బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా మెట్ట వ్యవసాయ పరిశోధనా స్థానంలో పని చేస్తున్న శాస్త్రవేత్తలకు వసంతరావునాయక్ జాతీయ పురస్కారం లభించినట్లు పరిశోధనాస్థానం అధిపతి డాక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆవిర్భావం సందర్భంగా ప్రతి ఏటా జులై - 16న జాతీయ స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉత్తమ పరిశోధనలలో భాగస్వాములైన శాస్త్రవేత్తలకు జాతీయ అవార్డులు అందిస్తారన్నారు. ఇందులో భాగంగానే రేకులకుంటలో వర్షాధార వ్యవసాయం, నీటి సంరక్షణ, నేలల సంరక్షణ పద్ధతులపై, వేరుశనగకు అనుకూలమైన యాంత్రీకరణ పరికరాలు రూపకల్పన చేపట్టడం, సమగ్ర వ్యవసాయ పద్ధతులు అమలు పర్చడంలో రేకులకుంటలో ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ రవీంద్రారెడ్డి, సహదేవరెడ్డి, రెడ్డిపల్లి ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి, రేకులకుంట సీనియర్ శాస్త్రవేత్తలు విజయశంకర్‌బాబు, డాక్టర్ మధుసూధన్‌రెడ్డి, డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ రాధాకుమారిలు చేసిన ప్రయోగాలకు జాతీయస్థాయిలో వసంతరావునాయక్ పురస్కారాలు దక్కాయన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్, ఆచార్య ఎన్జీరంగా ఉపకులపతి డాక్టర్ దామోదరనాయుడు, పరిశోధనా సంచాలకులు ఎన్‌వీ నాయుడులు ఈ అవార్డులను అందించారని చెప్పారు.