
సేంద్రియంపై సెమినార్
► అన్నా యూనివర్సిటీలో జాతీయస్థాయి సెమినార్
► 9,10,11 తేదీల్లో చెన్నైలో నిర్వహణ
► వేలాది మంది రైతులతో చర్చాగోష్టి, శిక్షణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: విషతుల్యమైన రసాయనాల వాడకం ద్వారా స్వల్ప వ్యవధిలో అధిక దిగుబడుల మోజులో కొట్టుకుపోతున్న అన్నదాతల్లో వస్తున్న అనూహ్యమైన మార్పు దేశాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపిస్తోంది. ధైర్యంగా పట్టెడన్నం కూడా తినలేని ప్రజలకు సేంద్రియ వ్యవసాయం భరోసా కల్పిస్తోంది. రోజురోజుకూ కలుషితమై కాలకూట విషంగా మారిపోతున్న సాగుభూములకు సేంద్రియ విధానం రక్షణ కల్పిస్తూ భూమాతను కాపాడుతోంది. దేశంలో విస్తరిస్తున్న సేంద్రియ సంప్రదాయానికి, విత్తన సంపదకు చెన్నై అన్నాయూనివర్సిటీలో జరగనున్న జాతీయ సెమినార్ అద్దం పట్టబోతోంది.
తాగే నీరు కాలుష్యం, పీల్చేగాలి కాలుష్యం, తినే ఆహారం కాలుష్యం..ఇలా అనేక కోణాల్లో కాలుష్యపు కాటుకు మానవుడు బలైపోతున్నాడు. కొన్ని కాలుష్యాలను గత్యంతరం లేక భరిస్తున్నాడు. అయితే ఆహార కాలుష్యానికి మాత్రం సేంద్రియ ఉత్పత్తుల ద్వారా పరిష్కారం దొరుకుతుందని ‘సేఫ్ ఫుడ్ అలయన్స్’ కో ఆర్డినేటర్ అనంతశయనన్ స్పష్టం చేశారు. ఈనెల 9, 10, 11 తేదీల్లో మూడు రోజులపాటు చెన్నై అన్నాయూనివర్సిటీలో ‘నేషనల్ సీడ్స్ డైవర్సిటీ ఫెస్టివల్–4’ నిర్వహిస్తున్నారు. ‘భారత్ బీజ్ స్వరాజ్ మంచ్’, ‘అలయన్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్’ (ఆషా) సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సెమినార్ జరుగుతుంది.
సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వేలాది మంది రైతులు దేశం నలుమూల నుంచి ఈ సెమినార్‌కు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ దేశంలోని రైతుల్లో ఎంతో మార్పు వచ్చిందని, పెద్ద సంఖ్యలో సేంద్రియ వ్యవసాయం పట్ల ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఢిల్లీ, చండీగడ్, హైదరాబాద్‌లలో మూడు సెమినార్లు నిర్వహించగా, చెన్నైలో జరగనున్న నాల్గవ సెమినార్‌కు గతంలో కంటే పెద్ద సంఖ్యలో రైతులు ఉత్సాహం చూపుతున్నట్లు చెప్పారు. సేంద్రియ వ్యవసాయం మాత్రమే కాదు సేంద్రియ విత్తనాలను విస్తృత వాడకంలోకి తేవడమే తమ సెమినార్ల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. చెన్నై సెమినార్‌లో సైతం వందలాది రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు.
ప్రతిరైతు తన పరిధిలో ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల సేంద్రియ ఉత్పత్తులు, విత్తనాలను చెన్నై సెమినార్‌లో ప్రదర్శించి ఒకరి అనుభవాలను ఒకరు పంచుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని, టెర్రకోట ఉత్పత్తులను ప్రతినిధుల చేత స్వయంగా తయారుచేయిస్తామని. అలాగే రైతులకు శిక్షణ తరగతులను నిర్వహించడంతోపాటు రైతులే తమ అనుభవాలను పరస్పరం పంచుకుంటారని చెప్పారు. వివిధ రకాల పంటల విత్తనాలతోపాటు వైద్యపరమైన విత్తనాలను సైతం ప్రదర్శించనున్నారు. అలాగే ప్రజలకు టెర్రస్‌గార్డెన్‌పై అవగాహన శిక్షణ ఇవ్వనున్నారు. సేంద్రియ పానీయాలు, బియ్యం, సంప్రదాయ పత్తితో చేతితో నేసిన వస్రాల అమ్మకం ఇలా ఎన్నో ఆకర్షణలకు సెమినార్ వేదిక కానుందని అన్నారు. సేంద్రియం అంటే ఇంకా తెలియని వారిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. బెంగళూరులో సహజ సమృధ పేరుతో సేంద్రియ ప్రాధాన్యతను ప్రచారం చేసే కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నెట్ వర్క్ ఆఫ్ సీడ్స్ సేవర్స్ ఇన్ ఇండియాకు వ్యవస్థాపకులని, నాలుగేళ్ల కిత్రం ప్రారంభమైన ఈ నెట్ వర్క్ కిందనే సెమినార్లు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ నెట్ వర్క్ కింద వందలాది మంది రైతులు సభ్యులుగా ఉన్నట్లు చెప్పారు. తొలిరోజుల్లో రైతుల కోసం మాత్రమే పనిచేయగా ప్రస్తుతం అర్బన్‌పై కూడా దృష్టిపెట్టి పట్టణవాసుల్లో సేంద్రియపద్ధతుల్లో టెర్రస్‌గార్డెన్, టెర్రస్ సీడ్స్‌ను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. సేంద్రియ సాగుపై విదేశీయులు సైతం ఎంతో ఆసక్తి చూపడమేకాదు, ఆచరిస్తున్నారని తెలిపారు. సేంద్రియ వల్ల మనిషి ఆరోగ్యాన్నే కాదు, భూమాతను కాలుష్యం కోరల నుంచి రక్షించినట్లేనని అన్నారు. ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతతో సెమినార్ సాగుతుందని, సేంద్రియ ప్రియులందరికీ ఆహ్వానం పలుకుతున్నామని ఆయన చెప్పారు.