
నల్లగొండ రూరల్ : ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయం మీద మక్కువ పెంచుకున్నాడు ఓ యువరైతు. ఉన్న ఆరెకరాల భూమిలో రెండెకరాలు పందిరి విధానంలో తీగజాతి కూరగాయల సాగు చేపడుతూ రోజుకు రూ. వెయ్యి నుంచి రూ. 1500 వరకు ఆదాయం పొందుతున్నాడు. నల్లగొండ మండలంలోని దండెంపల్లి గ్రామానికి చెందిన బిట్ల నర్సిరెడ్డి ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశాడు. రెండేళ్ల పాటు ప్రైవేట్‌గా విద్యాబోధన చేస్తూ ఉద్యోగ ప్రయత్నం చేశాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, ప్రైవేట్ రంగంలోనూ సరైన జీతాలు రాకపోవడంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. పందిరి విధానంలో రెండెకరాల్లో కూరగాయల సాగు చేపట్టాడు. మొత్తం తీగజాతికి చెందిన బీర, కాకర, సొరకాయ, ఖీరా, పొట్లకాయ వంటి కూరగాయల సాగును చేపట్టి 360 రోజులూ దిగుబడి వచ్చేలా ప్లాన్ చేశాడు. పందిరి విధానంలో సాగు చేపట్టడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందుతున్నాడు. పందిరి కింద భోజలు (కట్టలు) పోసి ఒక భోజను ఖాళీగా ఉంచి మరో భోజలో విత్తనాలు నాటాడు. దిగుబడి పూర్తి కావచ్చే నెల రోజుల్లో ఖాళీగా ఉన్న భోజలో మరో రకం కూరగాయల సాగు చేపడతాడు. ఫలితంగా ఏడాది పొడవునా కూరగాయల దిగుబడి లభిస్తుంది. రోజూ కూరగాయలను నల్లగొండ మార్కెట్‌లో విక్రయిస్తుంటాడు.
ప్రయోజనకరంగా ఉంది
ఏడాదికి రెండెకరాల పందిరి కూరగాయల సాగు ద్వారా రూ. 5లక్షల ఆదాయం వస్తోంది. ఉద్యోగం రాకపోయినా వారికి వచ్చే జీతంతో సమానంగా సంపాదిస్తున్నా. భోజలు ఖాళీగా ఉంచి సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేపడుతున్నా. ఉద్యాన శాఖ ఇచ్చే ప్రోత్సాహం, వారి సూచనలు సద్వినియోగం చేసుకుంటున్నా. కూరగాయల సాగు చిన్న రైతులకు ప్రయోజనకరంగా ఉంది. – నర్సిరెడ్డి, దండెంపల్లి
Comments
Please login to add a commentAdd a comment