గురుకుల కాంట్రాక్టు సిబ్బందికి భారీ వేతనాలు
- జూనియర్ లెక్చరర్‌కు రూ.18 వేల నుంచి రూ.27 వేలకు పెంపు
- పీజీటీకి రూ.16,100 నుంచి రూ.24,150కు..
- ప్రభుత్వ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు పెంపుపై సందిగ్ధత
- క్రమబద్ధీకరణ నేపథ్యంలో ఫైలును వెనక్కి పంపిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర గురుకుల సొసైటీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ బోధనా సిబ్బందికి ప్రభుత్వం భారీగా వేతనాలు పెంచింది. ఇప్పటివరకు నెలకు రూ.18 వేలు ఉన్న జూనియర్ లెక్చరర్ వేతనాన్ని రూ.27 వేలకు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)కు రూ.16,100 నుంచి రూ.24,150కి.. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)కి నెలకు రూ.14,800 నుంచి రూ.22,200 వేలకు పెంచింది. ఇక స్టాఫ్ నర్సుల వేతనాన్ని రూ.12,900 నుంచి రూ.19,350కు.. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల (పీఈటీ)కు రూ.10,900 నుంచి రూ.16,350కి పెంచింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం ఉత్తర్వులు (జీవో నం.27) జారీ చేశారు.
ప్రభుత్వ కాలేజీల్లోని వారిపై సందిగ్ధత
గురుకులాల్లో వేతనాల పెంపు నేపథ్యంలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ లెక్చరర్ల వేతనాల పెంపుపైనా చర్చలు మొదలయ్యాయి. దాదాపు 5 వేల మందికిపైగా కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు పెంచడంపై సందిగ్ధత నెలకొంది. ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్ నెల రోజుల కింద కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు ప్రస్తుతమున్న రూ.18 వేల వేతనాన్ని రూ.27 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. అయితే ప్రభుత్వ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు వారికి వేతనాల పెంపు అవసరం లేదని విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలిసింది. అందువల్ల ఆ ఫైలును వెనక్కి పంపినట్లు సమాచారం. మరోవైపు క్రమబద్ధీకరణకు చాలా సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో వేతనాలను పెంచాలని జూనియర్ కాలేజీలు, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.