monitoring error
-
పునాదుల్లోనే ప్రగతి
♦ పంచాయతీ భవనాలకు గ్రహణం ♦ 82 మంజూరు కాగా 15 పూర్తి ♦ నిర్మాణంలో తీవ్ర జాప్యం ♦ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే.. మంజూరైన నిధులు : రూ.9.84కోట్లు ఒక్కో భవన నిర్మాణానికి : రూ.12కోట్లు ఆదిలాబాద్: జిల్లాలో పలు గ్రామాల్లో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయి. భవనాలతో గ్రామాలకు కొత్తకళ వస్తుందని ఆశించిన పంచాయతీ సభ్యులు, గ్రామస్తులకు నిరాశే మిగులుతోంది. ప్రతీరోజు కళ్లెదుటే పిల్లర్లు, మొండిగోడలతో అసంపూర్తి భవనాలు కనిపిస్తుండడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంజినీరింగ్ అధికారులు నిర్మాణ పనులు పూర్తి చేయించకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో గతేడాది ఈజీఎస్ కింద జిల్లాకు 82గ్రామపంచాయతీ నూతన భవనాలు మంజూరు కాగా రూ.9.84 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.12లక్షలు కేటాయించారు. అయినా పంచాయతీ భవన నిర్మాణ పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. కొనసా.. గుతున్న పనులు.. జిల్లాలో గతేడాది మంజూరైన పంచాయతీ భవన నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 243 గ్రామపంచాయతీలుండగా 82 గ్రామపంచాయతీలకు గతేడాది ప్రభుత్వం నూతన –భవనాలు మంజూరు చేసింది. 82 భవనాల్లో 15 పంచాయతీ భవనాలు మాత్రమే పూర్తి కాగా ఇంకా 57 నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. పది భవనాల పనులు ఇంకా ప్రారంభించకపోవడం శోచనీయం. జిల్లాలో చాలా చోట్ల బేస్మెంట్, పిల్లర్లు, రూఫ్లెవల్లోనే భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే కాంట్రాక్టర్లకు సరిగా బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు చేపట్టకుండా చేతులు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా భవన నిర్మాణ పనులు పూర్తికావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయకుంటే ఇప్పటికే పనులు పూర్తి చేసేవారని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుంటే భవన నిర్మాణాలు పూర్తవుతాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కార్యక్రమాలకు ఇబ్బందులే.. పంచాయతీల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఇబ్బందులు పడాల్సిందే. ఇటు పంచాయతీ భవనాలు లేక, అటు సరైన సౌకర్యాలు లేక ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. భవనాలు లేకపోవడంతో పంచాయతీల్లో నిర్వహించే గ్రామసభలు, ఇతర కార్యకలాపాలు చెట్ల కింద, ఇతర ప్రైవేట్ స్థలాల్లో నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు కూడా తమ కార్యకలాపాలు నిర్వహించడం ఇబ్బందిగా మారుతోందని వాపోతున్నారు. ప్రతీనెల పం పిణీ చేసే ఆసరా పింఛన్లు కూడా లబ్ధిదారులకు చెట్ల కింద, పాఠశాలల్లో పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్మి స్తున్న పంచాయతీ భవనాలను త్వరగా పూర్తి చేసి సరైన సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
‘మధ్యాహ్నం’ అధ్వానం..!
♦ అధికారుల పర్యవేక్షణలోపమే కారణం ♦ ఆకలితో తింటే ఆస్పత్రుల పాలవుతున్నవైనం మెదక్ : మధ్యాహ్న భోజనం అధికారుల పర్యవేక్షణలోపంతో అధ్వానంగా మారింది. ఫలితంగా భోజనం తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. జిల్లాలో మొత్తం 3వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 5లక్షల మేర విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే మధ్యాహ్న భోజనంపై అధికారులు పర్యవేక్షణ పెట్టకపోవడంతో విద్యార్థులు నిర్వాహకులు వండిందే తినాల్సి వస్తోంది. కాగా గత పది రోజుల క్రితం మెదక్ మండల పరిధిలోని బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 60మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రుల పాలయ్యారు. అలాగే చిన్నశంకరంపేట మండల దర్పల్లి ఉన్నత పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనం తిన్న 15మంది చిన్నారులకు శరీరమంతా దద్దుర్లు వచ్చాయి. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వానమైన భోజనం పెట్టడంతో విద్యార్థుల ప్రాణాలమీదకు వస్తోంది. ఈ రెండు సంఘటనలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే జరగడంతో జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామంటూ ప్రచారంచేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఏమాత్రం పరిశీలించడం లేదనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. కూచన్‌పల్లి ఉన్నత పాఠశాలలో వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఆస్పత్రి పాలుకాగా ఆ మరుసటి రోజు అధికారులు పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. ముక్కిపోయి పురుగులతో ఉండలుకట్టిన బియ్యంతో వం టచేసి పిల్లలకు పెట్టడంతో వాంతులు, విరేచనాలైనట్లు అధికారులు గుర్తించారు. అలాగే చిన్నశంకరంపేట మండలం దర్పల్లి ఉన్నత పాఠశాలలో సైతం నాణ్యతలేని వంటనూనె వాడటం వల్లే విద్యార్థులకు దద్దుర్లు వచ్చినట్లు గుర్తించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు నెలనెలా బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడంలేదు. దీంతో వంట నిర్వాహకులు నాణ్యతను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వండి పెడుతుండటం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నెలనెలా వంట నిర్వాహకుల బిల్లులను చెల్లిస్తే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఎంఈఓల బదిలీలు జరిగేనా?
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : జిల్లా విద్యాశాఖలో సిబ్బంది కొరతతో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న ఎంఈఓలను (మండల విద్యాశాఖాధికారులు) బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులకు ముందు సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా విద్యాశాఖ అందుకు సంబంధించిన వివరాలను అందజేసింది. ఈ నెల ప్రారంభం నుంచి జన్మభూమి కార్యక్రమం ప్రారంభంతో ఎంఈఓల బదిలీలు ఆగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని 46 మండలాల్లో కేవలం 13 మంది రెగ్యులర్ ఎంఈఓలు పనిచేస్తున్నారు. ఈ 13 మందిలో ఇటీవల కలిగిరి ఎంఈఓ సస్పెండయ్యారు. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లో 34 మంది ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో పాఠశాలల పనితీరును పర్యవేక్షించడంలో తీవ్ర అనాసక్తి వ్యక్తమవుతుంది. కొంత మంది ఇన్చార్జి ఎంఈఓలు తమను ప్రధానోపాధ్యాయులుగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్న భోజనపథకం, ఆధార్‌కార్డుల నమోదు, ఎస్ఎస్ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ విధులకు తోడు 20 రోజుల జన్మభూమి, స్వచ్ఛభారత్ కార్యక్రమాల నిర్వహణ తలకు మించిన భారం అవుతుందని వారి వాదన. దీంతో పాఠశాలల పర్యవేక్షణను పట్టించుకునే అవకాశం లేకుండా పోతుందని ఎంఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంఈఓల బదిలీలకు గుంటూరు ఆర్జేడీ కార్యాలయం స్థాయిలో కసరత్తు ముగిసిందని సమాచారం. బదిలీలపై ఉపాధ్యాయ సంఘాల్లో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జోనల్ స్థాయిలో బదిలీలు జరగాలని కొంత మంది, జిల్లాల వారీగా బదిలీలు జరగాలని మరి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తమ తమ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎంఈఓల బదిలీలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్నా పాఠశాలల పనితీరుపై పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. జన్మభూమి అనంతరం బదిలీలు ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే రాజకీయ పైరవీలు నడిపేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తం మీద విద్యార్థి కేంద్రంగా అధికారులు పనిచేయలేకపోయే అంతటి ఒత్తిడి ఎంఈఓలపై ఉండడంపై పలు విమర్శలకు తావిస్తోంది.