
నాసిరకం వంటనూనెతో మధ్యాహ్న భోజనం
♦ దద్దుర్లతో అస్వస్థతకు గురైన విద్యార్థినులు
♦ ధరిపల్లి జెడ్పీపాఠశాలలో సంఘటన
చిన్నశంకరంపేట : మధ్యాహ్న భోజనంలో నాసిరకం వంట నూనె వాడడంతో విద్యార్థులు దద్దుర్లతో అస్వస్థతకు గురైన సంఘటన చిన్నశంకరంపేట మండలం ధరిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నెలకొంది. గురువారం పాఠశాలకు హాజరైన విద్యార్థులకు చేతులపై దద్దుర్లు కనిపించాయి. మధ్యాహ్న భోజన సమయానికి దద్దుర్లతో నొప్పి ఎక్కువ కావడంతో విద్యార్థులు ఆందోళనకు గుర య్యారు. చేతులు, ఇతర శరీర భాగాలపై దద్దుర్లు పెరిగిపోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజన సమయానికి నొప్పి ఎక్కువ కావడంతో రోదించడం మొదలు పెట్టారు.
విద్యార్థుల పరిస్థితిని గమనించిన పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం వెంకటేశం గ్రామ ప్రజాప్రతినిధులకు, విద్యార్థుల తల్లి తండ్రులకు సమాచారం అందించారు. వెంటనే విద్యార్థుల తల్లి తండ్రులు చిన్నశంకరంపేట పీహెచ్‌సీ సిబ్బందికి సమాచారం అందించడంతో డాక్టర్ సువర్ణ సిబ్బందితో వచ్చి వైద్య సేవలు అందించారు. 50 మందికి విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం 108లో మెదక్ ఏరియా అస్పత్రికి తరలించారు. కాగా విద్యార్థులకు దద్దుర్లు రావడానికి నాసిరకం వంటలే కారణమని విద్యార్థుల తల్లి తండ్రులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంఈఓ బాల్‌చంద్రం, చిన్నశంకరంపేట ఎస్‌ఐ నగేష్, ఏఎస్‌ఐ పోచయ్య, ఎంపీటీసీ శ్రీని వాస్, ఉపసర్పంచ్ పాండు పాఠశాలకు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.