ప్రైవేటు ప్రీప్రైమరీకి గుర్తింపు తప్పనిసరి!
- ఈ నెల 31లోగా గుర్తింపు తీసుకోవాల్సిందేనన్న విద్యాశాఖ
- గుర్తింపు ప్రక్రియ మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ (ప్రీప్రైమరీ) నిర్వహిస్తున్న ప్రతి ప్రైవేటు పాఠశాల తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రీప్రైమరీ తరగతులను నిర్వహిస్తున్న, కొత్తగా ప్రారంభించే పాఠశాలలు ప్రీప్రైమరీకి ఈ నెల 31వ తేదీలోగా అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
లిఫ్ట్ ప్రమాదం నేపథ్యంలో మేల్కొన్న విద్యాశాఖ
రాష్ట్రంలో 11,470 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వాటిల్లో ప్రీప్రైమరీ సెక్షన్లు కలుపుకొని మొత్తంగా 31.28 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి పాఠశాల ప్రీప్రైమరీ విద్యను కొనసాగిస్తున్నది. రెండు నెలల కిందట నగరంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థి లిఫ్ట్‌లో ఇరుక్కొని చనిపోయిన నేపథ్యంలో ప్రీప్రైమరీకి గుర్తింపు అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వం ప్రీప్రైమరీకి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వకున్నా గత 20–25 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ప్రీప్రైమరీ విద్యను కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ విధానం ప్రకారం బడిలో 5 ఏళ్లు నిండినవారినే ఒకటో తరగతిలో చేర్చించాలి. జీవో నంబర్ 1లోని నిబంధనల ప్రకారం ప్రీప్రైమరీ నియంత్రణ పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ నుంచి గుర్తింపు తీసుకోవాలంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
గుర్తింపు సరే.. సిలబస్ ఏదీ?
ఇన్నాళ్లు ప్రైవేటు పాఠశాలల్లో ప్రీప్రైమరీకి సంబంధించిన అం«శాన్ని పెద్దగా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు సిలబస్ రూపకల్పనకు సిద్ధమైనా మళ్లీ వెనకడుగు వేసింది. ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకొని సిలబస్‌ను ప్రకటించి, ఆ తరువాత ప్రీప్రైమరీకి గుర్తింపు అడగాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అయితే, విద్యాశాఖ మాత్రం గుర్తింపు వేరు.. సిలబస్ వేరు.. అని పేర్కొంటోంది.
ప్రీప్రైమరీ అనుమతుల ఉత్తర్వుల్లోని నిబంధనలివే..
► వెంటిలేషన్ కలిగిన భవనాల గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రీప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలి.
► వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, వ్యాపార ప్రాంతాలు, సినిమా హాళ్లకు దూరంగా ఉండాలి.
► పిల్లల ఆట వస్తువులు ప్రమాదకరం కానివై ఉండాలి.
► వారికి అవసరమైన సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బందిని(ఆయాలు) నియమించాలి.
► తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలి.
► ఫస్ట్ ఎయిడ్ సదుపాయం ఉండాలి.
► పిల్లల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సిబ్బందిని ఏర్పాటు చేయాలి.