అనంతపురం/కదిరి: పాఠశాలలకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. 2018–19 విద్యా సంవత్సరానికి మంగళవారం చివరి పనిదినం. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు విధిగా పాటించాలని డీఈఓ జనార్దనాచార్యులు ఆదేశించారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయన్నారు. 24 నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ పాఠశాలలు నడపరాదని పేర్కొన్నారు. పదో తరగతి ప్రత్యేక తరగతులు, శిక్షణలు కూడా నిర్వహించరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తే సంబంధిత పాఠశాలల యాజమాన్యాలపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఇకపోతే జిల్లాలోని మొత్తం 63 మండాలాల్లో కేవలం 32 మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. దీంతో ఆయా మండలాల్లోని పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే మధ్యాహ్న భోజనం వడ్డించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి.
మధ్యాహ్న భోజనం అమలయ్యే మండలాలివే..
అనంతపురం, బెలుగుప్ప, బొమ్మనహాళ్, డీ.హీరేహాళ్, గుత్తి, గుంతకల్లు, కణేకల్లు, కూడేరు, పెద్దవడుగూరు, పెనుకొండ, పుట్లూరు, రామగిరి, రొద్దం, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అమరాపురం, బ్రహ్మసముద్రం, చిలమత్తూరు, గాండ్లపెంట, గోరంట్ల, గుడిబండ, గుమ్మఘట్ట, కదిరి, కళ్యాణదుర్గం, కంబదూరు, కూడేరు, ఎన్‌పీ కుంట, పుట్టపర్తి, సోమందేపల్లి, శెట్టూరు, తనకల్లు మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తిస్తూ జీఓ ఎంఎస్ నెం.2ను ఈ ఏడాది ఫిబ్రవరి 13న విడుదల చేసింది. ఈ కరువు మండలాల పరిధిలోని పాఠశాలల్లో మాత్రమే వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని ప్రభుత్వం తాజాగా సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో(ఆర్‌సీ నెం.2/27021) స్పష్టం చేసింది.
సెలవుల్లో బడికెళ్లిన టీచర్‌కు ఏం లాభం?
వేసవి సెలవుల్లో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లి పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించి దగ్గరుండి అందించినందుకు అదనంగా రూ.2 వేలు గౌరవవేతనం రూపంలో అందజేస్తారు. హెచ్‌ఎం బదులుగా అదే పాఠశాలలో పనిచేసే మిగిలిన ఒకరిద్దరు టీచర్లు సైతం రొటేషన్ పద్ధతిలో మధ్యాహ్న భోజన పర్యవేక్షించి, పిల్లలకు భోజన ఏర్పాట్లు చూసినందుకు వారికి కూడా ఈ గౌరవవేతనం వర్తిస్తుంది. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాత్రం రోజూ మధ్యాహ్న భోజనానికి హాజరైన విద్యార్థుల వివరాలు యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. వాస్తవంగా ఉపాధ్యాయులు వేసవి సెలవులను వదులుకొని పాఠశాలకు హాజరై మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించినందుకు మెమో నెం.225780 ప్రకారం వేతనంతో కూడిన ఆర్జిత సెలవు(ఈఎల్) కూడా మంజూరు చేయాల్సి ఉంటుంది. కాకపోతే మధ్యాహ్న భోజనానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో(ఆర్‌సీ నెం.2/27021) ఆ విషయమై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment