పాత వంట.. కొత్త మంట
మధ్యాహ్న భోజనంలో కొత్తపద్ధ్దతి
► ఐదారు మండలాలకు ఒక వంటశాల
► అక్కడ నుంచే పాఠశాలలకు మధ్యాహ్న భోజనం
► పరిశీలించి ప్రతిపాదనలు పంపనున్న అధికారులు
► ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకు శ్రీకారం మెమోలు జారీ
► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏజెన్సీల నిర్వాహకులు
నెల్లూరు (టౌన్) : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహణలో నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రసుత్తం పాఠశాలల్లో వంట చేసి భోజనం వడ్డించే విధానానికి చెక్ పెట్టనున్నారు. కేంద్రీకృత మధ్యాహ్న భోజన విధానాని(సెంట్రలైజ్డ్ మిడ్‌డే మీల్స్ సిస్టమ్)కి శ్రీకారం చుట్టనున్నారు. దీనిని 2017–18 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలోసెంట్రలైజ్డ్ మిడ్‌డే మీల్స్ సిస్టమ్ నిర్వహణకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలని జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది జిల్లాలో 5 ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించారు. 2018–19 విద్యా సంత్సరం నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్(కేంద్రీయ భోజన వంటశాల) ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కేంద్రీయ వంటశాలకు 5 అనువైన ప్రాంతాలను గుర్తించాలని డెప్యూటీ ఈఓలు, ఎంఈఓలకు జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు పంపారు. ప్రస్తుతం వెంకటాచలంతో పాటు పలు పట్టణ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్రవిద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నారు.
జిల్లాలో మొత్తం 3,441 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న 2,29,434 మంది విద్యార్థులకు భోజనాన్ని వడ్డిస్తున్నారు. అయితే మధ్యాహ్న భోజన నిర్వహణలో లోపాలు ఉన్నాయని, కొంతమంది వంట ఏజెన్సీ నిర్వాహకులు అపరిశుభ్ర వాతావరణంలో రుచి లేకుండా వండి పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్ విధానానికి నాంది పలుకుతోంది. ఒకే వంటశాలలో 22 వేల నుంచి 25వేల మంది వరకు పిల్లలకు సకాలంలో వండి పంపిణీ చేసే పనిని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అంత సామర్థ్యం ఉన్న స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలని జిల్లా విద్యాశాఖను ఉన్నతాధికారులు ఆదేశించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్‌కు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కిచెన్ స్టోర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలను వాటి పరిధిలోకి చేర్చనున్నారు.
ఐదారు మండలాలకు ఒకటి
జిల్లాలో విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి ఐదారు మండలాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అ వంటశాల నిర్వహణకు రెండు ఎకరాల వీస్తీర్ణం కలిగి ఉండాలని నిర్ణయించారు. 20 కిలో మీటర్ల దూరంలో ఉండే పాఠశాలలు ఈ వంటశాల పరిధిలోకి వచ్చే విధంగా ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారు. వంటశాలలో భోజనం, కూరలు వండి ఆయా పాఠశాలలకు వాహనాల్లో తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇస్కాన్ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నారు. ఈ విధానంలో పెద్దగా లోపాలు లేకపోవడం, నాణ్యత కలిగి ఉండటంతో జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
డ్వాక్రా మహిళల ఆగ్రహం
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇతరులకు అప్పజెప్పడంపై డ్వాక్రా మహిళలు, ఏజెన్సీ నిర్వాహకులు, కార్మికులు మండిపడుతున్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గతనెల 19న మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మెమోలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 3వేలకు పైగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఉన్నాయి. వీరిలో 90శాతానికి పైగా డ్వాక్రా మహిళలే. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అనేకమంది మహిళలు కూడా ఉపాధి పొందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆరేడు నెలల నుంచి బిల్లులను నిలిపివేసినా కొంతమంది ముందుగానే పెట్టుబడులు పెట్టి భోజనం వడ్డిస్తున్న సందర్భాలున్నాయి. మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం అర్ధంతరంగా ఒకే కేంద్రీయ వంటశాల విధానం అమలు చేస్తే దీని మీద బతుకుతున్న వేలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతారని చెబుతున్నారు.
నిర్ణయం ఉపసంహరించుకోవాలి
మధ్యాహ్న భోజన పథకం ద్వారా జిల్లాలో వేలాదిమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అకస్మాత్తుగా సెంట్రలైజ్‌డ్ కిచెన్ స్టోర్స్‌ను తెస్తే వీరంతా ఎటుపోవాలి? మహిళా సాధికారిత కోసం ఇసుక, డ్వాక్రా రుణాలు అందజేస్తామని చెప్పిన చంద్రబాబు తర్వాత పట్టించుకోలేదు. తాజా నిర్ణయంతో మధ్యాహ్న భోజనం వడ్డించి ఉపాధి పొందుతున్న మహిళలు అన్యాయమైపోతారు. దీనిమీద ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను కలిసి ఉద్యమ బాట పడతాం. – రెహనాబేగం, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా గౌరవాధ్యక్షురాలు
ప్రతిపాదనలు పంపమన్నారు
సెంట్రలైజ్డ్ మిడ్‌డే మీల్స్ సిస్టమ్ అమలుకు తగు ప్రాంతాలు గుర్తించి ప్రతిపాదనలు పంపమని ఉన్నత విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో ఐదు ప్రాంతాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. మరో రెండు రోజుల్లో గుర్తించిన ప్రాంతాలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనంతరం అత్యున్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నాం. ఈ ఏడాది నుంచి కొత్త విధానం ప్రారంభమవుతుంది. – రామలింగం, డీఈఓ