
భోంచేసి వెళ్లండి
కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వేసవి సెలవుల్లోను మధ్యాహ్నభోజనం అందించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళికను విడుదల చేస్తూ ఎట్టకేలకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. మొదటగా కరువు మండలాల్లోని పాఠశాలల విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్నభోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ... తాజాగా అ న్ని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భోజనం అందించాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం మం డల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మధ్యాహ్నభోజనం నిర్వహణ, విద్యార్థుల హాజరు విషయంపై వివరించనున్నారు.
20 నుంచి ప్రారంభం...
ఈనెల 20 నుంచి పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నారు. వేసవి దృష్ట్యా విద్యార్థులను ప్రతిరోజు ఉదయం 8 గంటలకే పాఠశాలలకు రప్పించి, ఉదయం 10.30 గంటలకు భోజనం అందించి, 11 గంటలలోపు విద్యార్థులు వారి ఇళ్లకు వెళ్లేవిధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉదయం 8 గంటలకు వచ్చిన విద్యార్థులకు పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం, లేఖలు రాయడం, ఉపన్యాసాలు, వ్యాకరణంలో శిక్షణ, ఆటపాటలు, పెయింటింగ్, నాట్యం తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు పాఠశాలలకు హాజరయ్యే ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి సంపాదిత సెలవులు మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలల్లో సైతం...
జిల్లావ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, హాస్టళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం మధ్యాహ్నభోజనం పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొదటి విడతగా మండలానికి ఒకటి చొప్పున అనువుగా ఉండే ఆశ్రమ పాఠశాల, ఒక హాస్టల్‌ను గుర్తించి వందమంది విద్యార్థులకు తక్కువ కాకుండా వారంలో ఏడు రోజులపాటు మధ్యాహ్న భోజనం అందించాలని సూచించింది. ఈనెల 25లోగా ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల వివరాలను అందించాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రంజీవ్ ఆచార్య సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్లకు సూచించారు. ఒక మండలంలో బాలురకు, పక్క మండలంలో బాలికలకు వేర్వేరుగా వసతులు ఏర్పాటు చేసి ఇదివరకు పనిచేస్తున్న వంట ఏజెన్సీ నిర్వహకుల ద్వారానే భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో తల్లిదండ్రులను సంప్రదించి ఆశ్రమ పాఠశాల, హాస్టళ్లకు రావాలనుకునే పిల్లల వివరాలు సేకరించి మధ్యాహ్నభోజనాన్ని పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లల్లో ఉండే విద్యార్థులకు సైతం ఆటపాటల్లో శిక్షణతోపాటు వీలునుబట్టి విహారయాత్రకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది.
విద్యార్థులు వస్తారా..?
రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లల్లో వంద మంది విద్యార్థులను ఒకచోట చేర్చి మధ్యాహ్నభోజనం పెట్టాలనే నిర్ణయం విస్మయాన్ని కలిగిస్తోంది. మండుతున్న ఎండలతో సతమతమవుతున్న ప్రజలు తమ పిల్లలను గ్రామం నుంచి పక్క మండలంలోని ఆశ్రమ పాఠశాలకు లేదా హాస్టల్ పంపేందుకు ఎలా ముందుకు వస్తారని పలువురు పేర్కొంటున్నారు. కరువు దృష్ట్యా వేసవి సెలవుల్లో మధ్యాహ్నభోజనం అమలు మంచిదే అయినా... తమ పిల్లలను కేవలం భోజనం కోసమే పంపుతారో లేదో వేచిచూడాల్సిందే!