కోడి మామూలైపోయింది.. అప్పుడప్పుడూ నాటు కోడి తింటున్నా జిహ్వ కొత్త రుచులు కోరుతోంది.. ఈ అన్వేషణలో సిక్కోలు ప్రజలకు దొరికిన మేలిరకపు మాంసాహారం కౌజు పిట్ట. పుష్కలమైన పోషక విలువలతో కూడిన వీటి మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. ఊరూరా విక్రయాలు ఊపందుకుంటున్నాయి. వీటి పెంపకం సులభం కావడంతోపాటు లాభసాటిగా ఉండటంతో కొత్త రకం ఉపాధిగా మారింది.
వజ్రపుకొత్తూరు: మాంసాహార ప్రియులు కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. బ్రాయిలర్ చికెన్, నాటు కోళ్ల స్థానంలో కౌజు పిట్టలు చేరుతున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కౌజుపిట్టల మాంసాన్ని లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరగడం, కచ్చితమైన ఆదాయ వనరు కావడంతో పెంపకదారులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ పెంపకం వీటి ప్రత్యేకత కావడంతో నిరుద్యోగ యువతకు చక్కటి స్వయం ఉపాధి మార్గంగా నిలుస్తోంది.
పెంపకం ఖర్చు తక్కువ..
కోళ్లు, బాతుల మాంసం కంటే కౌజుపిట్టల మాంసం, గుడ్లు బలవర్ధకం. వీటి గుడ్లలో ప్రోటీన్లు, ఫాస్పరస్, ఇనుము, ఏ, బి 1, బి 2 విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇతర గుడ్ల కన్నా 2.47 శాతం తక్కువ కొవ్వు ఉంటుంది. అన్ని కాలాల్లో వీటి మాంసం, గుడ్లకు డిమాండ్ ఉంది. ఇక కోళ్ల పెంపకంతో పోలిస్తే వీటి పెంపకం చాలా తేలిక. పెట్టుబడి, కూలీల అవసరం తక్కువ. మేత ఖర్చు కూడా తక్కువే. వీటికుండే అధిక రోగ నిరోధక శక్తి కారణంగా వ్యాపార సరళిలో పెంచినా నష్ట భయం ఉండదు. మధుమేహ బాధితులు కూడా తీసుకోవచ్చు. కౌజులు చిన్న సైజు పక్షులు కనుక తక్కువ ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉంటాయి. సరైన జాతి( బ్రీడ్) ఎంపిక, షెడ్, మేతతో పాటు మార్కెటింగ్ సౌకర్యం పరిశీలించుకుని వీటి పెంపకం చేపట్టవచ్చు.
టీకాలు అవసరం లేదు..
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపినాథపురం, టెక్కలి మండలం చింతలగార, నందిగాం మండలం బోరుభద్ర, పాలకొండ, శ్రీకాకుళం, రణస్థలం, సోంపేట తదితర ప్రాంతాల్లో కౌజు పిట్టల పెంపకాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. ఇతర పక్షులతో పోలిస్తే కౌజులు తొందరగా ఎదుగుతాయి. 3–4 ఏళ్లు బతుకుతాయి. పుట్టిన 5–6 వారాలు తరువాత అమ్ముకోవచ్చు. ఇక వీటి పెంపకానికి టీకాలు అవసరం లేదు. అయితే ఆకస్మిక వాతావరణ మార్పులను తట్టుకోలేవు. అలాంటి సమయంలో వ్యాధులు సోకకుండా నిపుణుల సహాయం తీసుకోవాలి. బ్రాయిలర్ కోళ్లకు వచ్చే వ్యాధులే వీటికీ సోకుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని జిల్లా పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఉప సంచాలకుడు డాక్టర్ మాదిన ప్రసాదరావు తెలిపారు.
జాతి ఎంపిక ప్రధానం..
కోళ్లలో మాదిరిగా కౌజుల్లో కూడా మాంసం, గుడ్లు కోసం వేర్వేరు జాతులు ఉన్నాయి. గుడ్లు కోసం ఫారో, బ్రిటీష్ రెంజ్, ఇంగ్లీష్ నైట్, మంజూరియన్ గోల్డ్ పెంచుతుంటారు. మాంసం కోసం బాబ్‌వైట్(అమెరికన్), వైట్ బ్రెస్టెడ్( ఇండియన్), జపనీస్ క్వయిల్ పెంపకాన్ని చేపడుతున్నారు. మన ప్రాంతంలో ఎక్కువగా జపనీస్ క్వయిల్ పిట్టలను పెంచుతున్నారు.
నెలకు లక్షన్నర దాకా ఆదాయం
రెండేళ్ల క్రితం 3 వేల పిట్టలతో ఫారం ఏర్పాటు చేశా. నెలకు ఏడు వేలు పిల్లలు చొప్పున మూడు బ్యాచ్‌లు విక్రయిస్తున్నా. ఇది కాకుండా నా దగ్గర గుడ్లు పెట్టే కౌజులు నాలుగు వేల వరకు ఉన్నాయి. రోజుకు 1,800 నుంచి 2 వేలు గుడ్లు ఉత్పత్తి అవుతాయి. రోజుకు 50 వేల గుడ్లు పొదిగే యంత్రాన్ని కొనుగోలు చేశా. నెలకు 20 వేల పిల్లలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తా. 15 వేల పిల్లలను ఫారంలోనే పెంచి మాంసం కోసం విక్రయిస్తా. అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.60 వేల నుంచి రూ.1.50 లక్షలు వరకు ఆదాయం సమకూరుతోంది.
– పాచిపెంట మధుసూదనరావు, కౌజు రైతు, చింతలగార
చదవండి: పండు ఈగకు ‘వలపు వల!’
బాబోయ్ భల్లూకం: ఎలుగుబంట్ల హల్‌చల్
Comments
Please login to add a commentAdd a comment