
అన్నం కాదది.. విషం
నరసాపురం (రాయపేట)/నరసాపురం రూరల్ : నరసాపురం మండలం చిట్టవరం జెడ్పీ హైస్కూల్‌లో బుధవారం విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనం వారి పాలిట విషమైంది. 40 మంది చిన్నారులను ఆస్పత్రి పాల్జేసింది. రెండు ముద్దలు నోట్లో పెట్టుకోగానే వాంతులు చేసుకుని, కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థుల్ని ఉపాధ్యాయులు, గ్రామస్తులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిం ది. ఈ ఘటనతో చిట్టవరం గ్రామం ఉలిక్కిపడింది.
చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో మిన్నంటింది. భోజనం విషతుల్యం కావడానికి కారణమేంటనేది ఇంకా వెల్లడి కాలేదు. తుప్పు కంపుకొడుతున్న బియ్యూన్ని వండటం వల్ల ఆహా రం కలుషితమైందా.. పప్పు, తోటకూర కూర కలుషితమైం దా.. వంట చేయడానికి ఉపయోగించిన నీళ్లవల్ల ఇలా జరి గిందా అనేది తేలాల్సి ఉంది. ఇదే అన్నం తిన్న పాఠశాల ప్రధానోపాధ్యారుుని సైతం అస్వస్థతకు గురయ్యూరు. వి ద్యార్థులు, ప్రధానోపాధ్యాయిని నరసాపురంలోని ప్రైవే టు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఎవరికీ ప్రమాదం లేదని, అంతా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
తుప్పు బియ్యం.. చేదెక్కిన అన్నం
అన్నం ముద్దను నోట్లో పెట్టుకోగానే కొంతమంది విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయూరు. మరికొందరు వాంతులు చేసుకున్నారు. పాఠశాలలో మొత్తం 184 మంది విద్యార్థులు ఉండగా, 140 మంది తరగతులకు హాజరయ్యూరు. వీరిలో 110మంది పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని ఆటోలు, 108 వాహనంలో నరసాపురంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. పాఠశాలలో వడ్డిస్తున్న అన్నం నాలుగు రోజులుగా తుప్పు వాసన వస్తోందని, నోట్లో పెట్టుకుంటే చేదుగా ఉంటోందని అస్వస్థతకు గురైన విద్యార్థులు చెప్పారు. దీంతో తినకుండా పారబోస్తున్నామన్నారు. ఆకలిని తట్టుకోలేక బుధవారం అన్నం తిన్నామన్నారు. అన్నం బాగుండటం లేదని వంట చేస్తున్న వారికి చెబుతుంటే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుప్పు పట్టిన బియ్యం వల్ల అన్నం ఇలా ఉంటోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
అప్రమత్తమైన అధికారులు
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన నరసాపురం చేరుకున్నారు. ఆస్పత్రులకు వెళ్లి విద్యార్థుల పరిస్థితిని తెలుసుకుని తక్షణ వైద్యసేవలందించేందుకు కృషి చేశారు. జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, డీఎంహెచ్‌వో ఆర్.శంకరరావు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో జె.ఉదయ భాస్కరరావు, తహసిల్దార్ శ్రీపాద హరినాథ్, ఎంపీడీవో శివప్రసాద్‌యాదవ్, ఎంఈవో ప్రసాద్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రైవేటు వైద్యులు ఇలపకుర్తి ప్రకాష్, ఎం.కోటేశ్వరరావు, కేకే జాన్ తదితరులు చిన్నారులకు వైద్య సేవలందించారు. పలువురు ఆర్‌ఎంపీలు సైతం వైద్య సేవల్లో పాలు పంచుకున్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, మునిసిపల్ చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల, వైస్‌చైర్మన్ పొన్నాల నాగబాబు, టీడీపీ నాయకులు బండారు ప్రతాప్‌నాయుడు, డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి, డాక్టర్ రమేష్, చిట్టవరం సర్పంచ్ పోలిశెట్టి సత్తిబాబు తదితరులు విద్యార్థులను పరామర్శించి, వారి తల్లిదండ్రులను ఓదార్చారు.
విచారణకు ఆదేశం
విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై డీఈవో ఆర్.నరసింహరావు విచారణకు ఆదేశించారు. విద్యార్థుల పరిస్థితిని పరిశీలించిన ఆయన ప్రధానోపాధ్యాయిని ఆర్.కుమారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నం చేదుగా ఉందని విద్యార్థులు చెప్పడంతో తాను రుచి చూశానని, ఆ వెంటనే అస్వస్థతకు గురయ్యూనని ప్రధానోపాధ్యాయిని చెప్పారు. తక్షణమే విచారణ నిర్వహించి 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఎంఈవోను డీఈవో ఆదేశించారు.
ఇదే అంశంపై మరో మండలస్థాయి అధికారి కూడా విచారణ నిర్వహిస్తారని డీఈవో చెప్పారు. డీఎంహెచ్‌వో ఆర్.శంకరరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఐసీయూలో 18మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ఇప్పటికే చాలామందిని డిశ్చార్జి చేశారని, మిగిలిన వారిని గురువారం డిశ్చార్జి చేస్తారని తెలిపారు. పప్పు వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని భావిస్తున్నామన్నారు. సాల్మనెల్లా అనే బాక్టీరియా వల్ల ఇటువంటి పరిస్థితి వస్తుందన్నారు. ఆహారాన్ని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు వైద్యులు సత్వర సేవలందించడం వల్లే విద్యార్థులు కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు.