‘మధ్యాహ్నం’ అధ్వానం..!
♦ అధికారుల పర్యవేక్షణలోపమే కారణం
♦ ఆకలితో తింటే ఆస్పత్రుల పాలవుతున్నవైనం
మెదక్ : మధ్యాహ్న భోజనం అధికారుల పర్యవేక్షణలోపంతో అధ్వానంగా మారింది. ఫలితంగా భోజనం తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. జిల్లాలో మొత్తం 3వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 5లక్షల మేర విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే మధ్యాహ్న భోజనంపై అధికారులు పర్యవేక్షణ పెట్టకపోవడంతో విద్యార్థులు నిర్వాహకులు వండిందే తినాల్సి వస్తోంది. కాగా గత పది రోజుల క్రితం మెదక్ మండల పరిధిలోని బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 60మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రుల పాలయ్యారు.
అలాగే చిన్నశంకరంపేట మండల దర్పల్లి ఉన్నత పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనం తిన్న 15మంది చిన్నారులకు శరీరమంతా దద్దుర్లు వచ్చాయి. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వానమైన భోజనం పెట్టడంతో విద్యార్థుల ప్రాణాలమీదకు వస్తోంది. ఈ రెండు సంఘటనలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే జరగడంతో జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామంటూ ప్రచారంచేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఏమాత్రం పరిశీలించడం లేదనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
కూచన్‌పల్లి ఉన్నత పాఠశాలలో వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఆస్పత్రి పాలుకాగా ఆ మరుసటి రోజు అధికారులు పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. ముక్కిపోయి పురుగులతో ఉండలుకట్టిన బియ్యంతో వం టచేసి పిల్లలకు పెట్టడంతో వాంతులు, విరేచనాలైనట్లు అధికారులు గుర్తించారు. అలాగే చిన్నశంకరంపేట మండలం దర్పల్లి ఉన్నత పాఠశాలలో సైతం నాణ్యతలేని వంటనూనె వాడటం వల్లే విద్యార్థులకు దద్దుర్లు వచ్చినట్లు గుర్తించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు నెలనెలా బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడంలేదు. దీంతో వంట నిర్వాహకులు నాణ్యతను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వండి పెడుతుండటం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నెలనెలా వంట నిర్వాహకుల బిల్లులను చెల్లిస్తే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.