సాక్షి, అమరావతి: వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఈ రంగాల్లో మంచి వృద్ధిరేటు నమోదవుతోందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ సాధిస్తోన్న పురోగతి అభినందనీయమన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో మూడురోజులు నిర్వహిస్తున్న 4వ ఆర్గానిక్‌మేళాను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన రైతుల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతులు కష్టపడినంతగా దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ చూడలేదన్నారు.
కరోనా గడ్డు పరిస్థితుల్లోనూ దేశం 4.5 శాతం వృద్ధిరేటు సాధించడానికి ఆంధ్రప్రదేశ్‌లో సాధిస్తున్న పురోగతే కారణమని చెప్పారు. విదేశీమారక ద్రవ్యలోటును తీర్చగలిగే శక్తి దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉందన్నారు. ప్రపంచ మార్కెట్‌లో ఎగుమతి అవకాశాలున్న పంటలన్నీ ఇక్కడ పండుతున్నాయన్నారు. బియ్యం, పత్తి, పసుపు, పప్పుధాన్యాలు, అల్లం, పొగాకు ఇలా ఇక్కడ పండేవన్నీ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. అరుకు కాఫీకి ఎగుమతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఎగుమతి చేయని స్థాయిలో ఏటా రూ.15 వేల కోట్ల విలువైన రొయ్యలు అమెరికా తదితర దేశాలకు ఎగుమతవు తున్నాయన్నారు. డెయిరీ ఉత్పత్తుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. మన భీమవరం నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలను అదే ప్యాకింగ్‌తో అమెరికా వాల్‌మార్ట్‌లో విక్రయిస్తున్నారని తెలిపారు. అదేరీతిలో మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులు కూడా విదేశాల్లో మన బ్రాండింగ్‌తో అమ్మే స్థాయికి ఎదగాలన్నారు.
సేంద్రియ సాగును ప్రోత్సహించాలి
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుని మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలవాలన కోరారు. జిల్లాల వారీగా లభించే ఉత్పత్తులు (డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ప్రొడక్టస్)ను గుర్తించి అవి ఇతరదేశాలకు ఎగుమతి అయ్యేలా జిల్లాల మధ్య పోటీవాతావరణం తీసుకురావాలని చెప్పారు. డిమాండ్ ఉన్న దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అప్పుడే ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో కొనసాగడమే కాదు.. ప్రపంచపటంలో నిలబడుతుందని చెప్పారు.
సేంద్రియ సాగులో కూడా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. సేంద్రియ సాగును లాభసాటి చేయాలన్నారు. విదేశీమారక ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు పామాయిల్ సీడ్ మిషన్‌ను ప్రారంభిస్తున్న కేంద్రం పెట్రోల్ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకునేందుకు మొక్కజొన్న తదితర ఆహార ఉత్పత్తుల నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా ప్రధానమంత్రి నరేంద్రమోది కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు.
సేంద్రియ రైతులు, పాత్రికేయులకు సత్కారం
ఈ సందర్భంగా సేంద్రియ రైతులు తిప్పేస్వామి (అనంతపురం జిల్లా), రమణారెడ్డి (వైఎస్సార్), గంగాధరం (చిత్తూరు), పాపారావు (గుంటూరు), మలినేని నారాయణప్రసాద్ (కృష్ణా), ఝాన్సీ (పశ్చిమగోదావరి జిల్లా), తాతారావు, లక్ష్మీనాయక్ (జెడ్పీఎన్‌ఎఫ్), రాజ్‌కృష్ణారెడ్డి (ఉద్యానశాఖ ఏడీ), ధర్మజ (ఉద్యానశాఖ డీడీ), రామాంజనేయులు, సురేంద్ర (ఎన్‌జీవోలు), సీనియర్ పాత్రికేయులు ఆకుల అమరయ్య, మల్లిఖార్జున్, సుబ్బారావు, శ్రీనివాసమోహన్‌లను సత్కరించారు. ఉద్యానశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.ఎస్.శ్రీధర్, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవిచౌదరి, రైతుసాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి.విజయకుమార్, ఆర్గానిక్‌మేళా నిర్వహణాధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు జలగం కుమారస్వామి, గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు బి.రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment