నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : జిల్లా విద్యాశాఖలో సిబ్బంది కొరతతో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న ఎంఈఓలను (మండల విద్యాశాఖాధికారులు) బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులకు ముందు సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా విద్యాశాఖ అందుకు సంబంధించిన వివరాలను అందజేసింది. ఈ నెల ప్రారంభం నుంచి జన్మభూమి కార్యక్రమం ప్రారంభంతో ఎంఈఓల బదిలీలు ఆగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని 46 మండలాల్లో కేవలం 13 మంది రెగ్యులర్ ఎంఈఓలు పనిచేస్తున్నారు. ఈ 13 మందిలో ఇటీవల కలిగిరి ఎంఈఓ సస్పెండయ్యారు. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లో 34 మంది ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మండల స్థాయిలో పాఠశాలల పనితీరును పర్యవేక్షించడంలో తీవ్ర అనాసక్తి వ్యక్తమవుతుంది. కొంత మంది ఇన్‌చార్జి ఎంఈఓలు తమను ప్రధానోపాధ్యాయులుగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్న భోజనపథకం, ఆధార్‌కార్డుల నమోదు, ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ విధులకు తోడు 20 రోజుల జన్మభూమి, స్వచ్ఛభారత్ కార్యక్రమాల నిర్వహణ తలకు మించిన భారం అవుతుందని వారి వాదన. దీంతో పాఠశాలల పర్యవేక్షణను పట్టించుకునే అవకాశం లేకుండా పోతుందని ఎంఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఎంఈఓల బదిలీలకు గుంటూరు ఆర్‌జేడీ కార్యాలయం స్థాయిలో కసరత్తు ముగిసిందని సమాచారం. బదిలీలపై ఉపాధ్యాయ సంఘాల్లో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జోనల్ స్థాయిలో బదిలీలు జరగాలని కొంత మంది, జిల్లాల వారీగా బదిలీలు జరగాలని మరి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తమ తమ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎంఈఓల బదిలీలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్నా పాఠశాలల పనితీరుపై పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. జన్మభూమి అనంతరం బదిలీలు ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే రాజకీయ పైరవీలు నడిపేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తం మీద విద్యార్థి కేంద్రంగా అధికారులు పనిచేయలేకపోయే అంతటి ఒత్తిడి ఎంఈఓలపై ఉండడంపై పలు విమర్శలకు తావిస్తోంది.
ఎంఈఓల బదిలీలు జరిగేనా?
Published Tue, Oct 7 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement