‘నమ్మభూమి’ని నమ్ముకొంది  | Chennai Woman Doing Organic Agriculture | Sakshi
Sakshi News home page

‘నమ్మభూమి’ని నమ్ముకొంది 

Published Sat, Jul 24 2021 7:55 AM | Last Updated on Sat, Jul 24 2021 7:55 AM

Chennai Woman Doing Organic Agriculture - Sakshi

చెన్నైకు చెందిన జయలక్ష్మి, పెళ్లి తర్వాత భర్తతో కలిసి పద్నాలుగేళ్లపాటు కెనడాలో ఉంది. కొన్ని కారణాలతో 1992లో ఇండియా తిరిగి వచ్చింది. తన కూతురుకు ఫుడ్‌ అలెర్జీలు ఎదురవుతుండడంతో, రసాయనాలు వాడకుండా పండించిన కూరగాయలు ఎక్కడ దొరుకుతాయని స్థానిక మార్కెట్లన్నింట్లోనూ వెదికింది. కానీ సేంద్రియ కూరగాయలు ఎక్కడా దొరకలేదు. దీంతో తనే సేంద్రియ పద్ధతిలో కూరగాయల్ని పండించాలనుకుంది. ఆమె కోరిక తెలిసిన జయలక్ష్మి కజిన్‌ తనకున్న పది ఎకరాల పొలంలో ఐదెకరాలను సేంద్రియ వ్యవసాయం చేసుకోమని ఇచ్చింది.

ఐదెకరాల భూమిలో వరి, ఆకుకూరలు, ములక్కాడలు పండించడం ప్రారంభించింది. అయితే  దిగుబడి పెద్దగా వచ్చేది కాదు. మరోపక్క జయలక్ష్మి భర్తకు హార్ట్‌ ఎటాక్‌ రావడం, కోమాలోకి వెళ్లడంతో పలుమార్లు  సర్జరీలు చేశాక కానీ ఆయన కోలుకోలేదు. భర్త వైద్యానికి ఖర్చు, పంట దిగుబడి సరిగా లేక నష్టాలు చవి చూడడం, దానికి తోడు జయలక్ష్మి దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వక పోవడంతో ఆర్థికంగా బాగా చితికిపోయింది. దీంతో సేంద్రియ వ్యవసాయం వదిలేసి కుటుంబంతో తిరిగి కెనడాకు వెళ్లిపోదామనుకుంది. కానీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇండియాలోనే ఉండిపోయింది.  ∙

పెట్టుబడిలేని వ్యవసాయం..
రకరకాల సమస్యలతో కృంగిపోయిన జయలక్ష్మికి 2002లో రామకృష్ణ ఆశ్రమ మిషన్‌ స్కూల్లో పనిచేస్తోన్న డాక్టర్‌ షణ్ముగ సుందరం.. పెట్టుబడి లేని సేంద్రియ వ్యవసాయం ఎలా చేయవచ్చో చెప్పే వర్క్‌షాపును పరిచయం చేసి జీవితం మీద ఆశను చిగురింపచేశారు. షణ్ముగానికి ఉన్న 30 ఎకరాల్లో మూడెకరాల పొలాన్ని ఇచ్చి వ్యవసాయం చేసుకోమనడంతో... జయలక్ష్మి ఆ పొలంలో ఈసారి వరి మాత్రమే పండించడం మొదలుపెట్టింది. దిగుబడి బాగుండడంతో క్రమంగా మరో పది ఎకరాలకు వ్యవసాయాన్ని విస్తరించి... మూలికా మొక్కలు, మెంతికూర, పాలకూర వంటి ఆకు కూరలు, ములక్కాడ, మామిడి, జామ, సపోటా వంటి పండ్ల చెట్లను కూడా పెంచింది. ఇక్కడ వరకు అంతా సాఫీగా సాగినప్పటికీ పండిన పంటను లాభసాటిగా ఎలా విక్రయించాలో తనకి తెలియలేదు.

ఈ సమయంలో.. నగరంలో 300 అపార్టుమెంట్లలో సేంద్రియ కూరగాయలు, ఆర్గానిక్‌ వేస్ట్‌ను కంపోస్టుగా ఎలా తయారు చేయవచ్చో వర్క్‌షాపులు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తోన్న ఆరుల్‌ ప్రియను ఆమెకు షణ్ముగం పరిచయం చేశారు. ఆరుల్‌ జయలక్ష్మిని కలిసి ఆమె కష్టాల గురించి తెలుసుకుని సలహాలు ఇచ్చేది. ఈ క్రమంలోనే వీరిద్ద్దరు కలిసి ‘నమ్మ భూమి’ పేరుతో ఎకో ఫ్రెండ్లి ఉత్పత్తులను విక్రయించేవారు. నమ్మ అంటే తమిళంలో మన అని అర్థం. 2010 నుంచి జయలక్ష్మి పొలంలో పండించిన రసాయనాలు లేని కూరగాయలను ఇంటింటికి తిరిగి అమ్మేది. అలా అమ్ముతూ ఏడేళ్లలో పట్టణంలోని కస్టమర్లకు తన కూరగాయలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. అలా గత కొన్నేళ్లుగా సేంద్రియ కూరగాయలను దేశంలోని ఇతర ప్రాంతాలు, ఉత్తరాఖండ్, కశ్మీర్‌ ప్రాంతాలకు పంపిస్తున్నారు. వ్యవసాయంలో కొత్తకొత్త పద్ధతులను అనుసరిస్తూ లాభాలు పొందుతున్నారు. ఒక పక్క కస్టమర్లకు అవగాహన కల్పిస్తూ సేంద్రియ వ్యవసాయం చేయమని ఇతర రైతులను ప్రోత్సహిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement