కుబేరునికైనా.. బికారికైనా కడుపు నింపేది పట్టెడన్నమే.. ఈ బువ్వను సృష్టించేది రైతే.. మట్టితో సహవాసం చేస్తూ చెమటే ఇంధనంగా పోరాడే అన్నదాత లేకుంటే ఈ లోకం ఏమైపోతుందో.. ఈ విలువ చిన్నారి వనితకు 6వ తరగతిలోనే తెలిసింది అప్పటి నుంచి వ్యవసాయమే ప్రాణంగా భావిస్తోంది... బాలల దినోత్సవం సందర్భంగా ఈ పాప జీవనశైలి మిగతా బుడతలకు ఆదర్శంగా మారాలని ఆశిద్దాం..
సాక్షి, ఒంగోలు: నాగార్జున సాగర్‌కు సమీపంలో ఉంటుంది గేన్యా నాయక్ తండా.. అక్కడే వడిత్య వనిత తల్లిదండ్రులు రెండకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఎప్పట్లాగానే వ్యవసాయంలో నష్టాలు వచ్చాయి. ఇక లాభం లేదనుకొని ముగ్గురు పిల్లలతో ఒంగోలు వలస వచ్చారు. బిడ్డలను బాగా చదివించాలనుకున్నారు. వీరిలో మధ్య సంతానంగా వనిత జన్మించింది. మంగమూరు రోడ్డులో ఉన్న శ్రీ షిరిడీ సాయి హైస్కూలులో వనిత మూడో తరగతిలో చేరింది. అలా ఆరో తరగతికి రాగానే అక్కడ పనిచేస్తున్న డ్రాయింగ్ మాస్టారు ఎన్. మాల్యాద్రి స్ఫూర్తి ఆమెపై పడింది. దీనికి కారణం ఆయన సేంద్రియ వ్యవసాయం చేయడమే. క్షేత్ర పర్యటనల్లో భాగంగా పిల్లలతో పాటు ఆయనకు ఒంగోలు సమీపంలో ఉన్న కొనగానివారిపాలెం వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లేవారు. ఇది నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. స్వతహాగా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనితకు ఆ పరిసరాలు ఎంతగానో నచ్చాయి. ( చదవండి: ‘దేశీ’ ఉత్పత్తులే దివ్యౌషధాలు! )
భవితపై ఆలోచన..
ఆ క్షేత్రంలో శ్రీగంధం, టేకు చెట్లు ఉంటాయి. ఇక అంతర సేద్యంగా జామ, దానిమ్మ, బత్తాయి వంటి పండ్లతో పాటు వరి కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేయడానికి మాల్యాద్రి విశేషంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ కేవలం కషాయాలతోనే వైరస్‌లను కట్టడి చేస్తారు. ఇక బలం కోసం దిబ్బ ఎరువు వాడతారు. ఇలాంటి విషయాలే వనితను విస్తృతంగా ప్రభావితం చేశాయి. తల్లిదండ్రులు లెక్కకు మించి.. శక్తికి మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి చేతులు కాల్చుకున్న వైనాన్ని చూసిన అనితకు సేంద్రియ వ్యవసాయం ఎంతో మంచిదని అర్థం అయింది. అందుకే అప్పటి నుంచి వ్యవసాయంలో అన్ని పద్ధతులు తెలుసుకోవాలని నిర్ణయించుకుంది.
4 అన్ని పనులు నేర్చుకుంటూ..
ప్రస్తుతం తొమ్మిదో తరగతికి వచ్చిన వనిత వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులనూ తన గురువు సహాయంతో నేర్చుకోగలిగింది. చేలో కట్టలు కట్టడం, పాదులు, కలుపు తీయడం, వివిధ రకాల గారర్డెనింగ్‌లో మెళకువలు తెలుసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఈ పాప తల్లిదండ్రులు తమ స్వగ్రామం అయిన గేన్యా నాయక్ తండాకు వెళ్లారు. దీంతో అనిత.. తమ గురువుగారి ఇంట్లోనే కుటుంబ సభ్యురాలిగా ఉంటోంది. ఇలా ఆరు నెలలుగా ఆ పాపను మాస్టారు కుటుంబం ప్రేమతో చేరదీస్తోంది. అక్కడే ఉంటూ వ్యవసాయంలో ఇంకా లోటు పాట్లను తెలుసుకునేందుకు ఈమె ప్రయత్నిస్తోంది.
‘వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు పడిన కష్టాల గురించి విన్నాను. వారు ఆ బాధలు భరించ లేక ఒంగోలు వచ్చారు. మానాన్న ఆటో తోలుతూ ఉంటాడు. అమ్మ ఓ అపార్టుమెంటులో వాచ్‌ఉమెన్‌గా పని చేస్తోంది. అన్న మా ఊర్లో హాస్టళ్లో చదువుతుండగా.. తమ్ముడు మా స్కూల్లోనే ఏడో తరగతి చదువుతున్నాడు. సేంద్రియ వ్యవసాయమే చాలా మంచిది. రసాయన ఎరువులు వాడటం వల్ల అందరికీ రోగాలు వస్తున్నాయి. ఇలాంటి ఉత్పత్తులు వాడకూడు. నేను పెద్దయ్యాక అగ్రికల్చర్ బీఎస్సీ చదవాలని ఉంది. అంతా ప్రకృతి పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి. అప్పుడే మంచి దేశం ఉత్పత్తి అవుతుంది. సేంద్రియ ఉత్పత్తులు పండించి దేశానికి అన్నం అందించాలన్నదే నాకల’ అని ఎంతో నమ్మకంతో చెప్పిందీ పాప.
అడిగిన వారికి సేంద్రియ ఉత్పత్తులు
మాల్యాద్రి మాస్టారికి లాయర్ పేటలో ఫ్రీడమ్ బర్డ్స్ అనే ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఇందులోని సభ్యులకు, తమ స్కూల్‌కి చెందిన తల్లిదండ్రులకు తమ వ్యవసాయ క్షేత్రంలోని ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. ముఖ్యంగా జామ, నిమ్మ, ఆకుకూరలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది రెండెకరాల్లో వరి కూడా సాగు చేశారు. ‘వనితకు వ్యవసాయం పట్ల చాలా ఇష్టం ఉంది. నేను చేయగలిగిన అన్ని పనులూ నేర్చుకుంది. పాప తల్లిదండ్రులు కూడా ఆమె ఇష్టాన్ని గుర్తించారు. చిన్నతనంలోనే రైతులను బతికించాలని.. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతం చేయాలనే ఆలోచనలతో అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలని కలలు కనడం నిజంగా అభినందనీయం. ఆమె భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు చేరుకోవాని ఆశిస్తున్నా’ అని ఆమె గురువు నాయుడు మాల్యాద్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment