ముంబై: రాష్ట్రంలోని పేదలు ఆకలితో పస్తులుండకుండా చూడటమే లక్ష్యంగా పేదలకు పది రూపాయలకే భోజనం అందించే అపూర్వమైన పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 'శివ్ భోజన్' పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరంభించింది. ఈ పథకాన్ని మహారాష్ట్ర మంత్రి అస్లామ్ షేక్ రద్దీ ఎక్కువగా ఉండే నాయిర్ ఆసుపత్రి వద్ద ప్రారంభించారు. బండ్ర కలెక్టర్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించారు. (ఠాక్రే కుటుంబం నుంచి మరో వారసుడు..)
ఈ పథకాన్ని ప్రవేశపెడతామని శివసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తరువాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి 'మహా అఘాడీ' ప్రభుత్వం ఏర్పాటు కాగా, మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా థాక్రే కదులుతున్నారు. శివ్ భోజన్ ప్లేటులో రెండు చపాతిలు, ఒక ఆకుకూర, అన్నం, పప్పు ఉంటుందని చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేదలకు అందుబాటులో ఉంటుందని వారు వివరించారు. ప్రతి క్యాంటీన్‌లో సుమారు 500 ప్లేట్ల శివ్ భోజన్ పథకాన్ని పేదలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని అధికారులు తెలిపారు. తొలి రోజునే అనూహ్యమైన స్పందన లభించిందని, పేదలు బారులు తీరి ఖరీదు చేశారన్నారు. ఇంత తక్కువ ధరకు అందిస్తున్నందున ఈ పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment