ఎయి‘డెడ్’ భవనాలు
చిత్రంలో కనిపిస్తున్న భవనం బుధవార పేటలోని జంపాలగట్టయ్య ప్రాథమిక ఎయిడెడ్ పాఠశాల. ఇందులో నాలుగు గదులు ఉన్నాయి. అందులో రెండు గదులు ఇప్పటికే కూలీ పోయాయి. మిగిలిన రెండు గదులు చిన్నపాటి వర్షానికే చిత్తడిచిత్తడిగామారుతున్నాయి.ఒకప్పుడు 200 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునేవారు. నేడు 30 మంది కూడా లేని పరిస్థితినెలకొంది. ఇది ఒక్క జంపాలగట్టయ్య పాఠశాల దుస్థితే కాదు. జిల్లాలోని అన్ని ఎయిడెడ్ పాఠశాలల పరిస్థితి ఇలాగే ఉంది.ఎప్పుడూ కూలుతాయో తెలియడం లేదు. అయినా ప్రభుత్వం కాని, ఆయా పాఠశాలల యాజమాన్యాలు కాని కనీసం మరమ్మతులు చేపడుదామనే ఆలోచన చేయడం లేదు.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 110 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. 41 ఉన్నత ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చాలా పాఠశాలలకు పక్కా భవనాలు, ఆట స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి భవనాలు. అప్పట్లో మేనేజ్‌మెంట్లు ఆర్థికంగా ఉండడంతో ఏమైన మరమ్మతులు వస్తే వెంటనే చేయించేవారు. ఇందుకు ప్రభుత్వం కూడా చేయూతను ఇచ్చేది. అయితే ఇరవై ఏళ్ల నుంచి చాలా పాఠశాలల మేనేజ్‌మెంట్లు నిర్వీర్యమయ్యాయి. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలపై సవతి ప్రేమను చూపుతోంది. దీంతో భవనాలు శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం మానేశారు. జిల్లాలో దాదాపు 80 ప్రైమరీ పాఠశాలలకు సరైన పక్కా భవనాలు లేవు.
వీటిలో ఇప్పటికే కొన్ని కూలీపోవడంతో ఆయా స్కూళ్లను ఉపాధ్యాయులే అద్దె భవనాల్లో సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. అక్కడ చాలా ధీనమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. బాతురూంలు లేని పాఠశాలలు కూడా ఎయిడెడ్ విభాగంలోనే ఉన్నాయి. ఇక పక్కాభవనాలు ఉన్నా మరమ్మతులకు గురైన పాఠశాలలే దాదాపుగా 60కు పైగా జిల్లాలో ఉన్నాయి. వీటి మరమ్మతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మైనర్ రిపేరిల కోసం ఒక్క రూపాయిని విడుదల చేయడం లేదు. కేవలం స్కూల్ గ్రాంట్‌ను మాత్రమే పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి రూ. 5 నుంచి 7 వేల వరకు విడుదల చేస్తుంది.
స్పెషలాఫీసర్లుగా డీవైఈఓలు, ఎంఈఓలు
జిల్లాలో చాలా ఎయిడెడ్ పాఠశాలలకు మేనేజ్‌మెంట్ కమిటీలు లేవు. దీంతో వాటి స్థానంలో ప్రభుత్వం ఉన్నత పాఠశాలలకు డీవైఈఓలు, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు ఎంఈఓలను స్పెషలాఫీసర్లుగా నియమించింది. అయితే వారు కూడా పాఠశాలల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు. ఈనేపథ్యంలో మర్మతులకు గురైన పాఠశాలలు కూలీపోతున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించకుంటే ఉన్న పాఠశాలల్లో మరికొన్ని కూలీపోయి పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
మరమ్మతుల కోసం నిధులు ఇవ్వం
ఎయిడెడ్ పాఠశాలల మరమ్మతుల కోసం ప్రభుత్వం ఏమి నిధులను ఇవ్వదు. నిర్వహణ కోసం మాత్రం స్కూల్ గ్రాంటును ఇస్తుంది. ఐదు వేల కంటే ఏ పాఠశాలకు ఎక్కువగా రాదు. వాటితో చాక్‌పీసులు, ఇతర వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంది. - వై. రామచంద్రారెడ్డి, పీఓ, ఎస్‌ఎస్‌ఏ
ఎయిడెడ్ స్కూళ్లను నిర్వీర్యం చేసేందుకు కుట్ర
ఎయిడెడ్ పాఠశాలపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. మేనేజ్‌మెంట్లు పాఠశాలల స్థలాలపై కన్నేసి వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఎత్తులు వేస్తున్నాయి. ఎయిడెడ్ స్కూళ్లను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. నిర్వహణ గ్రాంటును ఎయిడెడ్ పాఠశాలలకు ఇవ్వాలి. - విక్టర్ ఇమ్మానుయేల్, ఏపీటీజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి