పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల హాజరు | Adimulapu Suresh Comments About Schools Reopen In AP | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల హాజరు

Published Sat, Nov 7 2020 3:51 AM | Last Updated on Sat, Nov 7 2020 3:51 AM

Adimulapu Suresh Comments About Schools Reopen In AP - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన పాఠశాలలు తెరవగా 6వ తేదీ నాటికి క్రమేణా హాజరు శాతం పెరుగుతోందన్నారు. ముఖ్యంగా  10వ తరగతి విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. శుక్రవారం 10వ తరగతి విద్యార్థులు 49.63% మంది హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 38.29% కాగా, ఉపాధ్యాయులు 89.86% విధులకు హాజరయ్యారు. మొత్తంగా విద్యార్థుల హాజరు 43.88కి చేరింది. గత నాలుగు రోజుల్లో విద్యార్థుల హాజరును పరిశీలిస్తే 2వ తేదీన 42%, 3న 33.69, 4న 40.30, 5వ తేదీన 35 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. 6వ తేదీ నాటికి 43.89కి చేరింది.

కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు బయటపడుతుండగా వారిని హోమ్‌ ఐసొలేషన్లో ఉంచి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టెస్టులు చేస్తున్నారని మంత్రి చెప్పారు. కోవిడ్‌పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్‌లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులనూ పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాస్క్, శానిటైజేషన్, భౌతిక దూరం విషయాల్లో రాజీపడేది లేదన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement