోకి దోమలు ప్రవేశించే కిటికీల వంటి ద్వారాల వద్ద తులసి మొక్కలను పెంచాలి. ఇవి దోమలను దూరం చేస్తాయి. దోమల వృద్ధి లేకుండా చూస్తాయి. ► లెమన్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ మిశ్రమం దోమలను తరిమికొడుతుంది. దోమలను తరిమికొట్టడంలో కర్పూరం మెరుగ్గా పనిచేస్తుంది. ఖాళీ ప్రదేశాలను మూసిన తర్వాత కర్పూరాన్ని వెలిగిస్తే దానినుంచి వచ్చే పొగకు దోమలు మాయమవుతాయి. తగ్గిన హైరిస్క్ గ్రామాలు దోమల నివారణకు మూడేళ్లుగా ప్రభుత్వ చేపట్టిన చర్యల వల్ల మలేరియా,డెంగీ, చికున్‌గున్యాలు దశలవారీగా తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో ఒకప్పుడు మలేరియా పాజిటివ్‌గా 100కు పైగా ఉన్న హైరిస్క్ మలేరియా గ్రామాలు ఇప్పుడు 45కు తగ్గుముఖం పట్టాయి. ఈనెల 16నుంచి 31 వరకు మొదటి రౌండ్ సింథటిక్ ఫైరాత్రిన్ జిల్లా వ్యాప్తంగా పిచికారీ చేశారు. 2 లక్షలకు పైగా దోమతెరలు పంపిణీ చేశారు. అలాగే 4లక్షలు పైగా గంబూషియా చేపలను నీటి కుంటల్లో వేశారు. దోమల నివారణకు విస్తృత చర్యలు దోమల నివారణకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నాం. దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నాం. గ్రామాల్లో దోమతెరల విని యోగంపై గిరిజనులకు చైత న్యం కలిగిస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడైనా మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలితే వెంటనే మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. ర్యాపిడ్ ఫీవర్, మలేరియా సర్వేలు చేస్తున్నాం. ఒకసారి ఏ గ్రామంలోనైనా జ్వరాలకు సంబంధించి పాజిటివ్ వస్తే మళ్లీ అక్కడ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. -కె.పైడిరాజు, జిల్లా మలేరియానివారణాధికారి -
ఎవరు కుడితే మంచానికి అతుక్కుపోతారో..
ఓయ్.. బాగున్నారా.. నేనుండగా మీరెలా బాగుంటారు లెండి. నేను మాత్రం హాయిగానే ఉన్నాను. ఈ మధ్య మీరు కాసింత ఇబ్బంది పెడుతున్నా ఓర్చుకుంటూ జబ్బుల్ని అంటించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాను. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ.. ‘ఎవరు కుడితే మలేరియా, డెంగీలు వచ్చి.. మనిషి మంచానికి అతుక్కుపోతాడో.. వాడే దోమ గాడు. నేను’.. బిల్డప్ ఎక్కువైందని అనుకుంటున్నారా.. 123 ఏళ్లుగా మిమ్మల్ని ఓడిస్తూనే ఉన్నాను కదా. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకపోతే ఎలా..? ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ రోజు నా దినం. తద్దినం కాదు. ఎప్పుడో 1897 ఆగస్టు 20 రొనాల్డ్ రాస్ మా ద్వారానే మలేరియా వస్తుందని లోకానికి చెప్పాడు. అందుకే ఏటా ఈ రోజు న మా దినం చేస్తుంటారు. మేము కాటు వేయడం వల్ల మనిషి చనిపోతాడని ఇన్నేళ్లుగా మమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఓడిపోతూనే ఉన్నారు. మా సక్సెస్ సీక్రెట్ చెప్పనా..? నిజానికి మీ బద్దకమే మా జాతికి శ్రీరామరక్ష. మీరు నమ్మండి.. నమ్మకపోండి.. మేము బతికేది మ హా అయితే 15 రోజులు మాత్రమే. ఈ లోగానే వీలైనంత మందికి రోగాలను కానుకగా ఇచ్చి మా జన్మను సార్థకం చేసుకుంటూ ఉంటాం. అందుకు మీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ రెండు వారాలైనా మేము బతకడానికి మీరే కూ డు, గూడు ఇస్తారు. గుడ్డ మాకు అవసరం లేదనుకోండి. మీ ఇళ్లు, మీ వాకిలి, మీ ఇంట్లో మూలలు, మంచం, బీరువా, సోఫా సెట్, అటకలు, పాత సామాన్లు దాచే ఇరుకు సందులు, మీ స్టోర్ రూమ్‌లు, రెస్ట్ రూమ్‌లు, ఆఫీసులు, వాహనాలు, మీ ఇంటి చుట్టూ ఉంటే పిచ్చి మొ క్కలు, మీరు తినేసి బయటకు విసిరేసే వ్యర్థాలు, పాత టైర్లు, నీటి కుళాయిలు, బోర్లు, బావుల చుట్టూ ఉన్న మురికి ప్రాంతాలు.. ఇలా అంతా మా రాజ్యమే. ఇంత చిన్న ప్రాణులమైన మమ్మల్ని ఓడించలేక వందేళ్లుగా మీరు ఆపసోపాలు పడుతున్నారు. ఈ విషయం తలచుకుంటే తెగ నవ్వొస్తుంది. ఇల్లు శుభ్రం చేయకుండా కేవలం నినాదాలు చేస్తే మేం చచ్చిపోతామా చెప్పండి. దోమలపై దండయాత్ర అని పెద్ద పెద్ద మాటలు అంటారు. ప్రభుత్వాల చేత కోట్లు కొద్దీ ఖర్చు చేస్తారు. పాపం సర్కార్లు మాత్రం ఏం చేస్తాయి... మీ ఇల్లు, వాకిలి మీరు శుభ్రంగా ఉంచుకుంటే చాలు కదా.. వర్షాకాలం వస్తే చాలు గ్రామాల్లో హడావుడి చేస్తారు. మేము కాటు వేయకూడదని దోమతెరలే పంపిణీ చేస్తున్నారు. అప్పుడైతే ఒక్క మలేరియా, పైలేరియా, చికున్ గున్యాతోనే సరిపెట్టేవారం. ఇప్పుడు డెంగీ అంటూ కొత్త జబ్బు అంటగడుతున్నాం. అంటే మా అంతం చూడాలనుకుంటున్న మీకు సవాల్‌గా మారుతున్నామన్న మాటే. ఇన్నేళ్లుగా మీ రక్తం తాగుతున్న విశ్వాసంతో.. మీకు కొన్ని సలహాలు ఇస్తాను.. పాటిస్తారా లేదా అన్నది మీ ఇష్టం. ♦మీ ఇళ్లకు గాలి, వెలుతురు బాగా తగిలేలా చూసుకోండి. మీ ఇంట్లో అన్ని మూలల్లోను నీటుగా ఉంచుకోండి. మంచాలు, బీరువాల కింద చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ♦పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, మురికినీటి గుంటలు లేకుండా చూసుకోండి. ♦వారంలో ఒకరోజైనా ఇంటిలోపల అన్ని ప్రాంతాలు, మూలలు పరిశుభ్రం చేసుకోవాలి. మీ టీవీ, కంప్యూటర్, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ వంటివి కొనేటప్పుడు వచ్చే ప్యాకింగ్ డొక్కులు ఇంట్లో ఉంచకండి. ♦వారంలో ఒకటి రెండు రోజులు ఇంట్లో అన్ని గదుల్లోనూ వేపాకులతో పాటు గుగ్గిలం ధూపం వేయండి. ♦మీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. పిచ్చి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించండి. కుళా యిలు, బోర్లు, బావుల వద్ద నీటి నిల్వ లేకుండా చేయడంతో పాటు క్లోరినేషన్ చేయిస్తూ ఉండండి. ♦ఇలా చేస్తే మేం పూర్తిగా అంతరించం గానీ ప్రభావమైతే తగ్గుతుంది. సరే.. ఈ రోజు మా దినం కదా. కొద్దిగా రక్తం తాగేసి ఈ రోజుకు రెస్ట్ తీసుకుంటా.. బై. ప్రేమతో మీ దోమ.. – ఎల్ఎన్ పేట -
మాకు ఇండియా అంటేనే ఎక్కువ ఇష్టం!
హలో హాయ్. నా పేరు దోమ. నేను మనుషుల రక్తాన్ని పీల్చే పిశాచినని అందరూ అనుకుంటారు. నన్ను విలన్‌గా చూస్తూ అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అందుకే రాజమౌళి కూడా తన సినిమాలో ఈగనే హీరో గా చూపించాడు. మీరు నన్ను తిట్టే తిట్లవల్లే ఆ దేవుడు నాకు తక్కువ ఆయుష్షును ప్రసాదించాడేమో. కానీ నేనూ జీవినే. నా వల్ల కలిగే ప్రయోజనాలను పక్కనపెట్టి.. కేవలం నా వల్ల కలిగే జబ్బుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పటికీ నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు. నా వల్ల లాభాలేంటి అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు తెలియాలంటే వీడియోని క్లిక్చేయండి.