స్వలింగ సంపర్కం నేరమే:సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోమారు తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను మంగళవారం విచారించిన ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. గే సెక్స్ నేరమేనన్న తీర్పుపై తిరిగి సమీక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను విచారించబోమని పేర్కొంది. గతంలో స్వలింగ సంపర్కంపై ఇచ్చిన తీర్పును జస్టిస్ దత్తు, జస్టిస్ ఎస్.జే.ముఖోపాధ్యాయతో కూడిన ధర్మాసనం సమర్ధించింది.
స్వలింగ సంపర్కం నేరమంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను సమర్థిస్తూ వెలువరించిన తీర్పు వల్ల వేలాదిమంది స్వలింగ సంపర్కులు ప్రాసిక్యూషన్ రిస్క్‌తోపాటు వేధింపులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, అందువల్ల ఆ తీర్పును పునఃపరిశీలించాలని కోరింది.