మధ్యాహ్న భోజనంపై కాకి లెక్కలు!
67 శాతం నిధులే ఖర్చు చేసినట్లు తేల్చిన కాగ్
సాక్షి, హైదరాబాద్: మధ్యాహ్న భోజనంపై ప్రభుత్వం వేసిన లెక్కలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని కాగ్ నివేదిక ఎండగట్టింది. కాకి లెక్కలతో చేసిన ప్రతిపాదనల కారణంగా పథకానికి కేటాయించిన నిధులు 33 శాతం మిగిలిపోయాయని పేర్కొంది. 2010-2015 మధ్య మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిన పాఠశాలలు, వాటిల్లోని పిల్లలు, భోజనాల సంఖ్యకు... 2011-2016 మధ్య చూపిన సంఖ్యలకు మధ్య పొంతన లేదని, తప్పుడు లెక్కలు చూపారని తుర్పారబట్టింది. ఈ పథకం కింద ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.5,466 కోట్లు కేటాయిస్తే రూ.3,666 కోట్లు (67 శాతం) మాత్రమే ఖర్చు చేశారని తేల్చింది.
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపడం, అవసరానికి మించి నిధులకు ప్రతిపాదించడం వంటి కారణాలతో 2012-13లో రూ.239.83 కోట్లు, 2013-14లో రూ.402.32 కోట్లు మిగిలిపోయాయని పేర్కొంది. కరువు మండలాల్లో వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించాలని మార్గదర్శకాల్లో ఉన్నా... 2012-13, 2013-14, 2014-15 సంవత్సరాల్లో కార్యాచరణ ప్రణాళికలతో ప్రతిపాదనలు ఇవ్వలేదని, దాంతో కరువు ప్రాంతాల్లో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం పెట్టలేదని కాగ్ వేలెత్తి చూపింది. ఇక వార్షిక కార్యాచరణ, బడ్జెట్ ప్రకారం 2010-15 మధ్య 237 కోట్ల భోజనాలకు రూ.1,209.86 కోట్లు అవసరమని చూపించగా.. ఆహార ధాన్యాలు, వంట ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 940.14 కోట్లే ఖర్చు చేసిందని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నా ఆ ప్రభావం విద్యార్థుల నమోదు, హాజరుపై ప్రభావం చూపడం లేదని పేర్కొంది.
అక్షరాస్యత కార్యక్రమాల లెక్కలేవీ?
రాష్ట్రంలో అక్షరాస్యత కార్యక్రమాలకు సంబంధించిన వ్యయానికి లెక్కలు పూర్తిస్థాయిలో ఇవ్వలేదని కాగ్ పేర్కొంది. సాక్షర భారత్ మిషన్ కింద రూ.240.83 కోట్లు ఖర్చు చేస్తే వినియోగ ధ్రువపత్రాలను రూ.104.23 కోట్లకే అందజేశారని వెల్లడించింది.
నిధుల ఖర్చు లేని విద్యాశాఖ
విద్యాశాఖకు 2014-15 బడ్జెట్‌లో రూ.9,276 కోట్లు కేటాయిస్తే రూ.5,872.87 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని... రూ.3,403.56 కోట్లు మిగిలిపోయాయని కాగ్ వెల్లడించింది. ఇందులో రూ.3,228.63 కోట్లు సరెండర్ చేసినట్లు పేర్కొంది. ఇక ఏడాది పొడవునా వ్యయం చేయకుండా... నిధులు మురిగిపోకుండా ఉండేందుకు డిసెంబర్ నుంచి మార్చి వరకు హడావుడిగా ఖర్చు చేస్తున్నట్లు తేల్చింది.
సంక్షేమ సదనాల నిర్వహణ లోపభూయిష్టం
అనాథ బాలలు, శిశు సంరక్షణ కేంద్రాల నిర్వహణ, పనితీరులో భారీ స్థాయిలో లోపాలు ఉన్నాయని కాగ్ వేలెత్తి చూపింది. ఏడు శిశు సంరక్షణ కేంద్రాలకుగాను ఐదింటిలో పిల్లల వయసు, నేర స్వభావం, వారికి అవసరమయ్యే సంరక్షణ, శారీరక-మానసిక ఆరోగ్యం ఆధారంగా వర్గీకరించలేదని స్పష్టం చేసింది. ఈ సదనాల్లో తగిన మౌలిక వసతులు లేవని.. 52శాతం వరకూ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
టీచర్ల్లూ.. ఇదేం పని!
రాష్ట్ర విభజన సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ఏడు మండలాల్లోని ఉపాధ్యాయులు మోసపూరితంగా రెండు రాష్ట్రాల్లోనూ వేతనాలను డ్రా చేసిన విషయాన్ని కాగ్ ఎండగట్టింది. జెడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన 211 మంది టీచర్లు వేతనాల కింద ఏపీ నుంచి రూ.1.65 కోట్లు, తెలంగాణ నుంచి రూ.1.58 కోట్లు డ్రా చేసుకున్నారని... మోసపూరితంగా వేతన నిధులను డ్రా చేసిన వారిపై చర్యలు చేపట్టాలని సూచించింది. ఏపీకి వెళ్లిన మూడు మండలాల్లోని ఆశ్రమ పాఠశాలల ఉద్యోగులకు సంబంధించిన రూ. 12.26లక్షల జీతభత్యాలను తెలంగాణ రాష్ట్ర డ్రాయింగ్ అధికారులు డ్రా చేసిన విషయాన్ని కాగ్ బయట పెట్టింది.