అనగనగా ఓ పల్లె
ఆకుకూరల సాగుతో నిత్యమూ ఆదాయమే
సెంటు భూమిలోనూ పంట సాగు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
రేకులకుంట... ఈ పేరు రైతులకు చిరపరిచయమే. వ్యవసాయ పంట ప్రయోగాలు, పంట సాగులో తగిన సూచనలు, సలహాలు ఇస్తూ అన్నదాతలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తున్న వ్యవసాయ పరిశోధన కేంద్రం ఈ గ్రామంలోనే ఉంది. అయితే ఇక్కడి రైతులే కాదు... సామాన్య ప్రజలు సైతం వినూత్న పంటల సాగుతో నిత్యమూ ఆదాయం గడిస్తున్నారు. అదేమిటో మీరూ తెలుసుకోవాలంటే ఒక్కసారి రేకులకుంట గ్రామాన్ని సందర్శించాల్సిందే. మరెందుకు ఆలస్యం.. రండి రేకులకుంటను ఒకసారి చూసొద్దాం....
జిల్లా కేంద్రం నుంచి నార్పలకు వెళ్లే దారిలో అనంతపురం పాతూరు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే రేకులకుంట వస్తుంది. దాదాపు 200 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వ్యవసాయంలో పంట నష్టాలు రానంతవరకూ ఇక్కడి రైతుల ప్రధాన సాగు వేరుశనగ, వరి. ఇప్పటికీ వంద ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. వేరుశనగ పంట సాగులో వరుస నష్టాలతో బెంబేలెత్తిన రైతులు ప్రత్యామ్నాయ పంట సాగు వైపు దష్టి సారించారు. ఇందులో భాగంగానే తక్కువ కాలంలో చేతికి వచ్చే ఆకుకూరల సాగు చేపట్టారు.
ఎటు చూసినా ఆకుకూరలే...
రేకులకుంట గ్రామంలో ఎటు చూసినా ఆకుకూరల సాగు కనిపిస్తుంది. ఆఖరుకు ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ సెంటు స్థలంలోనూ ఆకుకూరలను ఇక్కడి రైతులు పండిస్తున్నారు. మలక్కూర, తోటకూర, మెంతాకు, గోంగూర, చుక్కాకు, పలకలాకు, కొత్తిమీర, కరివేప వంటి ఆకుకూరల తోటలు దాదాపు 50 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది.
పెట్టుబడి తక్కువ
ఎకరా విస్తీర్ణంలో ఆకుకూర సాగు చేసేందుకు రూ. పది వేల నుంచి రూ. 15 వేల వరకు పెట్టుబడి అవుతోంది. పంట చేతికి వచ్చిన తర్వాత రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు డిమాండ్‌ను బట్టి రైతులు ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇది కూడా కేవలం 15 రోజుల వ్యవధిలోనే వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఆకుకూరల సాగుకు కూలీల అవసరం లేకపోవడం రైతులకు అదనపు ఆదాయంగా మారింది. ప్రస్తుతం కరివేపాకు టన్ను రూ. 20–25 వేల ధర పలుకుతోంది.
రోజూ డబ్బే
ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఆకుకూరలు సాగుచేస్తే 15 రోజుల తర్వాత పంట చేతికి వస్తుండడంతో రోజూ రైతుల చేతికి డబ్బు వచ్చి చేరుతోంది. ఇక్కడ సాగు చేస్తున్న ఆకు కూరలు జిల్లా వ్యాప్తంగానే కాక, తెలంగాణలోని హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాలకు ఎగుమతి అవుతోంది. అంతేకాక ఆకు కూరలు సాగు చేస్తున్న రైతుల కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు బయట పనులకు వెళ్లే అవసరం లేదు. నిత్యమూ వారికి వారి వ్యవసాయ క్షేత్రంలోనే చేతినిండా పని ఉంటోంది. ప్రతి రోజూ ఏదో ఒక చిన్నపాటి పనులు ఉంటుండడంతో నిత్యమూ ఇక్కడి రైతులు పనుల్లోనే నిమగ్నమై ఉంటారు.
అందని ప్రోత్సాహం
ఆకు కూరలు సాగు చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సక్రమంగా అందడం లేదు. ఆకుకూరల సాగుకు సంబంధించి విత్తనాలు బయటే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పంటసాగుకు సంబంధించి తుంపర సేద్యం పరికరాలు మంజూరు చేయడం లేదు. అంతేకాక సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడం కూడా ఇక్కడి రైతులకు శాపంగా మారుతోంది.
బయటకు వెళ్లే పని లేదు
వ్యవసాయ కూలి పనుల కోసం మరో రైతు పొలానికి వెళ్లే అవసరం లేదు. ఇంట్లో పని ముగించుకున్న తర్వాత రోజంతా ఆకుకూర తోటలోనే చిన్నపాటి పనులు చేసుకుంటున్నాం. శ్రమ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అయితే ఓపికతో పని చేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయం కూడా బాగానే ఉంది.
– సునీత, రేకులకుంట
నిరంతర ఆదాయమే
వరి, వేరుశనగ పంటలు సాగు చేయాలంటే 4 నుంచి 6 నెలల వరకు పంట కోసం వేచి చూడాలి. ఆ తరువాత కూడా పంట చేతికి వస్తుందో లేదో తెలీదు. అదే ఆకు కూర సాగు చేస్తే 15 రోజులకే ఆదాయం కచ్చితంగా చేతికి వస్తుంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఉంటాయి.
– రవికుమార్, రేకులకుంట
మార్కెట్ సౌకర్యం లేదు
సరైన మార్కెట్ సౌకర్యం లేక ఆకుకూరలు సాగు చేసే రైతులు ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. అనంతపురం మార్కెట్‌లో ఆకు కూరలకు సరైన ధర ఇవ్వడం లేదు. ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– లక్ష్మినారాయణ, రేకులకుంట