
జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.
అనంతపురం నుంచి
బెంగళూరుకు రైలు
● కొత్తగా ఏడు స్టేషన్లలో స్టాపింగ్
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు వరకు నడిచే మెమూ రైలును అనంతపురం వరకు పొడిగించారు. దీంతో పాటు అనంతపురం నుంచే బెంగళూరుకు బయలుదేరేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు నడపాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను ఎప్పటి నుంచో ఈ ప్రాంతవాసులు కోరుతూ వచ్చారు. వారి విజ్ఞప్తిని అధికారులు ఎట్టకేలకు మన్నించారు. త్వరలోనే రైలు అనంతపురం నుంచి బయలుదేరేలా ప్రణాళిక రచించారు. ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు మధ్య ఇప్పటి వరకు ఉన్న స్టాపింగులతో పాటు అదనంగా ప్రసన్నాయపల్లి, జంగాలపల్లి, చిగిచెర్ల, బాసంపల్లె, కొత్తచెరువు, విదురాశ్వర్థం, సోమేశ్వరలో స్టాపింగ్ సదుపాయం కల్పించారు. సామాన్య ప్రయాణికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు రైలు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. అతి త్వరలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి చేతుల మీదుగా అనంతపురం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ మాసినేని అశోక్ కుమార్ వేర్వేరుగా తెలిపారు. అనంతపురంలో మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటలకు బెంగళూరు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు.