ఓయ్..
బాగున్నారా.. నేనుండగా మీరెలా బాగుంటారు లెండి. నేను మాత్రం హాయిగానే ఉన్నాను.
ఈ మధ్య మీరు కాసింత ఇబ్బంది పెడుతున్నా ఓర్చుకుంటూ జబ్బుల్ని అంటించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాను.
ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ..
‘ఎవరు కుడితే మలేరియా, డెంగీలు వచ్చి.. మనిషి మంచానికి అతుక్కుపోతాడో.. వాడే దోమ గాడు. నేను’.. బిల్డప్ ఎక్కువైందని అనుకుంటున్నారా.. 123 ఏళ్లుగా మిమ్మల్ని ఓడిస్తూనే ఉన్నాను కదా. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకపోతే ఎలా..?
ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ రోజు నా దినం. తద్దినం కాదు. ఎప్పుడో 1897 ఆగస్టు 20 రొనాల్డ్ రాస్ మా ద్వారానే మలేరియా వస్తుందని లోకానికి చెప్పాడు. అందుకే ఏటా ఈ రోజు న మా దినం చేస్తుంటారు.
మేము కాటు వేయడం వల్ల మనిషి చనిపోతాడని ఇన్నేళ్లుగా మమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఓడిపోతూనే ఉన్నారు.
మా సక్సెస్ సీక్రెట్ చెప్పనా..?
నిజానికి మీ బద్దకమే మా జాతికి శ్రీరామరక్ష.
మీరు నమ్మండి.. నమ్మకపోండి.. మేము బతికేది మ హా అయితే 15 రోజులు మాత్రమే.
ఈ లోగానే వీలైనంత మందికి రోగాలను కానుకగా ఇచ్చి మా జన్మను సార్థకం చేసుకుంటూ ఉంటాం.
అందుకు మీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ రెండు వారాలైనా మేము బతకడానికి మీరే కూ డు, గూడు ఇస్తారు. గుడ్డ మాకు అవసరం లేదనుకోండి.
మీ ఇళ్లు, మీ వాకిలి, మీ ఇంట్లో మూలలు, మంచం, బీరువా, సోఫా సెట్, అటకలు, పాత సామాన్లు దాచే ఇరుకు సందులు, మీ స్టోర్ రూమ్‌లు, రెస్ట్ రూమ్‌లు, ఆఫీసులు, వాహనాలు, మీ ఇంటి చుట్టూ ఉంటే పిచ్చి మొ క్కలు, మీరు తినేసి బయటకు విసిరేసే వ్యర్థాలు, పాత టైర్లు, నీటి కుళాయిలు, బోర్లు, బావుల చుట్టూ ఉన్న మురికి ప్రాంతాలు.. ఇలా అంతా మా రాజ్యమే.
ఇంత చిన్న ప్రాణులమైన మమ్మల్ని ఓడించలేక వందేళ్లుగా మీరు ఆపసోపాలు పడుతున్నారు.
ఈ విషయం తలచుకుంటే తెగ నవ్వొస్తుంది.
ఇల్లు శుభ్రం చేయకుండా కేవలం నినాదాలు చేస్తే మేం చచ్చిపోతామా చెప్పండి.
దోమలపై దండయాత్ర అని పెద్ద పెద్ద మాటలు అంటారు. ప్రభుత్వాల చేత కోట్లు కొద్దీ ఖర్చు చేస్తారు.
పాపం సర్కార్లు మాత్రం ఏం చేస్తాయి... మీ ఇల్లు, వాకిలి మీరు శుభ్రంగా ఉంచుకుంటే చాలు కదా..
వర్షాకాలం వస్తే చాలు గ్రామాల్లో హడావుడి చేస్తారు.
మేము కాటు వేయకూడదని దోమతెరలే పంపిణీ చేస్తున్నారు. అప్పుడైతే ఒక్క మలేరియా, పైలేరియా, చికున్ గున్యాతోనే సరిపెట్టేవారం. ఇప్పుడు డెంగీ అంటూ కొత్త జబ్బు అంటగడుతున్నాం. అంటే మా అంతం చూడాలనుకుంటున్న మీకు సవాల్‌గా మారుతున్నామన్న మాటే.
ఇన్నేళ్లుగా మీ రక్తం తాగుతున్న విశ్వాసంతో..
మీకు కొన్ని సలహాలు ఇస్తాను.. పాటిస్తారా లేదా అన్నది మీ ఇష్టం.
♦మీ ఇళ్లకు గాలి, వెలుతురు బాగా తగిలేలా చూసుకోండి. మీ ఇంట్లో అన్ని మూలల్లోను నీటుగా ఉంచుకోండి. మంచాలు, బీరువాల కింద చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
♦పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, మురికినీటి గుంటలు లేకుండా చూసుకోండి.
♦వారంలో ఒకరోజైనా ఇంటిలోపల అన్ని ప్రాంతాలు, మూలలు పరిశుభ్రం చేసుకోవాలి. మీ టీవీ, కంప్యూటర్, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ వంటివి కొనేటప్పుడు వచ్చే ప్యాకింగ్ డొక్కులు ఇంట్లో ఉంచకండి.
♦వారంలో ఒకటి రెండు రోజులు ఇంట్లో అన్ని గదుల్లోనూ వేపాకులతో పాటు గుగ్గిలం ధూపం వేయండి.
♦మీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. పిచ్చి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించండి. కుళా యిలు, బోర్లు, బావుల వద్ద నీటి నిల్వ లేకుండా చేయడంతో పాటు క్లోరినేషన్ చేయిస్తూ ఉండండి. ♦ఇలా చేస్తే మేం పూర్తిగా అంతరించం గానీ ప్రభావమైతే తగ్గుతుంది.
సరే.. ఈ రోజు మా దినం కదా. కొద్దిగా రక్తం తాగేసి ఈ రోజుకు రెస్ట్ తీసుకుంటా.. బై. ప్రేమతో మీ దోమ..
– ఎల్‌ఎన్ పేట
Comments
Please login to add a commentAdd a comment