ఎయిడెడ్ స్టూడెంట్స్ వేరయా!
► యూనిఫాంకు ఇండెంట్ అడగని వైనం
► మిగతా పాఠశాలలకు ఇచ్చేందుకు నిర్ణయం
► ఆందోళనలో సిబ్బంది
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం చూపుతున్న సవతి తల్లి ప్రేమ మరోసారి బయటపడింది. కస్తూర్బా, ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే యూనిఫాంల ఇండెంట్‌ను తీసుకుంది. అయితే ఎయిడెడ్ పాఠశాలల ఇండెంట్‌ను మాత్రం తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. అక్కడ కూడా పేద విద్యార్థులే చదువుకుంటున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మొట్ట మొదటి సారిగా 2015-16 విద్యా సంవ్సరంలో ఉచిత దుస్తులను ప్రభుత్వం అందజేసింది. జిల్లాలోని 142 ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 16,348 మంది విద్యార్థులు అందుకున్నారు. ఈ సంవత్సరం కూడా దుస్తులు వస్తాయని చెప్పి విద్యార్థుల సంఖ్యను పెంచే పనిలో టీచర్లు ఉన్నారు.
వస్తాయా..రావా
మరోవైపు ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత దుస్తులతోపాటు మధ్యాహ్న భోజనం సదుపాయం ఉందని ఉపాధ్యాయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పిడుగు లాంటి వార్త వారి చెవిన పడింది. జిల్లాలోని కస్తూర్బా, ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఉచిత దుస్తులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఇండెంట్‌ను ఇవ్వాలని ఎంఈఓలను ఆదేశించింది. అయితే ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఇండెంట్‌ను మాత్రం అడగలేదు. దీంతో ఉచిత దుస్తులు వస్తాయా లేదా అన్న అనుమానం నెలకొంది. ఉచిత దుస్తుల కోసం ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం 160 రూపాయలను చెల్లిస్తుంది. ఈ లెక్కనా ప్రభుత్వం గతేడాది 1.30 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ ఏడాది కూడా దాదాపుగా అంతేమంది విద్యార్థులు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే అవకాశం ఉంది.
ఎయిడెడ్ విద్యార్థులకు ఉచిత దుస్తులు ఇవ్వాలి:
ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఏపీటీజీ ఏళ్ల పోరాటానికి గతేడాది దిగి ఇచ్చి దుస్తులు అందజేసింది. మళ్లీ ఈ ఏడు ఇవ్వకుండా తిరకాసు పెడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ పోరాటం బాట పట్టక తప్పదు. వెంటనే ఎయిడెడ్ పాఠశాలలకు కూడా ఇండెంట్‌ను కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఇమ్మానుయేల్, ఏపీటీజీ రాష్ట్ర కార్యదర్శి
ఇంకా నిర్ణయం తీసుకోలేదు:
గతేడాది జిల్లాలోని 142 ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు 16,340 ఉచిత దుస్తులను పంపిణీ చేశాం. ఈ ఏడాది ప్రభుత్వ, కస్తూర్బా, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల ఇండెంట్‌ను అడిగారు. ఎయిడెడ్ పాఠశాలల ఇండెంట్‌ను అడగలేదు. దాని ప్రకారమే ఎంఈఓలకు ఇండెంట్ కోసం పంపాం. త్వరలో ఎయిడెడ్ విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వై.రామచంద్రారెడ్డి, పీఓ