rekulakunta
-
శాస్త్రవేత్తలకు జాతీయ అవార్డులు
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా మెట్ట వ్యవసాయ పరిశోధనా స్థానంలో పని చేస్తున్న శాస్త్రవేత్తలకు వసంతరావునాయక్ జాతీయ పురస్కారం లభించినట్లు పరిశోధనాస్థానం అధిపతి డాక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆవిర్భావం సందర్భంగా ప్రతి ఏటా జులై - 16న జాతీయ స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉత్తమ పరిశోధనలలో భాగస్వాములైన శాస్త్రవేత్తలకు జాతీయ అవార్డులు అందిస్తారన్నారు. ఇందులో భాగంగానే రేకులకుంటలో వర్షాధార వ్యవసాయం, నీటి సంరక్షణ, నేలల సంరక్షణ పద్ధతులపై, వేరుశనగకు అనుకూలమైన యాంత్రీకరణ పరికరాలు రూపకల్పన చేపట్టడం, సమగ్ర వ్యవసాయ పద్ధతులు అమలు పర్చడంలో రేకులకుంటలో ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ రవీంద్రారెడ్డి, సహదేవరెడ్డి, రెడ్డిపల్లి ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి, రేకులకుంట సీనియర్ శాస్త్రవేత్తలు విజయశంకర్‌బాబు, డాక్టర్ మధుసూధన్‌రెడ్డి, డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ రాధాకుమారిలు చేసిన ప్రయోగాలకు జాతీయస్థాయిలో వసంతరావునాయక్ పురస్కారాలు దక్కాయన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్, ఆచార్య ఎన్జీరంగా ఉపకులపతి డాక్టర్ దామోదరనాయుడు, పరిశోధనా సంచాలకులు ఎన్వీ నాయుడులు ఈ అవార్డులను అందించారని చెప్పారు. -
స్పిరిట్ ఫ్యాక్టరీ వద్దు
♦ రేకులకుంట గ్రామస్తుల రాస్తారోకో ♦ 2 గంటల పాటు స్తంభించిన రాకపోకలు ♦ తహశీల్దార్ హామీతో శాంతించిన ఆందోళనకారులు బుక్కరాయసముద్రం: రేకులకుంటలో ఆల్కహాల్ స్పిరిట్ తయారీ ఫ్యాక్టరీ వల్ల తమ పొలాలకు నష్టం వాటిల్లుతోందని గ్రామస్తులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో అనంతపురం–నార్పల రహదారిపై 2 గంటల పాటు వాహనాలు నిలచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ నాయకులు జిల్లా ఎస్టీ సెల్ అధక్షుడు సాకే రామకృష్ణ, మాజీ సర్పంచ్ సాకే నారాయణస్వామి మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేకులకుంటలో స్పిరిట్ ఫ్యాక్టరీ ప్రజల అనుమతితో ఏర్పాటు చేయలేదన్నారు. దీనివల్ల పంటపొలాలు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయని విచారం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే ఫ్యాక్టరీని మూసివేసేలా చర్యలు చేపట్టి పంట పొలాలను కాపాడాలన్నారు. తహశీల్దార్ గాండ్ల రామకృష్ణయ్య అక్కడకు చేరుకుని కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్‌తో గ్రామస్థులను సమావేశపరచి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఎంపీటీసీ లక్షి్మనారాయణ రాజు, సర్పంచ్ ఆదిశేషయ్య, వైఎస్సార్సీపీ నాయకులు మల్లికార్జున, లక్షి్మనారాయణ, కుళ్లాయప్ప, తిరుపతయ్య, రాజు, నారాయణస్వామి పాల్గొన్నారు. -
అనగనగా ఓ పల్లె
ఆకుకూరల సాగుతో నిత్యమూ ఆదాయమే సెంటు భూమిలోనూ పంట సాగు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రేకులకుంట... ఈ పేరు రైతులకు చిరపరిచయమే. వ్యవసాయ పంట ప్రయోగాలు, పంట సాగులో తగిన సూచనలు, సలహాలు ఇస్తూ అన్నదాతలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తున్న వ్యవసాయ పరిశోధన కేంద్రం ఈ గ్రామంలోనే ఉంది. అయితే ఇక్కడి రైతులే కాదు... సామాన్య ప్రజలు సైతం వినూత్న పంటల సాగుతో నిత్యమూ ఆదాయం గడిస్తున్నారు. అదేమిటో మీరూ తెలుసుకోవాలంటే ఒక్కసారి రేకులకుంట గ్రామాన్ని సందర్శించాల్సిందే. మరెందుకు ఆలస్యం.. రండి రేకులకుంటను ఒకసారి చూసొద్దాం.... జిల్లా కేంద్రం నుంచి నార్పలకు వెళ్లే దారిలో అనంతపురం పాతూరు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే రేకులకుంట వస్తుంది. దాదాపు 200 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వ్యవసాయంలో పంట నష్టాలు రానంతవరకూ ఇక్కడి రైతుల ప్రధాన సాగు వేరుశనగ, వరి. ఇప్పటికీ వంద ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. వేరుశనగ పంట సాగులో వరుస నష్టాలతో బెంబేలెత్తిన రైతులు ప్రత్యామ్నాయ పంట సాగు వైపు దష్టి సారించారు. ఇందులో భాగంగానే తక్కువ కాలంలో చేతికి వచ్చే ఆకుకూరల సాగు చేపట్టారు. ఎటు చూసినా ఆకుకూరలే... రేకులకుంట గ్రామంలో ఎటు చూసినా ఆకుకూరల సాగు కనిపిస్తుంది. ఆఖరుకు ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ సెంటు స్థలంలోనూ ఆకుకూరలను ఇక్కడి రైతులు పండిస్తున్నారు. మలక్కూర, తోటకూర, మెంతాకు, గోంగూర, చుక్కాకు, పలకలాకు, కొత్తిమీర, కరివేప వంటి ఆకుకూరల తోటలు దాదాపు 50 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. పెట్టుబడి తక్కువ ఎకరా విస్తీర్ణంలో ఆకుకూర సాగు చేసేందుకు రూ. పది వేల నుంచి రూ. 15 వేల వరకు పెట్టుబడి అవుతోంది. పంట చేతికి వచ్చిన తర్వాత రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు డిమాండ్‌ను బట్టి రైతులు ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇది కూడా కేవలం 15 రోజుల వ్యవధిలోనే వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఆకుకూరల సాగుకు కూలీల అవసరం లేకపోవడం రైతులకు అదనపు ఆదాయంగా మారింది. ప్రస్తుతం కరివేపాకు టన్ను రూ. 20–25 వేల ధర పలుకుతోంది. రోజూ డబ్బే ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఆకుకూరలు సాగుచేస్తే 15 రోజుల తర్వాత పంట చేతికి వస్తుండడంతో రోజూ రైతుల చేతికి డబ్బు వచ్చి చేరుతోంది. ఇక్కడ సాగు చేస్తున్న ఆకు కూరలు జిల్లా వ్యాప్తంగానే కాక, తెలంగాణలోని హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాలకు ఎగుమతి అవుతోంది. అంతేకాక ఆకు కూరలు సాగు చేస్తున్న రైతుల కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు బయట పనులకు వెళ్లే అవసరం లేదు. నిత్యమూ వారికి వారి వ్యవసాయ క్షేత్రంలోనే చేతినిండా పని ఉంటోంది. ప్రతి రోజూ ఏదో ఒక చిన్నపాటి పనులు ఉంటుండడంతో నిత్యమూ ఇక్కడి రైతులు పనుల్లోనే నిమగ్నమై ఉంటారు. అందని ప్రోత్సాహం ఆకు కూరలు సాగు చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సక్రమంగా అందడం లేదు. ఆకుకూరల సాగుకు సంబంధించి విత్తనాలు బయటే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పంటసాగుకు సంబంధించి తుంపర సేద్యం పరికరాలు మంజూరు చేయడం లేదు. అంతేకాక సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడం కూడా ఇక్కడి రైతులకు శాపంగా మారుతోంది. బయటకు వెళ్లే పని లేదు వ్యవసాయ కూలి పనుల కోసం మరో రైతు పొలానికి వెళ్లే అవసరం లేదు. ఇంట్లో పని ముగించుకున్న తర్వాత రోజంతా ఆకుకూర తోటలోనే చిన్నపాటి పనులు చేసుకుంటున్నాం. శ్రమ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అయితే ఓపికతో పని చేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయం కూడా బాగానే ఉంది. – సునీత, రేకులకుంట నిరంతర ఆదాయమే వరి, వేరుశనగ పంటలు సాగు చేయాలంటే 4 నుంచి 6 నెలల వరకు పంట కోసం వేచి చూడాలి. ఆ తరువాత కూడా పంట చేతికి వస్తుందో లేదో తెలీదు. అదే ఆకు కూర సాగు చేస్తే 15 రోజులకే ఆదాయం కచ్చితంగా చేతికి వస్తుంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఉంటాయి. – రవికుమార్, రేకులకుంట మార్కెట్ సౌకర్యం లేదు సరైన మార్కెట్ సౌకర్యం లేక ఆకుకూరలు సాగు చేసే రైతులు ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. అనంతపురం మార్కెట్లో ఆకు కూరలకు సరైన ధర ఇవ్వడం లేదు. ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – లక్ష్మినారాయణ, రేకులకుంట -
తేలికపాటి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వాతావరణ కేంద్రం అందించిన సమాచారం మేరకు.. జిల్లాలో అక్కడక్కడ 4 నుంచి 20 మి.మీ వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు పగలు 29 నుంచి 35, రాత్రిళ్లు 23 నుంచి 25 డిగ్రీలు నమోదవుతాయని తెలిపారు. -
అనంతలో జాతీయ వ్యవసాయ సదస్సు
అనంతపురం : అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మంగళవారం జాతీయ వ్యవసాయ సదస్సు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాల వ్యవసాయ అభివృద్ధిపై శాస్త్రవేత్తలు చర్చించనున్నారు. కరువు ప్రాంతంగా పేరు మోసిన అనంతపురం జిల్లాను వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించేందుకు ఇక్కడ జాతీయ వ్యవసాయ సదస్సు నిర్వహించనున్నారు. తద్వారా రైతులకు తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి సాగుకు సహకరించనున్నారు.