పట్టిసీమపై మొట్టికాయ
పట్టిసీమపై మొట్టికాయ
Published Sat, Apr 1 2017 1:37 AM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ తలంటింది. పోలవరం కుడికాలువ పూర్తికాకుండా, కనీసం డిస్ట్రిబ్యూటరీలను, పారిశ్రామిక, గృహ వినియోగదారులను గుర్తించకుండానే ఈ ప్రాజెక్టు నిర్మించడాన్ని తప్పు పట్టింది. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిపోయిందని మొట్టికాయ వేసింది. ప్రాజెక్టు పూర్తయి ఏడాది దాటినా ఇప్పటికీ కుడికాలువ (ఇది పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ) పనులు పూర్తికాని సంగతి తెలిసిందే. పలు వంతెనలు, కుడికాలువ లైనింగ్ పనులు సైతం పూర్తి కాలేదు. హడావుడిగా నీరు విడుదల చేయటం వల్ల ఒకసారి జానంపేట వద్ద, మరోసారి రామిలేరు వద్ద కాలువకు గండ్లుపడ్డాయి. దీనివల్ల అదనంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. టెండర్ ప్రీమియాన్ని తగ్గించడం, పోలవరం కాలువ పనులు పూర్తికాకుండానే అధికంగా పెంచిన అంచనాలకు ఎత్తిపోతల పథకం పనులు కట్టబెట్టడాన్ని ప్రశ్నించింంది. నిర్మాణ పద్ధతిలో మార్పులు తేవడం ద్వారా రూ.18 కోట్లు అనవసర వ్యయం అయిందని, పైపులకు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉన్నా రూ. 17 కోట్లు మళ్లీ చెల్లించాలి్సన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. పోలవరం కుడికాలువ ద్వారా గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తరలించడంతో పాటు 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం 2016 మార్చి నాటికి పూర్తి అయినా పోలవరం కుడి కాలువ పనులు మాత్రం జూన్ నాటికి కూడా పూర్తి కాలేదని కాగ్ గుర్తించింది. ఈ ఎత్తిపోతలలో 24 పంపులకు గాను 2016 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య11 పంపులను మాత్రమే ఉపయోగించాల్సి వచ్చింది. ప్రణాళిక లేకపోవడం వల్ల పశ్చిమగోదావరి జిల్లాకు ఈ ప్రాజెక్టు ఏ మాత్రం ఉపయోగపడకుండా పోయింది. పట్టిసీమ ప్రాజెక్టు సరికాదంటూ విపక్షాలు చెబుతున్నా పట్టించుకోకుండా ప్రాజెక్టును పూర్తి చేసిన ప్రభుత్వానికి కాగ్ నివేదికతో తల బొప్పికట్టినట్టైంది.
Advertisement