సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విధించిన కరోనా లాక్‌డౌన్ మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు పాల్గొన్నారు. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ కొనసాగింపుపై ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సూచనలు స్వీకరించారు. రాష్ట్రాల వారీగా అభిప్రాయాలు తెలుసుకున్నారు.
(చదవండి: అదే ఏకైక డిమాండ్ కావాలి - చిదంబరం)
దేశ వ్యాప్త లాక్‌డౌన్‌కే మొగ్గు..
ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రథమ లక్ష్యమని ఈ సందర్బంగా ముఖ్యమంత్రులు ప్రధానితో అన్నారు. ప్రజారోగ్యానికే పెద్దపీట వేయాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని పలు రాష్ట్రాల సీఎంలు సూచించారు. రాష్ట్రాల వారిగా కంటే.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండాలని, అప్పుడే కరోనాను ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులు.. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, కిట్లు, మందులపై ప్రధాని సీఎంలకు పలు సూచనలు చేశారు.
పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కోరారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లను రాష్ట్రాలకు త్వరగా పంపించాలని అన్నారు. కాగా, రాష్ట్రాలకు 24 గంటలపాటు అందుబాటులో ఉంటానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘మీకు ఏ కష్టమొచ్చినా నాకు చెప్పండి’అని ప్రధాని వ్యాఖ్యానించారు. సమస్య నుంచి బయటపడేందుకు వ్యూహం ఉందని ఆయన తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 7447 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 239 మరణాలు సంభవించాయి.
(చదవండి: నకిలీ వార్తలకు చెక్ చెప్పిన రతన్ టాటా)
Comments
Please login to add a commentAdd a comment