
‘మధ్యాహ్న భోజనానికి’ బయోమెట్రిక్
అవకతవకల నియంత్రణకు విద్యాశాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో అవతవకలను నియంత్రించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆయా పాఠశాలల్లో భోజనం చేస్తున్న విద్యార్థుల కచ్చితమైన హాజరు వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28,500 పాఠశాలలకు చెందిన సుమారు 21 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ పథ కానికి ప్రభుత్వం ఏటా రూ. 450 కోట్లు ఖర్చు చేస్తోంది.
అయితే విద్యార్థుల సంఖ్యకు, క్షేత్రస్థాయి అధికారులు సమర్పిస్తున్న గణాంకాలకు పొంతన ఉండట్లేదని ఉన్నతాధికారులు ఇటీవల నిర్వహించిన పరిశీలనలో తేలింది. 10 మంది విద్యార్థులు భోజనం చేసిన చోట 25 మంది విద్యార్థులు భోజనం చేసినట్లు కిందిస్థాయి సిబ్బంది తప్పుడు లెక్కలు రాస్తున్నట్లు బయటపడింది. పథకానికి ప్రభుత్వ నిధులు భారీగా దుర్వినియోగమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల కచ్చితమైన వివరాలను తెలుసుకునేందుకు బయోమెట్రిక్ విధానాన్ని విద్యాశాఖ ఎంచుకుంది. తొలి దశలో ప్రతి జిల్లా నుంచి ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని, ఆపై అన్ని మండలాల్లోని పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను అమర్చేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. మొత్తం 28,500 పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటు, వాటి నిర్వహణకు అయ్యే ఖర్చుపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం బడ్జెట్‌లో తగినన్ని నిధులిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
కరువు మండలాల్లో వేసవిలోనూ...
ప్రభుత్వం ప్రకటించిన 231 కరువు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విద్యాశాఖ డెరైక్టర్ ఆదేశాలు జారీచేశారు. వేసవిలో మధ్యాహ్న భోజనానికి ఏయే పాఠశాల నుంచి ఎంత మంది విద్యార్థులు హజరయ్యే అవకాశం ఉందో జిల్లాలవారీ వివరాలు తెలియజేయాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు విద్యాశాఖ డెరైక్టర్ ఆదేశాలిచ్చారు. వేసవిలో పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు పాఠ్యాంశాలు కాకుండా క్రీడలు, సాంస్కృతిక అంశాలపై ఆసక్తి పెంపొందించే కార్యాక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం.