
నగరపు రొదకు దూరంగా.. అచ్చమైన పల్లె పొలాల్లో..
నిండు మనసున్న కొందరు పట్నవాసులు ప్రకృతి మాతకు ప్రణమిల్లుతూ
ఆకు పచ్చని విల్లాలై కొలువు దీరితే?
అది పల్లె తనాన్ని గుండె నిండా నింపుకున్న ‘రూర్బన్ కమ్యూనిటీ’ అవుతుంది!
అటువంటి అపురూపమైన సామూహిక వ్యవసాయ జీవన సముదాయమే ‘ఆర్గానో నాంది’! సేంద్రియ రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ‘పల్లె విల్లా’ ఊసులు విందాం రండి..
ప్రకృతితో మమేకమై స్వయం పోషకంగా కాలుష్య రహితమైన విధంగా కలిసి జీవించడం.. సహజ వనరులను పరిమితంగా వినియోగించుకోవడం.. ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆహారాన్ని తమకు తాము పండించుకొని తినటం.. పనిలో పనిగా పరిసర గ్రామాల్లో రైతులు, ప్రజల అభ్యున్నతికి కూడా చేతనైనంత దోహదపడటం – ఈ ఉదాత్త లక్ష్యాలతో ముగ్గురు వ్యక్తులు ఐదేళ్ల క్రితం వేసిన తొలి అడుగే ‘ఆర్గానో నాంది’ అనే గేటెడ్ కమ్యూనిటీని అపురూపంగా కొలువుదీర్చింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి పరిసరాల్లో 37.5 ఎకరాల్లో ఈ పల్లెపట్నం జీవన సముదాయం (రూర్బన్ కమ్యూనిటీ) ఏర్పాటైంది.
ఆర్కిటెక్చర్ నిపుణులైన నగేష్ బత్తుల, విజయదుర్గ అడిగోపుల, రాజేంద్ర కుమార్ గూరకంటి – ఈ ముగ్గురి మదిలో మెదిలిన ఆలోచనే ‘ఆర్గానో’ కంపెనీ తొలి వెంచర్ ‘నాంది’గా రూపుదాల్చింది.
ఈ సామూహిక వ్యవసాయ జీవన సముదాయంలో 73 ఫామ్ యూనిట్లు ఉన్నాయి. యూనిట్ యజమానికి అరెకరం భూమిపై అవిభాజిత హక్కు ఉంటుంది. యూనిట్‌కు ఒకటి చొప్పున 5 సెంట్లలో 1300 చదరపు అడుగుల 3 బెడ్రూం విల్లాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికి 50 మంది విల్లాలు నిర్మించుకున్నారు. 20 కుటుంబాలు పూర్తిగా అక్కడ నివసిస్తున్నాయి. భావసారూప్యత కలిగిన వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఒక చోట కూడటం విశేషం.
వాననీటిని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టుకొని పొదుపుగా వాడుకోవటం, సుమారు 20 ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకొని తింటున్నారు. 35 గిర్ ఆవులు, మరికొన్ని లోకల్ ఆవులు ఉన్నాయి. ఇక్కడి గోశాలలో ఫామ్ యూనిట్‌కు ఒక ఆవు చొప్పున ఉంటుంది. ఆవరణలో ప్రతి ఇంటికీ రోజుకు ఒక లీటరు చొప్పున స్వచ్ఛమైన తాజా ఆవు పాలు అందిస్తారు. విల్లాలకు చుట్టూతా పంట పొలాలు, అటవీ / కలప జాతుల చెట్ల జీవవైవిధ్యం పరచుకొని ఉంటుంది.
జలచైతన్యం..
ఆర్గానో నాంది రూర్బన్ గేటెడ్ కమ్యూనిటీ డిజైన్‌లోనే జలచైతన్యం ఉట్టిపడుతుంది. ‘ఊర్ధ్వం’ సంస్థ సాంకేతిక నైపుణ్యంతో వాన నీటి సంరక్షణ నిర్మాణాలు నిర్మించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడానికి 6 రీచార్జ్ వెల్స్ నిర్మించారు. అవసరం మేరకు నీటిని తోడేందుకు 9 బోర్లు వేశారు. వర్షపు నీటిని నూటికి నూరు శాతం ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేస్తున్నారు. ఇందుకోసం పర్మాకల్చర్ పద్ధతుల్లో డిజైన్ చేశారు. వర్షపు నీటిని భూముల్లో ఎక్కడికక్కడే ఇంకింపజేసేలా శాస్త్రీయ పద్ధతుల్లో కాంటూరు కందకాలు, స్వేల్స్, 4 చెరువులు నిర్మించారు. వరద నీటిని సైతం ఆవరణ నుంచి బయటకుపోకుండా భూమిలోకి ఇంకింపజేసేలా శ్రద్ధ తీసుకుంటున్నారు.
బోరు నీటిని తోడి శుద్ధి చేసిన తర్వాత ఇళ్లకు సరఫరా చేస్తారు. ఇళ్ల నుంచి వెలువడే మురుగునీటిని డి.ఆర్.డి.ఓ. ధృవీకరించిన సాంకేతికతతో కూడిన బయోరియాక్టర్ ద్వారా శుద్ధి చేసి పంటలకు డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. నీటి లభ్యత ఉన్నంత మేరకే పంటలు పండిస్తామన్నారు ఆర్గానో నాంది మేనేజింగ్ డైరెక్టర్ నగేష్ బత్తుల. అతిగా భూగర్భ జలాలను తోడెయ్యకుండా జాగ్రత్తపడుతున్నామని, అందువల్లనే ఈ ఐదేళ్లలో తమ ఆవరణలో భూగర్భ జలమట్టం పెరిగిందన్నారు. తమ ఆవరణలో ఏటా 11 కోట్ల లీటర్ల వాన నీరు కురుస్తుందని, అయితే, ఈ ఏడాది 30% తక్కువ వర్షం పడిందన్నారు. ఎంత నీరు ఇంకింపజేస్తున్నాం, ఎంత నీరు వినియోగిస్తున్నాం అన్న విషయంలో ప్రతి నీటి చుక్కనూ లెక్కలోకి తీసుకుంటుండటం విశేషం.
కూరగాయలు, పండ్లు..
ఆర్గానో నాంది ఆవరణలో తమకు అవసరమైన ఆహార పంటలను మాత్రమే పండిస్తారు. చిక్కుడు, టమాటొ, క్యాబేజి, కాలీఫ్లవర్, బీన్స్, ముల్లంగి, వంగ, బెండ, బీర, పొట్ల కాయలు, 7 రకాల ఆకుకూరలు.. జామ, మామిడి, బొప్పాయి, దానిమ్మ, సపోట, సీతాఫలం, నేరేడు పండ్ల చెట్లు పెంచుతున్నారు. 20 రకాల ఔషధ మొక్కలతోపాటు టేకు, ఎర్రచందనం, చందనం, సిల్వర్ ఓక్, అడవి మద్ది, వేప వంటి దీర్ఘకాలపు కలప చెట్లను సైతం పెంచుతున్నారు. జీవామృతం, వర్మీ కంపోస్టు, కునపజలం, పంచగవ్య, దశపర్ణి కషాయం, వేప కషాయం, అల్లం వెల్లుల్లి కషాయం, ఎన్.ఐ.పి.హెచ్.ఎం. నుంచి తెచ్చిన 16 రకాల జీవన ఎరువులు, శిలీంధ్రనాశనులను వాడుతున్నారు. శాస్త్రవేత్త డా. జి. శ్యాంసుందర్‌రెడ్డి(99082 24649) సేంద్రియ వ్యవసాయ సలహాదారుగా ఉన్నారు.
పరిసర గ్రామాల రైతులకు సేంద్రియ శిక్షణ
మొయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లి, బాకారం, అజీజ్‌నగర్ తదితర గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులకు ఆర్గానో నాంది యాజమాన్యం సేంద్రియ వ్యవసాయాన్ని పరిచయం చేసింది. జీవామృతం, కషాయాలు, జీవన ఎరువులు అందించడం ద్వారా రైతులు తమకున్న భూమిలో కొద్ది విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారు. వీరికి అధిక ఆదాయం రాబట్టేందుకు గాను 2 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయించారు. ఈ రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలను మార్కెట్ ధరకన్నా 30% అధిక ధరకు కొనుగోలు చేసి ఆర్గానో స్టోర్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఆర్గానో నాంది ఆవరణలో ఒక దుకాణం ఉంది. హైదరాబాద్ నగరంలో కూకట్‌పల్లి, నానక్‌రాంగూడ, బోయినపల్లిలలో ఆర్గానో స్టోర్లు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన సిరిధాన్యాలు, రెడ్/బ్లాక్/ఆర్గానిక్ వరి బియ్యం, పప్పులను ఈ స్టోర్ల ద్వారా విక్రయిస్తున్నారు. సేంద్రియ రైతుల ఉత్పత్తులకు స్థానిక గ్రామాల్లోనే వినియోగం పెంచేందుకు ప్రత్యేక సంతను నిర్వహించబోతున్నారు.
దేశంలోనే పెద్ద వెదురు నిర్మాణం
ఆర్గానో నాంది ఆవరణలో క్లబ్ హౌస్ కళాత్మకత చూపరులను కట్టిపడేస్తుంది. పడవను బోర్లించినట్టుండే ఈ అద్భుత నిర్మాణం 10,750 చదరపు గజాల్లో విస్తరించి ఉంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి తెప్పించిన వెదురును దీని నిర్మాణంలో వాడారు. క్లబ్ హౌస్‌లోనే కామన్ కిచెన్ ఉంది. వీకెండ్స్‌లో కామన్ కిచెన్‌లోనే భోజనం చేయడానికి ఆర్గానో నాందివాసులు ఇష్టపడుతుంటారు.
సోలార్ విద్యుత్తు, బయోగ్యాస్
ప్రభుత్వ గ్రిడ్ నుంచి విద్యుత్తును వినియోగించకుండా సోలార్, బయోగ్యాస్ ద్వారానే తమ ఇంధన అవసరాలను తీర్చుకోవడం ఆర్గానో నాందివాసుల ప్రత్యేకత. ప్రతి విల్లాపైనా సోలార్ ప్యానల్స్‌ను అమర్చారు. ఇవన్నిటినీ అనుసంధానం చేసి గ్రిడ్‌ను ఏర్పాటు చేశారు. మీటర్లు ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటాయి. గోశాలలో ఆవుల పేడతో ఉత్పత్తయ్యే బయోగ్యాస్‌తో కూడా విద్యుత్తును తయారు చేసుకుంటున్నారు.
బయో పూల్
ప్రకృతిసిద్ధంగానే నీటిని శుద్ధి చేసేలా దేశంలోనే అతిపెద్ద బయో స్విమ్మింగ్ పూల్‌ను ఆర్గానో నాంది ఆవరణలో నిర్మించడం విశేషం. 25 అడుగుల పొడవు, 3–6 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పున బయో పూల్ ఉంది. నెలకోసారి నాచును తొలగించడం తప్ప దీన్ని శుద్ధి చేయడానికి ఎటువంటి రసాయనాలనూ వినియోగించకపోవటం విశేషం.
ప్రశాంతంగా ఉంది..
అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లం. 7 నెలల క్రితం ఇక్కడి విల్లాలోకి వచ్చాం. ప్రశాంతంగా ఉంది. స్వచ్ఛమైన వాతావరణం, సేంద్రియ కూరగాయలు, పాలు.. బాగాఉన్నాయి. కిచెన్ గార్డెనింగ్ కూడా చేస్తున్నాం. ప్రశాంతంగా ఉంది.
– శ్రీలక్ష్మి, గృహిణి, ఆర్గానో నాందియన్
మందుల్లేకుండా పండిస్తం..
నాకు 7 ఎకరాల భూమి ఉంది. 3 గుంటల్లో మందుల్లేకుండా టమాటో, వంకాయలు, మెంతికూర పండిస్తం. మేమూ ఇవే తింటున్నం.
– వై. నారాయణరెడ్డి (96180 22356),
ఎన్కేపల్లి, మొయినాబాద్ మం,, రంగారెడ్డి జిల్లా
రైతులను మారుస్తున్నాం..
9 నెలలుగా ఇక్కడే ఉంటున్నా. ఈ జీవనం చాలా బాగుంది. నేనూ సేంద్రియ కూరగాయలు పండిస్తున్నా. జీవామృతం, జీవన ఎరువులు, కషాయాలు ఇచ్చి పొరుగు గ్రామాల రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఆవులు కూడా ఇస్తున్నాం.
– విజయదుర్గ అడిగోపుల (98490 23039), ఆర్గానో నాంది, ఎన్కేపల్లి
కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గుతుంది
సుస్థిర జీవన, వ్యవసాయ పద్ధతుల వల్ల కార్బన్ / రిసోర్స్ ఫుట్ ప్రింట్ తగ్గుతుంది. కలిగిన వారు నగరం నుంచి పల్లెకు వచ్చి ఉంటే.. గ్రామాలతోపాటు రైతులూ బాగుపడతారు. రూరల్, అర్బన్ కాంబినేషన్‌తో ఏర్పడిందే ‘ఆర్గానో నాంది’. ఇక్కడ ఉన్న వారంతా చాలా సంతృప్తిగా ఉన్నారు. బెంగళూరు, చేవెళ్లలో వెంచర్లు ప్రారంభించబోతున్నాం.
– నగేష్ బత్తుల (98480 23039),
మేనేజింగ్ డైరెక్టర్, ఆర్గానో నాంది, ఎన్కేపల్లి, మొయినాబాద్ మం., రంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment