’తిండి’తిప్పలు
’తిండి’తిప్పలు
Published Tue, Aug 29 2017 10:34 PM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM
వరండాల్లోనే భోజనం
పాఠశాలల్లో విద్యార్థుల అవస్థలు
డైనింగ్ హాళ్లు ఏవీ?
వంటషెడ్లూ లేవు
పట్టించుకోని సర్కారు
అధికారులదీ అదే తీరు
వీరవాసరం : విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నామని గొప్పలు పోతున్న సర్కారు పాఠశాలల్లో వసతుల కల్పనలో విఫలమవుతోంది. ఫలితంగా పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన సమయంలో వారి అవస్థలు వర్ణణాతీతం. డైనింగ్ హాళ్లు లేక విద్యార్థులు పాఠశాలల్లో వరండాల్లోనూ, ఆరుబయట కూర్చుని తినాల్సి వస్తోంది. వానొస్తే తరగతి గదుల్లోకి పరుగులు తీయాల్సిన దుస్థితి.
ఒక్కచోటా డైనింగ్ హాల్ లేదు
జిల్లా వ్యాప్తంగా 2,564 ప్రాథమిక , 247 ప్రాథమికోన్నత, 507 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3,318 పాఠశాలలు ఉన్నాయి. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. భీమవరం డివిజన్ లో 563 ప్రాథమిక పాఠశాలలు, 41 ప్రాథమికోన్నత పాఠశాలలు, 97 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా ఏ ఒక్క పాఠశాలలోనూ డైనింగ్ హాలు లేదు. అలాగే 20శాతం పాఠశాలల్లో వంటషెడ్లు లేవు. దీంతో విద్యార్థులతోపాటు మధ్యాహ్న భోజన నిర్వాహకులూ ఇబ్బందులు పడుతున్నారు. ఆరుబయట లేదా, ఇళ్ల వద్ద వంట చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి పాఠశాలలన్నింటిలోనూ డైనింగ్‌హాళ్లు, వంట షెడ్లు నిర్మించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఎండనకా.. వాననకా.. అవస్థలు
మధ్యాహ్న భోజనం చేయడానికి ఎండనకా.. వాననకా ఇబ్బంది పడుతున్నాం. వర్షం వస్తే నేలంతా బురదమయంగా తయారై ఆవరణలో తినడానికి నానా అవస్థలు పడుతున్నాం. మాకు డైనింగ్ హాళ్లు నిర్మించాలి.
వి.నరేష్, విద్యార్థి
కింద కూర్చోవాలంటే అవస్థ
మాకు కింద కూర్చొని భోజనం చేయాలంటే ఇబ్బందిగా ఉంది. చేతిలో ప్లేటు పట్టుకుని నుంచొని తినాలంటే రసం, సాంబార్లు దుస్తులపై పడి పోతున్నాయి. త్వరగా తిని తరగతులకు వెళ్ల లేక పోతున్నాం. భోజనాలకు ప్రత్యేక గదులు, బల్లలు ఉంటే బాగుంటుంది.
మహేశ్వరి, విద్యార్థిని
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
ప్రభుత్వ పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ముందుగా బాలికల హైస్కూళ్లలో డైనింగ్ హాల్ నిర్మించడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నాం.
ఆర్.ఎస్.గంగా భవానీ, డీఈఓ
Advertisement