అలసంద పంటను పరిశీలిస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, కలెక్టర్ గౌతమి
కళ్యాణదుర్గం: రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. గురువారం కళ్యాణదుర్గం మండల పరిధిలోని మల్లాపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న పంట పొలాలను కలెక్టర్ గౌతమి, ఏటీఎం మోడల్ రూపకర్త, ఏపీసీఎన్‌ఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాలను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రైతే రాజు అన్న నినాదాన్ని ప్రకృతి వ్యవసాయం నిజం చేస్తుందన్నారు. కలెక్టర్ ఎం. గౌతమి మాట్లాడుతూ పొలాల్లోకి దిగిన ప్రతిసారీ ఆదాయం పొందే విధంగా ‘ఏటీఎం మోడల్’ను అవలంబించాలని ఆకాంక్షించారు. ఈ విధానం రైతులకు లాభసాటిగా ఉండటంతో పాటు నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించేందుకు దోహదపడుతుందన్నారు.
అతి తక్కువ పెట్టుబడితో, తక్కువ విస్తీర్ణంలో, రసాయనాలు అవసరం లేకుండా వివిధ రకాల పంటలు ఏకకాలంలో పండిస్తూ సొమ్ము చేసుకుంటున్న రైతులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏటీఎం మోడల్‌పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఏపీసీఎన్‌ఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ సూచించారు.
అనంతరం పలువురు రైతులు సాగు చేసిన చిరుధాన్యాల పంటలను వారు పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నిశాంత్‌రెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment