ఆ తీర్పును పునఃపరిశీలించండి
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) లోని సెక్షన్ 377ను సమర్థిస్తూ వెలువరించిన తీర్పు వల్ల వేలాదిమంది స్వలింగ సంపర్కులు ప్రాసిక్యూషన్ రిస్క్‌తోపాటు వేధింపులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, అందువల్ల ఆ తీర్పును పునఃపరిశీలించాలని కోరింది. స్వలింగ సంపర్కులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశామని పేర్కొంది. సాధారణంగా రివ్యూ పిటిషన్లపై చాంబర్‌లోనే వాదనలు విని, దానిపై నిర్ణయం తీసుకుంటారు. అయితే తమ పిటిషన్‌పై కోర్టులోనే వాదనలు వినాలని అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి కోరారు.
పరస్పర సమ్మతితో ఏకాంతంలో ఇద్దరు వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈనెల 11న కొట్టివేసిన సంగతి తెలిసిందే. అసహజమైన శృంగార చర్యలు, స్వలింగ సంపర్కం నేరమని, అందుకు జీవితఖైదు వరకు శిక్ష విధించవచ్చని చెబుతున్న సెక్షన్ 377ను సమర్థిస్తూ అప్పుడు ఉత్తర్వులు వెలువరించింది. దీనిపై స్వలింగ సంపర్కుల నుంచే కాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సహా పలువురు నేతల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
న్యాయసూత్రాలకు విరుద్ధం: ప్రాథమిక హక్కులపై సుప్రీం ఇప్పటికే స్పష్టంగా జారీచేసిన పలు న్యాయసూత్రాలకు ఈ తీర్పు విరుద్ధంగా ఉందని కేంద్రం తన పిటిషన్‌లో పేర్కొంది. అందుకు సంబంధించిన 76 ఆధారాలను పొందుపరిచింది. ఈ కేసులో వెలువరించిన తీర్పులో న్యాయ తప్పిదాలు ఉన్నాయని వివరించింది. స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత చాలామంది స్వలింగ సంపర్కులు తమ అలవాటు గురించి కుటుంబాలు, పని ప్రదేశాలు, విద్యాసంస్థలు తదితర చోట్ల వెల్లడించారని తెలిపింది. ఈ నేపథ్యంలో సుప్రీం తాజా తీర్పుతో వారంతా ఇబ్బందుల్లో పడ్డారని, వారికి తక్షణమే ఉపశమన చర్యలు అవసరమని నివేదించింది. ‘‘ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేయడంపై పార్లమెంటుదే నిర్ణయాధికారం అని సుప్రీంకోర్టు చెప్పింది. వాస్తవానికి సెక్షన్ 377తో సహా ఐపీసీని 1860లో ఆంగ్లేయులతో కూడిన లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. అందువల్ల సెక్షన్ 377 భారత పార్లమెంటు ఆమోదంతోనే రూపొందిందని చెప్పలేం’’ అని కేంద్రం తన పిటిషన్‌లో వివరించింది. అంతేకాకుండా ప్రపంచంలో చాలా దేశాలు స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేశాయని వెల్లడించింది.
మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదు: జైట్లీ
స్వలింగ సంపర్కం నేరమని పేర్కొంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని బీజేపీ పేర్కొంది. దీనిపై ఇంకా చర్చ ముగియలేదని అభిప్రాయపడింది. ‘‘ఈ అంశంపై చర్చ ముగిసిందని నేను భావించడంలేదు. ఆ సెక్షన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ సెక్షన్ పరిధిలోకి ఏ అంశాలు వస్తాయి, ఏ అంశాలు రావు అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అందువ ల్ల ప్రభుత్వం ఆ అనిశ్చితిని తొలగించాలి’’ అని రాజ్యసభలో విపక్షనేత అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. శుక్రవారమిక్కడ ఫిక్కీ మహిళా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుప్రీం తీర్పును బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ సమర్థించిన విషయాన్ని ప్రస్తావించగా.. కేంద్రం నిర్ణయాన్ని చూసిన తర్వాతే తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సుష్మాస్వరాజ్ స్పష్టంచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.