గీసుకొండ : మండలంలోని వంచనగిరి జేడ్పీ హైస్కూల్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ప్రచార బాట పట్టారు. సర్కారు బడులను బతికించుకునే పనిలో భాగంగా తమ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటూ వంచనగిరి గ్రామంలో ఆ రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సోమవారం ప్రచారం చేపట్టారు. ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా గ్రామంలోని ఇంటింటికి తిరిగి సర్కారు పాఠశాలలో చేర్పిస్తే కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు, పిల్లలకు వివరించారు.
అనుభవం, ఉన్నత విద్యావంతులైన శిక్షణ పొందిన టీచర్లతో బోధన ఉంటుందని, మధ్యాహ్న భోజనంతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాంలు అందజేస్తామని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం రమాదేవి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం సాంబరెడ్డి, ఉపాధ్యాయులు రాంమూర్తి, బాష్‌మియా, హేమలత పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో హైస్కూల్‌లో 15 మందిని, పీఎస్‌లో 12 మందిని చేర్పించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.